
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటవెంటనే నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 30 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలాలను, నిధులను ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. బీసీల్లోని 30 కులాల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను, నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ మరో పది ఉత్తర్వులను జారీ చేశారు.
– బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని స్థలాలను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. భవనాల నిర్మాణానికి రూ.58.75 కోట్లను కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొంది.
► ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎస్సీ వర్గాల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది.
► నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.2.81 కోట్లను మంజూరు చేసింది.
► మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో భీమా నది పుష్కరాల పనుల కోసం రూ.5 కోట్లు కేటాయించింది.
► పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 242 అభివృద్ధి పనుల కోసం రూ.2.30 కోట్లను విడుదల చేసింది.
► వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల–ఎర్రగట్టు గుట్ట రోడ్డు వెడల్పు పనుల కోసం రూ.4.45 కోట్లను కేటాయించింది.
► సూర్యాపేట జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం రూ.3.62 కోట్లను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment