Self-esteem
-
ఆత్మ గౌరవం.. జీవన వనాన విరిసే ఆమని
ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు చాలా ఆత్మగౌరవం ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అహంకారం ఉన్నవారు తమకోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువలకోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. సంఘంలో మనకు ఎక్కువగా ఈ తరహా వ్యక్తులే తారసపడుతూ ఉంటారు. స్వల్పమాత్రపు భేదాన్ని మాత్రం మనం ఇక్కడ తప్పనిసరిగా గ్రహించాలి. అహంకారంతో వర్తించడం ఎటువంటి నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన దోషం..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి. ఆత్మగౌరవం అనే భావన ఒక వ్యక్తి తన గురించి కలిగి ఉన్న విలువ, అవగాహనకు సంబంధించిన భావన.దీని ఆధారంగా, ఒక వ్యక్తి తోటివారితో సాగే గమనంలో విభిన్న విషయాల్లో తనకు ఎటువంటి స్థానం ఉందో కనుగొంటాడు. ఆత్మగౌరవానికి నిర్వచనాన్ని చెప్పవలసి వస్తే, దాదాపుగా స్వీయ–ప్రేమకు, ఈ పదాన్ని సమానంగా చెప్పవచ్చు. తన గౌరవాన్ని గురించి ఎవరైనా, ఏ సందర్భంలోనైనా ప్రకటించ వలసి వస్తే,ఆత్మగౌరవం అనే పదం వ్యక్తికి గల స్వీయ గౌరవం అనే పదానికి ప్రత్యక్ష అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తనని తాను ప్రేమించడం స్వార్థం లేదా అనారోగ్యం కాదు; ఇది ఒక ప్రాథమిక భావన. తనని తాను ప్రేమించుకోవడం అనేది ప్రతి వ్యక్తీ చేసే పనే. తనకు మంచి జరగాలని కోరుకోవడమూ సహజమే.. అయితే, తనకే మంచి జరగాలని కోరుకోవడాన్ని స్వార్ధభావనగా మనం పేర్కొంటూ ఉంటాం. ప్రతికూల ఆలోచనలను అంతం చేయడం, జ్ఞానాన్ని పెంచే లేదా వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, చేసిన తప్పులను తెలుసుకోవడం మొదలైనవి మనలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తొచ్చే మరో పదం ‘అహంకారం’. పరిణతి చెందిన వ్యక్తులు సైతం తమ వైఖరిని వ్యక్తపరిచే సందర్భంలో, ఆ విధంగా మాట్లాడితే అహంకారులుగా తమను ఎదుటివారు భావిస్తారేమో అని సందేహించే సందర్భాలూ ఉంటాయి. అయితే, ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్య తేడా బాగానే ఉంది. సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!! ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!! ఆత్మగౌరవం అన్నది మనిషి ఉత్తమ ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఒక మంచి ప్రవర్తనకు జగతి లో అందే విలువను పరోక్షంగా ఆత్మగౌరవానికి నమూనాగా ప్రకటించవచ్చు. సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచుకంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు. – ‘‘వ్యాఖ్యాన విశారద’’ వెంకట్ గరికపాటి -
సీఎం కేసీఆర్ వరాలపై మథనం!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటవెంటనే నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 30 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలాలను, నిధులను ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. బీసీల్లోని 30 కులాల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను, నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ మరో పది ఉత్తర్వులను జారీ చేశారు. – బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని స్థలాలను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. భవనాల నిర్మాణానికి రూ.58.75 కోట్లను కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొంది. ► ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎస్సీ వర్గాల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. ► నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.2.81 కోట్లను మంజూరు చేసింది. ► మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో భీమా నది పుష్కరాల పనుల కోసం రూ.5 కోట్లు కేటాయించింది. ► పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 242 అభివృద్ధి పనుల కోసం రూ.2.30 కోట్లను విడుదల చేసింది. ► వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల–ఎర్రగట్టు గుట్ట రోడ్డు వెడల్పు పనుల కోసం రూ.4.45 కోట్లను కేటాయించింది. ► సూర్యాపేట జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం రూ.3.62 కోట్లను కేటాయించింది. -
క్రాంతిమయ పర్వదినమే సంక్రాంతి
తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప క్రాంతిమయ పర్వదినం సంక్రాంతి. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి. మన కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా పొరపొచ్ఛాలు, భేదాభిప్రాయాలు ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసి మెలిసి జరుపుకునే పర్వదినాలే పండగలు. ‘సంక్రాంతి’ అనడం లో ‘‘సం’’ అంటే మిక్కిలి ‘‘క్రాంతి’’ అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీనిని ‘సంక్రాంతి’ గా పెద్దలు వివరణ చెబుతూ ఉంటారు. అన్నదాతలు సంవత్సరమంతా కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకు చేరి, తద్వారా ధనలక్ష్మి నట్టింట కొలువుదీరే పండుగ మన సంక్రాంతి పండుగ. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగ బంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే చేరటం అని అర్ధం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణ ం. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయణం. పన్నెండు నెలలలో ఆరు నెలల దక్షిణాయణం దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకుని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంతటి మహత్తరమైన పర్వదినం మకర సంక్రాంతి లేక పెద్ద పండుగ. ఈ పండగను భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలలోనే కాక, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో కూడా పాటిస్తారు. మనకు వచ్చే పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి పాటించే పండుగ. మనం సంక్రాంతి అని పిల్చుకుంటే మహారాï్రÙ్టయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్ అని పిలిస్తే పంజాబీలు లోరీ అంటారు. ఉత్తరాయణంలో సూర్యుని గమనం ఉత్తరముఖంగా మారడంతో పగటికాలం క్రమంగా పెరుగుతూ వస్తుంది. సూర్యరశ్మి క్రిమి సంహారిణి. అది అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే సూర్యుని కిరణాలు ఎక్కువగా సోకినా మంచిదికాదు. ఎందుకంటే సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు చర్మవ్యాధులను, చర్మ సంబంధ క్యాన్సర్‌ను ఇతర రుగ్మతలను కలిగిస్తాయి. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు వరుసగా వచ్చే కాలం ఇదే! ముఖ్యంగా మధ్య దినమైన రోజును ‘సంక్రాంతి’ అని పిలుచుకుంటాం. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగ పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహప్రాంగణాలతో, ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. పుష్యం అంటేనే పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు ఈ దినాలలో నిర్వర్తించాలి. సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. కాలచక్రానికి అనుగుణంగా సంచరిస్తూ ఉండే దేవతా స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి రావడమే మకర సంక్రమణం. అదే మకర సంక్రాంతి. సూర్యోదయానికి ముందే నువ్వులపిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాల బాధలు నివారించుకోవడానికి స్నానజలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. సంక్రాంతి రోజున పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయి న వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. మహిళలు ఎంతో అందంగా రంగవల్లులు తీర్చిదిద్దే రోజు సంక్రాంతి. దానికి ఆరోగ్య రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా ఎంతో ప్రాముఖ్యం ఉందని పెద్దలు చెప్తారు. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతంగా భావిస్తే, ఒక పద్దతిలో పెట్టే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం గా చెప్తారు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుని స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి (స్టాటిక్ ఫోర్స్) చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్) కు సంకేతాలనీ.. శ్రీచక్ర సమర్పణా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. మన నేటి మహిళ లు కాంక్రీట్ జంగిల్స్‌లో నివసిస్తూ రంగవల్లుల సంస్కృతిని మరచిపోకుండా రంగవల్లుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏయే పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకి సిద్ధిస్తాయని నమ్మకం. మగపిల్లలు పతంగులు (గాలి