construction of buildings
-
లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం ముమ్మరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు పక్కా సొంత భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 27,490 అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలున్నట్లు గుర్తించారు. వీటిలో 25,455 కేంద్రాలకు ప్రభుత్వం సొంత స్థలాలను గుర్తించింది. ఇందులో ఇప్పటికే 9,143 కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.386.88 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 7,996 భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 4,466 భవనాల నిర్మాణం కూడా పూర్తయింది. మరో 1,133 భవనాల పనులు బేస్మెంట్ స్థాయిలో, 1,025 భవనాలు గ్రౌండ్ ఫ్లోర్ శ్లాబ్ స్థాయిలో ఉన్నాయి. 1,372 భవనాలకు శ్లాబ్ కూడా పూర్తయింది. -
బహుళ అంతస్తుల ప్రేమ..!
సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో టీడీపీ నేత బరితెగింపు హద్దులు దాటింది. ప్రభుత్వ భూములు కజ్జా చేసి పెద్దపెద్ద భవంతులు నిర్మాణం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఆక్రమించి భవంతి నిర్మాణం చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అడ్డుకొనే ప్రయత్నం చేయలేకపోయారు. ఉదయగిరి మండలం కొండాయపాళెం రెవెన్యూ పరిధిలో గంగిరెడ్డిపల్లి సమీపంలోని సర్వే నంబరు 533/2లో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ మండల స్థాయి నేత మన్నేటి వెంకటరెడ్డి తండ్రి మన్నేటి పాపిరెడ్డి దశాబ్దకాలం క్రితం ఆక్రమించి రేకుల షెడ్ నిర్మాణం చేశాడు. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఖరీదైన భూమి కావడంతో సదరు టీడీపీ నేత తన తండ్రి ఆక్రమణలో ఉన్న సర్వే నంబర్‌లోనే అదనంగా 0.43 ఎకరాల భూమిని కూడా కజ్జా చేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఆయన కనుసన్నలో పని చేసేవారు కావడంతో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించినా అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అత్యంత సన్నిహిత నేత కావడంతో రెవెన్యూ అధికారులు సైతం భూకజ్జాపై చర్యలు చేపట్టలేదు. ఆక్రమిత భూమిలో భారీ భవంతి నిర్మాణం టీడీపీ నేత అక్రమించిన భూమిలో బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించారు. గత ఏడాది కాలంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీగానే డీల్ కుదిరినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.2 కోట్లు విలువైన భూమిని కజ్జా చేసి రూ. కోటి విలువైన అక్రమ కట్టడం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తుంది. 40 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా ఇదే నేత మండలంలోని కొండాయపాళెం రెవెన్యూ పరిధిలోని దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు స్థానికులు తెలిపారు. తన బినామీల పేర్లతో రెవెన్యూ రికార్డులను తారు మారు చేయించి సొంతం చేసుకుని జామాయిల్ పంట సాగు చేశారని తెలిసింది. ఆయా ప్రభుత్వ భూములకు డీ–ఫారం పట్టాలు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదని తెలిసింది. ఓ పేద రైతు సెంటు భూమి ఆక్రమిస్తే కర్రపెత్తనం చేసే రెవెన్యూ యంత్రాంగం కోట్లు విలువచేసే భూమిని టీడీపీ నేత యథేచ్ఛగా కజ్జా చేసినా అధికారులు మౌనం దాల్చిన తీరు విమర్శలకు తావిస్తోంది జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. టీడీపీ నేత భూకజ్జాలపై గతంలో స్థానిక మండలాధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేదని ఆయన ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసినా కూడా సదరు టీడీపీ నేత అక్రమితి భూమిలో బహుళ అంతస్తు భవన నిర్మాణం అధికారులు నిలువరించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేత కావడంతో భూకజ్జాదారుడిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకంజ వేశారన్నారు. అదే సన్నకారు రైతు సెంటు భూమిని అక్రమిస్తే వెంటనే దండించే అధికారులకు టీడీపీ నేత భూకజ్జా కనిపించపోవడం దారుణమన్నారు. -
సీఎం కేసీఆర్ వరాలపై మథనం!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటవెంటనే నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 30 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలాలను, నిధులను ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. బీసీల్లోని 30 కులాల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను, నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ మరో పది ఉత్తర్వులను జారీ చేశారు. – బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని స్థలాలను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. భవనాల నిర్మాణానికి రూ.58.75 కోట్లను కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొంది. ► ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎస్సీ వర్గాల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. ► నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.2.81 కోట్లను మంజూరు చేసింది. ► మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో భీమా నది పుష్కరాల పనుల కోసం రూ.5 కోట్లు కేటాయించింది. ► పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 242 అభివృద్ధి పనుల కోసం రూ.2.30 కోట్లను విడుదల చేసింది. ► వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల–ఎర్రగట్టు గుట్ట రోడ్డు వెడల్పు పనుల కోసం రూ.4.45 కోట్లను కేటాయించింది. ► సూర్యాపేట జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం రూ.3.62 కోట్లను కేటాయించింది. -
టెండర్లు మరిచారు..
సాక్షి, ఆదిలాబాద్: కోట్ల రూపాయల పనులిచ్చారు.. టెండర్లు మాత్రం మరిచారు.. ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు.. పనులకు సంబంధించి ఇక్కడి నుంచి అంచనా వ్యయాలు రూపొందించి పంపించినప్పటికీ సాంకేతిక అనుమతి రాలేదు. టెండర్లకు మోక్షం కలగడం లేదు. అప్పట్లో మున్సిపాలిటీ పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. టెండర్లకు సంబంధించి వివిధ దశల ప్రక్రియలను పూర్తి చేయడంలో జిల్లా ఆర్అండ్బీ అధికారుల లోపమా, లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో పనులకు అనుమతినివ్వడంలో ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయం నుంచే జాప్యం జరుగుతుందా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో మున్సిపాలిటీ పనులు చేపట్టే పరిస్థితి లేదని ఆర్‌అండ్‌బీకి అప్పగించగా ఇప్పుడు ఆర్అండ్బీ తీరుతో విస్మయం వ్యక్తమవుతోంది. రూ.28 కోట్ల పనులు.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం బడ్జెట్లోనే ప్రత్యేక నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి ప్రతీ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల పనులను మంజూరు చేసింది. ఆదిలాబాద్ మున్సిపాలిటిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీఓఆర్టీ నెం.187 ద్వారా 2018 మార్చి 22న రూ.28.30 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు మంజూరై దాదాపు ఐదు నెలలు అవుతోంది. అప్పట్లో ఈ పనులను మున్సిపాలిటీ నుంచి ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. దీనిపై మున్సిపల్ కాంట్రాక్టర్లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపాలిటీలో ఈ పనులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బీకి అప్పగించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఈ పనులను చేపట్టలేదని ఒకవేళ భావిస్తే ఇప్పుడు ఆర్అండ్బీ టెండర్ల దశకు తీసుకొచ్చేందుకే ఆపసోపాలు పడుతోంది. ఐదు నెలల క్రితం మంజూరైన ఈ నిధులను అప్పట్లోనే వినియోగించుకుంటే ఇప్పటికే పనులు కూడా ఓ దశకు వచ్చేవి. ఇప్పుడు వర్షాలు కురుస్తుండడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఆర్అండ్బీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్కా మార్చిలో మంజూరైన ఈ నిధులకు సంబంధించి ఒకవేళ తామే చేపట్టి ఉంటే ఈపాటికి పనులను ప్రారంభించేవారని మున్సిపల్ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఎక్కడ లోపం.. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో పలు ముఖ్యమైన మార్గాల్లో రోడ్లు, డివైడర్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, భారీ మురికి కాల్వల నిర్మాణాల కోసం ఈ నిధుల ద్వారా అంచనా వ్యయాలు రూపొందించారు. వీటిని స్థానిక ఆర్అండ్బీ అధికారులు సీఈ పరిశీలన కోసం పంపించారు. దానికి సంబంధించి సాంకేతిక అనుమతినిచ్చిన పక్షంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలుస్తారు. అయితే అంచనా వ్యయం రూపొందించి ఇక్కడి నుంచి పంపించామని అధికారులు చెబుతున్నారు. మరి సాంకేతిక అనుమతినివ్వడంలో ప్రధాన కార్యాలయంలో జాప్యం ఎందుకు జరుగుతుందన్నది వారికే తెలియాలి. ప్రధానంగా రోడ్లు, భవనాల నిర్మాణాలు ఉండడంతో వేర్వేరు సీఈలు సాంకేతిక అనుమతులివ్వాల్సి ఉంటుందని, దీనివల్లే ఆలస్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా, కాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బీలో పోస్టుల ఖాళీ నేపథ్యంలో టెండర్ల నిర్వహణ క్రమాలకు సంబంధించి ఇక్కడే జాప్యం జరిగిందన్న విమర్శలు లేకపోలేదు. ఇవి మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కావడం, కేటాయించిన నిధుల్లో అధిక పనులు, అంచనా వ్యయాలు ఉండడంతోనే ఆర్అండ్బీ అధికారులు కొంత నిర్లక్ష్యం చేస్తున్నారన్న అపవాదు వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆర్అండ్బీ చేపట్టే పనులు తక్కువ సంఖ్యలో ఉన్నా అవి వందల వేల కోట్ల రూపాయల విలువైనవి ఉంటాయి. అలాంటి సమయంలో మున్సిపాలిటీకి సంబంధించి కేవలం కొన్ని కోట్ల రూపాయల్లోనే వందల సంఖ్యలో పనుల అంచనా వ్యయాలను రూపొందించడంతో దానికి సాంకేతిక అనుమతినివ్వడంలో పైనుంచి ఆల స్యం జరుగుతుందన్న అభిప్రాయం లేకపోలేదు. 