పటాలు) ఎగురవేసి ఆనందిస్తారు. ఇంటి ఆచారం ప్రకారం స్త్రీలు సావిత్రీ వ్రతం లాంటి నోములను నోచుకుంటారు. దీనివల్ల కుటుంబసౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సౌభాగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇరుగు పొరుగులను పిలిచి పండు తాంబూలాలను, నువ్వుండలను ఇచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదాలను తీసుకొంటారు. కొందరు సంక్రాంతి నాడు రాముని పూజచేస్తారు. రామునిలాగా ధర్మమార్గంలో నడవడానికి శక్తి కలగాలని రామాయణాన్నీ పఠిస్తారు. బలిచక్రవర్తికి ఉన్న త్యాగగుణం అలవడాలన్న కోరికతో వామన పురాణాన్ని కూడా వింటారు. తెలంగాణ అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవే కాక ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, తిలలు, వస్త్రాలు, తైలదీప దానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. బూడిద గుమ్మడి కాయను దానంచేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుంది. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్య బాధలు తీరుతాయి. బుద్ధి వికాసం కలుగుతుంది. సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును తీర్చి పేరంటాలూ చేస్తారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పన్నెండు సంవత్సరాలు బాలునిగా, వీర పద్మాసన భంగిమలో కూర్చుని, కుడిచేతిని చిన్ముద్రగా చేసుకుని ఆ కొండమీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్పను ఉద్దేశించి దీక్షాధారణ చేసిన అయ్యప్పలందరూ శబరిమలై చేరి మకరవిళక్కును నిర్వర్తించి మకరజ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలకు, ఇంత విశిష్టతకు కారణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే కాబట్టి, ఆయనకు కృతజ్ఞతా సూచకంగా సంక్రాంతినాడు సూర్యభగవానుడిని పూజిస్తారు. శ్రద్ధాభక్తులతో ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తారు. -
చెంబు చచ్చింది...ఆత్మగౌరవం దక్కింది
నెల్లూరు / పెళ్లకూరు: అధికారుల అత్యుత్సాహం ప్రజాగ్రహానికి కారణమైంది. శుభకార్యాల్లో కలశంగా.. అంత్యక్రియలు, అనంతర కార్యక్రమాల్లో పవిత్రం గా వినియోగించే చెంబును అవహేళన చేయడం తగదంటూ పెళ్లకూరు గ్రామస్తులు అధికారులపై విరుచుకుపడ్డారు. ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది’ అనే నినాదంతో చెంబుకు శవయాత్ర నిర్వహించడాన్ని అడ్డుకున్నారు. తమ సెంటిమెంట్లను అవహేళన చేయడం తగదని, శవయాత్ర నిర్వహించడం వల్ల ఊరికి అరిష్టం కలుగుతుందంటూ నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బహిరంగ మల విసర్జనను రూపమాపడానికి, అందరూ మరుగుదొడ్లను వినియోగించేలా చేయడానికి ఆత్మగౌరవ దీక్షల పేరిట జిల్లా యంత్రాం గం 41 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం’ దక్కిందనే నినాదంతో చెంబులకు పాడెకట్టి శవయాత్రల పేరిట ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండల టాస్క్‌ఫోర్స్ అధికారి నాగజ్యోతి ఆధ్వర్యంలో గురువారం పెళ్లకూరు దళిత కాలనీలో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. అధికారులు, సిబ్బంది కలిసి డప్పుల మోతల నడుమ ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది’ అంటూ నినాదాలు చేస్తూ చెంబుకు పాడెకట్టి శవయాత్ర చేపట్టారు. అంతలో కాలనీకి చెందిన వారంతా ఏకమై అధికారుల తీరుపై నిరసన తెలిపారు. చెంబుకు పాడెకట్టి శవయాత్ర చేస్తూ ఊరంతా తిప్పడం మంచిది కాదని, ఇలాంటి పనులు ఊరికి అరిష్టం తెస్తాయంటూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఒకానొక దశలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. బహిరంగ మల విసర్జనను నివారించడానికి కార్యక్రమాలు చేపట్టడం, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం, చైతన్య యాత్రలు చేయడంపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, ప్రజల సెంటిమెంట్స్‌ను కించపరిచేలా చేయడం సరికాదన్నారు. పురాతన కాలం నుంచి చెంబుకు ఎంతో విశిష్టత ఉందని.. ఎన్నో పనులు, అవసరాలతోపాటు సంప్రదాయబద్ధంగా నిర్వర్తించే క్రతువుల్లో దానిని వినియోగిస్తుంటారని తెలిపారు. బహిర్భూమికి మాత్రమే చెంబును వినియోగించరనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ఎంత చెప్పినా కాలనీ ప్రజలు వినకపోవడంతో చేసేది లేక అధికారులు కార్యక్రమం పూర్తి కాకుండానే వెనుదిరిగారు. గ్రామస్తుల నిరసనను ఎదుర్కొన్న వారిలో ఎంపీడీఓ నాగప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మునికుమారి, ఏఈలు మనోజ్‌కుమార్, కృష్ణారావు, ఏఈఓ పుట్టయ్య, మండల కోఆర్డినేటర్ కృష్ణయ్య పాల్గొన్నారు. -