117 పనులు.. రూ.28 కోట్లకు సంబంధించి 117 పనుల అంచనా వ్యయాలను రూపొందించారు. అందులో ప్రధానంగా రిమ్స్ వెనకాల, మహాలక్ష్మివాడలో డ్రైనేజీల నిర్మాణాలు, వివేకానంద చౌక్‌నుంచి రైల్వే స్టేషన్ వరకు, పంజాబ్‌చౌక్ నుంచి దేవిచంద్చౌక్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు చేపట్టాలి. సిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా డివైడర్లలో అందమైన మొక్కలు, ఫౌంటేయిన్స్, పెయింటింగ్స్, తదితరవి చేపట్టాలి. అసంపూర్తిగా మిగిలిన కొత్త మున్సిపాలిటీ భవనానికి సంబంధించి మరో మూడున్నర కోట్లు ఈ నిధుల నుంచే కేటాయించారు. పలుచోట్ల బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. అంచనా వ్యయాలు రూపొందించి పంపించాం మున్సిపాలిటీలో రూ.28 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనా వ్యయాలను రూపొందించి పంపించాం. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు నిర్వహిస్తాం. ప్రభుత్వం నుంచి ఆర్‌అండ్‌బీకి జీఓ రావడంలోనే ఆలస్యం జరిగింది. ఈ నిధుల్లో రోడ్లతోపాటు భవనాల నిర్మాణాలు కూడా ఉండడంతో హెడ్ ఆఫీసులో వేర్వేరు సీఈల నుంచి సాంకేతిక అనుమతి లభించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇవి తుది దశకు వచ్చింది. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం. – వెంకట్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ, ఆదిలాబాద్ -
కుప్పానికి 79 వ ర్యాంకు
స్థానిక నేతల పనితీరుపై సీఎం మం డిపాటు కుప్పం: రెండేళ్లు పూర్తిచేసుకున్న ఎమ్మెల్యేల పనితీరుపై వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి విడుదల చేసిన ర్యాంకుల్లో కుప్పంకు 79వ స్థానం దక్కింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి 79వ స్థానం దక్కడంపై టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్ అయ్యూరు. సీఎం పనితీరు 79వ స్థానానికి పడిపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. మందకొడిగా సాగుతున్న అభివృద్ధి పనులు.. రూ.1,450 కోట్ల రూపాయులతో అభివృద్ధి పనులకు గత పర్యటనలో ముఖ్యమంత్రిచంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.269 కోట్లతో సిమెంటు రోడ్లు, బిటి రోడ్లు వేసేందుకు నిధులు వుంజూరయ్యాయి. రూ.50 కోట్లతో నియోజకవర్గంలోని పల్లెల్లో సిమెంటు రోడ్లు వేశారు. ప్రత్యేక కోటా కింద విడుదలైన నిధులను వినియోగించుకోకపోవడంతో అవి వెనక్కువెళ్లాలయి. సీసీ రోడ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రోడ్డు విస్తరణ, భవనాల నిర్మాణం, స్పోర్ట్స్ స్టేడియుం, హార్టికల్చర్ హబ్ లాంటి వివిధ అభివృద్ధి కార్యక్రవూలు ప్రారంభానికి నోచుకో లేదు. టీడీపీ కేడర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదని తేలింది. ఇవన్నీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరును వెన క్కు నెట్టాయి. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ నేతలు సక్రవుంగా పనిచేయుకపోవడంతో వెనుకబడాల్సి వచ్చిందని స్థానికులు అంటున్నారు. స్థానిక నేతలపై సీఎం ఫైర్.. కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలో 79వ స్థానంలో నిలవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక నేతలపై వుండిపడినట్లు తెలిసింది. కోట్ల రూపాయులతో శంకుస్థాపనలు చేసినా ప్రయోజనం లేకపోయిందని, పార్టీ కేడర్ సక్రవుంగా పనిచేయకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన వాపోయినట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రవూలను వేగవంతం చేయించాలని, పార్టీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని హితవుపలికినట్లు తెలిసింది. -
ఫైన్ ఐడియా!
• 6 నెలల కాలంలో 3 వేల కట్టడాలు • అక్రమ నిర్మాణాలపై 10 శాతం జరిమానా • రూ.10 కోట్లు ఆదాయం లక్ష్యం • రంగంలోకి టౌన్‌ప్లానింగ్ అధికారులు • బెంబేలెత్తుతున్న గృహ యజమానులు విజయవాడ సెంట్రల్ : నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. గత ఆరు నెలల కాలంలో దాదాపు మూడు వేల భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు అంచనా. వాటిలో అక్రమ నిర్మాణాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్ అనధికారిక కట్టడాలపై జరిమానా అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. మార్కెట్ విలువలో పది శాతం మేర అక్రమ కట్టడాల యజమానుల నుంచి వసూలు చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనకు కమిషనర్ జి.వీరపాండియన్ సై అన్నారు. ఈ మేరకు వారం క్రితమే టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గత వారం రోజుల వ్యవధిలో రూ.70 లక్షల మేరకు జరిమానాలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఈ విధంగా రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిసింది. వన్‌టౌన్, భవానీపురం, గవర్నర్‌పేట, పటమట, సింగ్‌నగర్, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే జల్లెడపట్టి మరీ అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. లబోదిబోమంటున్న గృహ యజమానులు ఆన్లైన్ పుణ్యమా అని గత ఆరు నెలల కాలంలో నగరంలో పెద్ద సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. భవనం స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు అక్రమ వసూళ్లు కూడా సాగాయి. తిలాపాపం తలాపిడికెడు చందంగా ఇందులో బ్రోకర్ల నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారుల వరకు మామూళ్లు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు కార్పొరేటర్లు అక్రమ కట్టడాల్లో హవా సాగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు, మూడో అంతస్తులకు సంబంధించి లక్షల రూపాయలు మామూళ్ల రూపంలో గృహ యజమానులు సమర్పించుకున్నారు. ఇప్పుడు జరిమానా రూపంలో మరోమారు టౌన్‌ప్లానింగ్‌కు చలానా కట్టాల్సి రావడంతో గృహ యజమానులు లబోదిబో మంటున్నారు. బిల్డింగ్ మార్కెట్ విలువ రూ.20 లక్షలు ఉంటే అందులో పది శాతం అంటే.. రూ.2 లక్షలు చెల్లించాల్సి రావడంతో బాప్రే అంటున్నారు. గతంలో మామూళ్లు ఇచ్చుకున్నాం కాబట్టి కాస్తంత డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా అధికారులతో బేరమాడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల వల్లే... రెండు నెలల క్రితం టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన మేయర్ అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని, తీరు మార్చుకోకుంటే ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయినా ఫలితం లేకపోవటంతో కొద్దిరోజుల క్రితం మరోమారు సమావేశం నిర్వహించి నిలదీయగా, అధికారులు స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే అక్రమ కట్టడాలను తాము చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోందని కుండబద్దలు కొట్టారు. కొందరు మీ పార్టీ కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఓ రేంజ్లో అక్రమ కట్టడాలను వ్యాపారంగా చేస్తున్నారంటూ స్పష్టం చేశారు. అనూహ్య పరిణామంతో అవాక్కైన మేయర్.. ఇప్పటివరకు సాగిన అక్రమ కట్టడాల నుంచి పది శాతం చొప్పున జరిమానాలు వసూలు చేయాల్సిందిగా ప్రతిపాదన పెట్టారు. ఇందుకు కమిషనర్ అంగీకరించడంతో జరిమానాలు మొదలయ్యాయి. ఒక్కో బిల్డింగ్ ఇన్స్పెక్టర్కి తమ పరిధిలో కనీసం రూ.50 లక్షలకు తగ్గకుండా జరిమానాలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. -
గిరిజన యువతకు శిక్షణ ఎన్నడో?
* రూ.మూడు కోట్లతో సామర్లకోటలో భవనాలు * నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని వైనం సామర్లకోట : రంపచోడవరం ప్రాంతానికి చెందిన గిరిజన యువతీ, యువకులకు సామర్లకోటలో ఇవ్వ తలపెట్టిన శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామర్లకోటలోని విస్తరణ శిక్షణా కేంద్రంలో సుమారు రూ. 3 కోట్లతో గిరిజన యువత శిక్షణా కేంద్రం నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం పూర్తరుునా ప్రారంభానికి నోచుకోలేదు. కాగా భవనాల నిర్మాణంపై గతంలోనే కొన్ని వివాదాలు ఉన్నాయి. అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆదేశాల మేరకు సుమారు మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని భవనాలు నిర్మించారు. భూముల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ, కమిషనర్ అనుమతి పొందవలసి ఉంది. అరుుతే అనుమతి లేకపోవడంతో భవనాలను విస్తరణ శిక్షణా కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీనిపై విస్తరణ శిక్షణా కేంద్రం అధికారులను వివరణ కోరగా గతంలో జరిగిన విషయాలపై తమకు అవగాహన లేదని చెప్పారు. కాగా రంపచోడవరం నుంచి యువతీ, యువకులు సామర్లకోట వచ్చి ఎలా శిక్షణ పొందుతారన్న సందేహమూ ఉంది. ఐటీడీఏకి నిధులు ఉన్నా అప్పట్లో స్థల సమస్య కారణంగా సామర్లకోటలో ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణా కేంద్రం భవనాలు పూర్తయినప్పటికీ శిక్షణకు అవసరమైన ఫర్నీచర్, ఇతర సదుపాయూలు ఏర్పాటు చేయలేదు. ఈ శిక్షణా కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. భవనాలు ప్రారంభమైన వెంటనే శిక్షణను కూడా ప్రారంభించవలసి ఉన్నా.. అదెప్పుడో అధికారులే చెప్పాలి. త్వరలో భవనాలు ప్రారంభిస్తాం సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రంలో నిర్మించిన గిరిజన యువత శిక్షణా కేంద్రం త్వరలో ప్రారంభం అవుతుంది. యువతకు అవసరమైన అన్ని రకాల శిక్షణలూ ఈ కేంద్రంలో ఇస్తారు. శిక్షణ సమయంలో భోజన వసతి సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పూర్తి వివరాలు రావలసి ఉంది. - కేవీఎన్ చక్రధరబాబు, ఐటీడీఏ పీఓ, రంపచోడవరం -
అక్రమంగా సెల్లార్ కట్టు...