జీవిత సత్యాల్ని తెలిపేదే సాహిత్యం
కామారెడ్డి: జీవిత సత్యాల్ని తెలిపేది.. ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని పెంపొందించేది సాహిత్యమేనని ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొదట గుర్తించింది సాహిత్యకారులేనని, సాహిత్య అధ్యయనంతో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఏ తెలుగు విద్యార్థులకు ‘ఎంఏ తెలుగు–అధ్యయనం–అవగాహన’ అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏ కోర్సు అయినా శ్రద్ధగా చదివితే బతుకుబాట చూపుతుందని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా అవతరిస్తున్న నేపథ్యంలో ఎంఏ తెలుగు కోర్సును ఆరంభించడం శుభ సూచకమన్నారు. వ్యక్తిగత జీవితాల్లోని ఒడిదుడుకులను సరిచేసుకునేలా జీవితాన్ని మలచుకోవచ్చునని, సమాజంలో వేలాది మంది జీవితాల్ని సాహిత్యం ద్వారా చదివే అవకాశం కలుగుతుందన్నారు. ఉద్యోగులుగా, రచయితలుగా, జర్నలిస్టులుగా ఎదగడానికి సాహిత్య అధ్యయనం తోడ్పడుతుందని, విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలని సూచించారు. అందమైన అచ్చ తెలుగు పదాలు తెలంగాణ పలుకుబడుల్లోనే అత్యధికం అని, వాటిని పరిశోధించడానికి నిరంతరం కృషి చేయాలని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపల్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పీవీ నర్సింహం, లక్ష్మయ్య, డాక్టర్ వి.శంకర్, కో–ఆర్డినేటర్ అశోక్‌కుమార్, రవికిరణ్, రంజిత్‌మోహన్, డాక్టర్ ఏ.సుధాకర్, కిష్టయ్య, తౌహుస్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్డి మహిళల ఆత్మగౌరవం
‘స్వచ్ఛ సత్తెనపల్లి’లో ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణన సాక్షి, గుంటూరు: ‘‘మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. మరుగుదొడ్డికి ఆత్మగౌరవం అనే పేరు పెడుతున్నాను. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం కాపాడుకోవాలి’’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లాలోని తన నియోజకవర్గం సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయగా.. సీఎం బుధవారం వాటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సత్తెనపల్లి కార్యక్రమంలో భాగంగా ఆయన కంకణాలపల్లి, ఇరుకుపాలెం, సత్తెనపల్లి బహిరంగసభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. స్పీకర్ కోడెల ఆత్మగౌరవ చాంపియన్ అంటూ.. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో రాష్ట్రంలో సేవా కార్యక్రమంగా మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పర్యవేక్షిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాలను ఉద్యమ స్ఫూర్తిగా చేపట్టాలని పిలుపునిచ్చారు.త్వరలో పింఛన్లను డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఇంకా 63 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలి.. తరతరాల మరుగుదొడ్ల సమస్యకు నేడు పరి ష్కారం దొరికిందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి తరహాలో రాష్ట్రమంతా ఉద్యమంలా మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామన్నారు. 13 జిల్లాల్లో ప్రతి ఇంటికీ టాయిలెట్ నిర్మించాలంటే ఇంకా 63 లక్షలు నిర్మించాల్సి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు కుమార్తె లక్ష్మి రూ. 2.35 లక్షలు, నల్లపాటి చిన్నబ్బి రూ. 3.5 లక్షలు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి విరాళం ప్రకటించారు. స్వచ్ఛభారత్ పోస్టర్‌ను యునిసెఫ్ ప్రతినిధి ముఖ్యమంత్రిచే ఆవిష్కరించారు. -
అభివృద్ధే ధ్యేయం