* నేలమాళిగలో యథేచ్ఛగా అక్రమాలు * ఖాళీ స్థలాలలో సాగుతున్న వ్యాపారాలు * భవనాల నిర్మాణంలో షరతుల ఉల్లంఘన * పట్టించుకోని పట్టణ ప్రణాళిక అధికారులు * వాహనాల నిలుపుదలకు అనేక ఇబ్బందులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘సెల్లార్లు వాహనాలు నిలపటానికి కేటాయించిన నిర్మాణాలు. అక్కడ ఎలాంటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వొద్దు. అలాంటివి ఎక్కడైనా ఉంటే వాటిని గుర్తించి తొల గించండి. వాహనాల నిలుపుదలకు అనువుగా తీర్చిదిద్దండి. అప్పుడే రహదారులపై సమస్యలు తగ్గి రాకపోకలు సులభమవుతాయి’’ పట్టణ ప్రణాళిక విభాగం ఉత్తర్వులు ఇవి. నగరంలో మాత్రం అమలు కావడం లేదు. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టటం లేదు. బహుళ, వ్యాపార సముదాయాల యజమానులు అనుమతులను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. సెల్లార్లు, స్టిల్ట్ (భూమిపై ఖాళీ స్థలాలు)ను వ్యాపారులకు అనువుగా మార్చుతున్నారు. దీంతో నగరంలో వాహనాల నిలుపుదల పెద్ద సమస్యగా మారింది. భారీ కట్టడాలను పార్కింగ్ స్థలాలు లేకుండా నిర్మిస్తుండటం తో నగరవాసులకు, పనుల మీద జిల్లా కేంద్రానికి వచ్చేవా రికీ ఇబ్బందులు తప్పటం లేదు. 200 చదరపు మీటర్ల పరిధిలోపు కట్టడమైతే స్టిల్ట్, 750 చదరపు మీటర్ల పరిధి దాటితే నేలమాళిగ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ప్రధానంగా బహళ అంతస్థులు, వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు, ప్రయివేటు విద్యాసంస్థలు, ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. నిర్మాణ సమయంలో వాహనాల నిలుపుదలకు స్థలాన్ని చూపించి, ఆ పై తెలివిగా వ్య వహరిస్తున్నారు. నిర్మాణం పూర్తి కాగానే ఆ ప్రదేశాన్ని వ్యాపార ప్రయోజనాలకు వినియోగిస్తూ ఆర్థికం గా లబ్ధి పొందుతున్నారు. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే.. * నిజామాబాద్-హైదరాబాద్ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా నిర్మించే బహుళ అంతస్థుల భవనాలు, వాణిజ్య సముదాయాలలో వాస్తవంగా సెల్లార్‌ను వాహనాల పార్కింగ్ కోసం వినియోగించాలి. ఇవి లేని కారణంగా వాహనదారులకు చాలాచోట్ల పెయిడ్ పార్కింగ్లు శరణ్యంగా మారుతున్నాయి. లేదంటే దుకాణాల వద్దకు వచ్చే ప్రజలు వాహనాలు రహదారిపై నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురవుతోంది. * రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు తరచూ ట్రాఫి క్ జామ్ అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ రోడ్డుకిరువైపులా ఉన్న షాపింగ్కాంప్లెక్స్ల ఎదుట పలు దందా లు జరుగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. * ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రమేష్ థియేటర్‌కు ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ కాంప్లెక్స్‌కు పార్కింగ్ స్థలం లేకపోవడం, వాహనాలను బయటే నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. * శ్రీదేవి థియేటర్ ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు సెల్లార్ లేదు. ఏకంగా కొంత డ్రైనేజీ భాగాన్ని ఆక్రమించి నిర్మించిన ఈ భవనానికి కనీసం సెట్‌బ్యాక్ కూడా వదలకుండా నిర్మించడంపై ఆరోపణలు వస్తున్నాయి. * వినాయకనగర్‌లోని గణపతి బావి ఎదురుగా నిర్మించిన ఓ షాపింగ్ కాంప్లెక్స్లోను సెల్లార్‌ను వాణిజ్య సముదాయంగా మార్చారు. వారికి కాసులు... జనానికి జరిమానాలు * హైదరాబాద్ నుంచి అనుమతి వచ్చిందా? లేదా ? నిబంధనల ప్రకారం భవనం నిర్మిస్తున్నారా? లేదా? అని చూడాల్సింది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే. కానీ మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారు. భవన యజమానులు వాటిని అద్దెకిస్తూ డబ్బు దండుకుంటున్నారు. * ఈ మొత్తంలో ఇబ్బంది పడుతున్నది మాత్రం జనమే! రద్దీగా ఉండే ప్రాంతాలలో వాహనాన్ని కాసింత రహదారిపై పెడితే ‘జరిమానా’ అంటూ ట్రాఫిక్ పోలీసులు కాచుకు కూర్చుంటున్నారు. సెల్లార్లో నిలిపే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని సెల్లార్లకు పురపాలక అధికారులు ఆస్తి పన్ను కూడా దండుకుంటుండడం గమనార్హం. కొన్నిచోట్ల నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి * 750-1000 చ.మీ. విస్తీర్ణంలో భవనం, సెల్లార్ నిర్మాణానికి హైదరాబాద్‌లోని పట్టణ ప్రణాళిక విభాగం ప్రాంతీయ సంచాలకుడు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. * వెయ్యి చ.మీ. విస్తీర్ణం కంటే అధికంగా ఉంటే భవ నం, సెల్లార్ నిర్మాణానికి హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి అనుమతి పొందాలి. * ప్రతిపాదిత సెల్లార్ నిర్మించే భవనానికి ఓ వైపు తప్పనిసరిగా 30 అడుగుల రహదారి ఉండాలి * సెల్లార్‌ను పార్కింగ్ కోసమే వినియోగించాలి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. -
కృష్ణావర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.7.17 కోట్లు
ఆరు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి తొలుత అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కృష్ణా వర్సిటీ వీసీ పున్నం వెంకయ్య వెల్లడి మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య వున్నం వెంకయ్య తెలిపారు. యూనివర్సిటీలోని వీసీ చాంబరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇం దుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బందరు మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలోని కోన రోడ్డు వెంబడి 102.86 ఎకరాలను గతంలో ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందని చెప్పారు. ఈ భూమిలో రూ.72 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. భవనాల నిర్మాణ పనులను సీపీడబ్ల్యూడీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్, ఈఈ నాగేశ్వరరావులకు మొదటి విడతగా రూ.7.17 కోట్ల చెక్కును ఈ సందర్భంగా వీసీ అందజేశారు. 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ భవనం అకడమిక్ భవనాన్ని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అంచనాలు రూపొందించామని వీసీ తెలిపారు. మొదటి విడతలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మొదటి విడతలో 85 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు వివరించారు. జీ+2 పద్ధతిలో ఈ భవనాలు నిర్మించాలని నమూనాలు తయారు చేశారని, అయితే మొదటి విడతలో మాత్రం జీ+1 పద్ధతిలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. నిధుల వెసులుబాటును బట్టి మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండంతో రోడ్డుకు మూడున్నర అడుగుల ఎత్తులో మెరక చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ భూముల్లో పటిష్టమైన నిర్మాణాల కోసం 70 అడుగుల లోతుకు వెళ్లి భూ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు భూమిపై శ్లాబు వేసి, దానిపై భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను హైదరాబాదుకు చెందిన జేఎన్టీయూ సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. రూ.72 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కాన్పూర్ యూనివర్సిటీ తరహాలో ఇక్కడ భవనాల నిర్మాణం జరుగుతుందని, 100 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవన నిర్మాణం కోసం మొదటి విడతగా సీపీడబ్ల్యూడీపీకి 10శాతం నిధులను సమకూర్చాల్సి ఉన్న నేపథ్యంలో మొదటి విడతగా రూ. 7.17 కోట్లను ఇంజినీరింగ్ అధికారులకు అందజేసినట్లు వీసీ వివరించారు. నగదు అందజేసిన అనంతరం టెండర్ల ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుందని, డిసెంబరు లేదా జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్ మాట్లాడుతూ పనులు ప్రారంభించిన 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను డీడీ రూపంలో అందజేసేందుకు జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, సిబ్బంది తమకు సహకరించారని తెలిపారు. పబ్లిక్ లెక్చర్ సిరీస్ కృష్ణా యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ లెక్చర్ సిరీస్‌ను నవంబరులో నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. నవంబరులో నిర్వహించే 3వ పబ్లిక్ లెక్చర్ కార్యక్రమానికి కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఫర్ ఆసియా డెరైక్టర్ డాక్టర్ సంజయ్‌మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేస్తారని వీసీ తెలిపారు. నాలుగో లెక్చర్‌కు నాక్ మాజీ చైర్మన్ రామ్తక్వాలే ముఖ్య అతిథిగా హాజరై దేశంలోని ఉన్నత విద్య విధానంపై ఉపన్యసిస్తారని చెప్పారు. కృష్ణా యూనివర్సిటీ నవంబరు మొదటి వారంలో స్మారక ఉపన్యాసం జరుగుతుందని రఘుపతి వెంకటరత్నం నాయుడు పేరున ఈ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా తరంగ్-2014 యువజనోత్సవాలను నవంబరులోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఆన్లైన్ పరీక్షా విధానం అమలు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని వీసీ చెప్పారు. పరీక్షా కేంద్రానికి 40 నిమిషాల ముందు ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్లో పంపుతామని, ఈ ప్రశ్నాపత్రాన్ని తెలుసుకునేందుకు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎం.టెక్ కోర్సు ప్రారంభం కృష్ణా వర్సిటీలో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ప్రారంభించినట్లు వీసీ చెప్పారు. పీజీ ఇంజినీరింగ్ కామెన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు పాల్గొన్నారు. -
పనులు 26 వేలు, ఖర్చు 32 వేల కోట్లు!
ఇదీ మన ఊరు-మన ప్రణాళిక గ్రామ, మండల, జిల్లా ప్రణాళికల క్రోడీకరణ మౌలిక సదుపాయాల కోసం ప్రజల డిమాండ్ శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనల్లోచేర్చాలని ప్రభుత్వ ఆదేశం {పాధాన్యాలవారీగా నిధుల కేటాయింపు హైదరాబాద్: మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లలో అధికంగా మౌలిక సదుపాయాల కోసమే ఉన్నాయి. గతనెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు దశల్లో జరిగిన మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళికలో మొత్తం 25,920 పనులు చేపట్టాలని డిమాండ్ వచ్చింది. ఇందుకోసం అయ్యే వ్యయం దాదాపు రూ. 32,184 కోట్లుగా అంచనా వేశారు. తొమ్మిది జిల్లాల్లో నిర్వహించిన ఈ ప్రణాళికలో ఏయే గ్రామం నుంచి ఏయే అవసరాల కోసం ప్రజలు డిమాండ్ చేశారన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. గ్రామపంచాయతీల్లో జరిగిన మన ఊరు-మన ప్రణాళికలోనే 80 శాతం మేరకు దాదాపు 26 అంశాలపై ప్రధానంగా డిమాండ్లు వచ్చినట్టు అధికారవర్గాలు వివరించాయి. ప్రధానంగా పాఠశాలలు, కాలేజీలు, తాగునీరు.సాగునీరు. కల్వర్టులు, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, గ్రామాల్లో అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణం, సిమెంట్ రహదారులు, బోర్లు, భవనాల నిర్మాణంపై డిమాండ్లు ఎక్కువగా వచ్చినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వివరించాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన విషయం విదితమే. అందులో భాగంగా మన ఊరు-మన ప్రణాళికలో వచ్చిన అంశాలను ఆయా శాఖల వారీగా విడదీసి..ఆ శాఖల బడ్జెట్లలో చేర్చాలని ఆర్థిక, ప్రణాళిక శాఖలు సూచించాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పనులన్నీ ఒకేసారి కాకుండా. ప్రాధాన్యక్రమంలో చేపట్టనున్నారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పనులుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనుల కోసం ప్రభుత్వవాటాతోపాటు, స్థానిక సంస్థల నుంచి, ప్రజల నుంచి కూడా కొంతమొత్తాన్ని కంట్రిబ్యూషన్ రూపంలో సేకరించే అవకాశం ఉంది. -
ఎన్నాళ్లీ కష్టాలు
బాలారిష్టాలు దాటని కృష్ణా యూనివర్సిటీ సొంత భవనాలు లేవు ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత హాస్టళ్లు, ల్యాబ్ సౌకర్యాలు నిల్ రేపు ద్వితీయ స్నాతకోత్సవం మచిలీపట్నం : ఉన్నత ఆశయంతో ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా కృష్ణా యూనివర్సిటీ మాత్రం బాలారిష్టాలను దాటడం లేదు. భూమి కేటాయించినా, నిధులు మంజూరు చేసినా పాలకుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కలగానే మిగిలింది. యూనివర్సిటీ పరిధిలో జిల్లాలోని 143 కళాశాలలు ఉన్నాయి. నూజివీడులో పీజీ సెంటర్ ఉంది. యూనివర్సిటీని ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 42 మంది ప్రొఫెసర్లకు గానూ కేవలం 21 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. 50 మంది సిబ్బందికి గానూ ఇద్దరే పర్మినెంటు ఉద్యోగులు ఉన్నారు. మరో 15 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్నారు. స్థలం, నిధులు కేటాయించినా... జిల్లాకో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో 2008, ఏప్రిల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం యూని వర్సిటీని పట్టించుకునే వారే కరువయ్యారు. వర్సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు బందరు మండలం రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరు మండలంలో 44 ఎకరాలు, ప్రస్తుతం యూనివర్శిటీ నడుస్తున్న ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలో 24 ఎకరాలను కేటాయించారు. భవనాల నిర్మాణానికి రూ.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ విభాగం నిపుణులు భవనాల నిర్మాణానికి నమూనాలు తయారు చేశారు. అయినప్పటికీ భవన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కావటం లేదు. ఏడాది క్రితం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యూనివర్శిటీ పాలకులు అనంతరం ఆ విషయాన్ని మరిచిపోయారు. అయితే గత ఐదేళ్లుగా యూనివర్శిటీ భవనాల నిర్మాణంపై ఎవరూ దృష్టిసారించటం లేదు. యూనివర్శిటీకి భవనాల నిర్మాణానికి బిల్డింగ్ అడ్వయిజరీ ఎక్స్పర్ట్ కమిటీని నియమించినా ఫలితం లేకపోయింది. హాస్టల్ భవనాలు, ల్యాబ్‌లు లేవు యూనివర్శిటీ అభివృద్ధి చెందాలంటే హాస్టల్ భవనాలు ఉండాలి. విద్యార్థినులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ కోసం మూడు వేర్వేరు హాస్టల్స్ ఉండాలి. ఆరేళ్లు గడుస్తున్నా హాస్టల్ భవనాల నిర్మాణం ఊసే లేదు. ఆంధ్ర జాతీయ కళాశాల భవనంలోని 20 గదుల్లో, నిర్మలా కాన్వెంట్ సమీపంలోని ఓ భవనంలో యూనివర్శిటీని నడుపుతున్నారు. తరగతి గదులనే ల్యాబ్‌లుగా మార్చారు. ఆర్గానిక్ కెమెస్ట్రీ విభాగంలో ప్రస్తుతం 60మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్, ఫిజికల్ కెమీస్ట్రీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం నాలుగు ప్రత్యేక ల్యాబ్‌లు ఉండాలి. ఉన్న ఒకే ల్యాబ్‌ను ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు ఉపయోగిస్తున్నారు. బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఎం.ఫార్మసీ విభాగాలకు తరగతి గదులు లేవు. వారికి ల్యాబ్‌లనే తరగతి గదులుగా ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఎం.ఫిల్, పీహెచ్‌డీలో అభ్యర్థులను చేర్చుకున్నారు. వీరికి ప్రత్యేక వసతి గృహం, ల్యాబ్‌లు అవసరం. స్కాలర్స్‌కు యూనివర్శిటీలో పాఠ్యాంశాలు బోధించే అవకాశం కల్పించి వారికి నెలకు కొంత మొత్తాన్ని అందజేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ యూనివర్శిటీలో అమలుకావటం లేదు. పరీక్షల విభాగానికి ప్రత్యేక గది కేటాయించాల్సి ఉండగా, తరగతి గదినే ఇందుకు ఉపయోగిస్తున్నారు. పరీక్షల విభాగంలో రెగ్యులర్ ప్రొఫెసర్లకు బదులు, అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న ప్రొఫెసర్లే విధులు నిర్వర్తిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ప్రొఫెసర్లు క్లాసులు చెప్పిన అనంతరం కూర్చునేందుకు ఒక టేబుల్, కుర్చీ కూడా ఇవ్వకపోవటం ఇక్కడ దుస్థితికి నిదర్శనం. హాస్టల్ భవనాలు, లేబొరేటరీలు సక్రమంగా లేకపోవటంతో ఈ యూనివర్శిటీలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భవనాల నిర్మాణం ప్రశ్నార్థకమే.. యూనివర్శిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రుద్రవరం గ్రామంలో 102 ఎకరాలను కేటాయించింది. ఇక్కడే రూ. 70 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తామని ఈ నెల 21వ తేదీన యూనివర్శిటీ వీసీ వున్నం వెంకయ్య వెల్లడించారు. వర్షాకాలం కావటంతో ఇక్కడ భవనాలు నిర్మించేందుకు అవకాశం లేదు. ఈ 102 ఎకరాల్లో మూడువేల మీటర్ల మేర ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది మట్టి రోడ్లను నిర్మించారు. యూనివర్శిటీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఈ భూమి అభివృద్ధి కోసం ఖర్చు చేయకపోవటం గమనార్హం. ఈ భూమి లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షాకాలంలో నీరు నిలబడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భవనాల నిర్మాణం ఎలా చేపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. గవర్నర్ దృష్టి సారిస్తే మేలు కృష్ణా వర్సిటీ మొదటి స్నాతకోత్సవం 2012, డిసెబర్ 9వ తేదీన నిర్వహించారు. రెండో స్నాతకోత్సవాన్ని ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా యూనవర్శిటీకి ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ అటు యూనివర్శిటీ ప్రతినిధులు, పాలకులు ఈ యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు ఏ మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ద్వితీయ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ కులపతి హోదాలో హాజరువుతున్న గవర్నర్ నరసింహన్ అన్ని అంశాలపై దృష్టిసారించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. గవర్నర్ దృష్టిసారించి యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.