ప్రమాణం వేళ ఎమ్మెల్యేల అభిమతం ఆత్మగౌరవం కల నెరవేరిన వేళ.. తెలంగాణ ఆవిర్భావ స్వప్నం సాకారమైన సందర్భం.. కొత్త రాష్ట్రం కొంగొత్త ఉత్సాహంతో సోమవారం తెలంగాణ తొలి అసెంబ్లీ కొలువుదీరింది. సంబురాల సవ్వడి కొనసాగుతుండగానే పునర్నిర్మాణానికి పునాదులేసేందుకు వేదికైన చట్టసభకు ఎమ్మెల్యేలు తరలివచ్చారు. తామెప్పుడూ ప్రజాపక్షమే వహిస్తామంటూ సేవకులుగా పనిచేస్తామంటూ పదవీ ప్రమాణం చేశారు. అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాంక్షల తెలంగాణ ఆవిర్భావ అసెంబ్లీకి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు సంబరంగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పాతాకొత్తల కలబోతగా వీరంతా సోమవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో తొలిసారిగా మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రభాకర్ ఎన్నికయ్యారు. మిగిలిన వారిలో గతంలోనే మంత్రులుగా పనిచేసిన వారు కొందరైతే ఎమ్మెల్యేలుగా ప్రజల మన్ననలు పొందిన వారు మరికొందరు. ఈ ప్రజానేతలు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.. ఆత్మ గౌరవంతో స్వీకరించా మెదక్: ఆత్మగౌరవంతో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెలంగాణ పునఃనిర్మాణం కోసం అలుపెరగని కృషి చేస్తా. లోగడ ఉద్యమ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అప్పట్లో చాలా సందర్భాల్లో అసెంబ్లీ నుంచి అవమానకరమైన పరిస్థితుల్లో బహిష్కరణకు గురిచేశారు. ఈ క్రమంలో మా పదవీ కాలమంతా పోరాటాలు, ఉద్యమాలు, రాజీనామాలకే సరిపోయింది. సంతృప్తికరంగా అనిపించలేదు. కాని నేడు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడింది. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నాకు ప్రజలు అవకాశం కల్పించారు. వారి రుణాన్ని తీర్చుకుంటా. కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. సాగునీరు, తాగునీరు, పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తా. సింగూర్ నుంచి ఘనపురం ప్రాజెక్ట్‌కు రావాల్సిన న్యాయమైన తాగునీటి వాటా కోసం, శాశ్వత జీఓ కోసం ప్రయత్నిస్తాను. జైకా పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తా. - పద్మా దేవేందర్‌రెడ్డి సాగు..తాగు నీటిని అందిస్తా జోగిపేటః అందోలు నియోజకవర్గం పరిధిలోని రైతులు, ప్రజలకు సాగు, తాగునీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తాను. శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. అర్హులైన పేద వాళ్లందరికీ పక్కా ఇళ్లు, పెన్షన్లు మంజూరయ్యేలా కృషి చేస్తాను. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తా. అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాను. గతంలో ఏ విధంగానైతే పనులు చేసి పేరు తెచ్చుకున్నానో అలాగే మళ్లీ పని చేస్తాను. 10 ఏళ్ల కింద చేపట్టిన పనులు కూడా ఇప్పుడు నా విజయానికి సహకరించాయి. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో కాలు పెట్టినందుకు సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఉన్న సిబ్బంది అసెంబ్లీలో ఇప్పటికీ ఉన్నారు, వారంతా వచ్చి నన్ను అభినందిస్తుంటే కల్గిన ఆనందం అంతా ఇంతా కాదు. - బాబూమోహన్ న్యాయం చేస్తా సిద్దిపేట అర్బన్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టడం స్వేచ్ఛగా ఉంది. ఇదీ నా బాధ్యతలను మరింత పెంచింది. గతంలో మంత్రి పదవిని నిర్వహించినా మిత్ర పక్ష పాలనలో పనిచేశా. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో మంత్రి కావడం అద్భుతంగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటా. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసినట్లే పదవికి సరైన న్యాయం చేస్తాను. సిద్దిపేట ప్రజల ప్రేమను మరువను. సిద్దిపేటలో మరో రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తా. మార్కెట్ యార్డ్‌లో సమస్యలను పరిష్కరించి రైతులకు సౌకర్యాలు పెంచుతాను. గొలుసు చెరువులను పునరుద్ధరించి సిద్దిపేట ప్రాంతంలో భూగర్భ జలవనరులను పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపడతా. అన్ని రంగాల్లో సిద్దిపేటను అగ్రగామిగా మార్చడానికి కృషి చేస్తాను. తడ్కపల్లి వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి సుమారు రెండు లక్షల ఎకరాలకు నీటిని అందించే భారీ ప్రణాళికను ఆమలు చేస్తా. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచుతాను. - హరీష్‌రావు ఆ అనుభూతి చెప్పలేను నర్సాపూర్: నేను ఎమ్మెల్యేగా గెలవడం అదృష్టంగా భావిస్తున్నా. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినపుడు కల్గిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. ఎంతో సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేగా గెలవడం నా ఇన్నేళ్ళ రాజకీయ జీవితానికి న్యాయం జరిగినట్లు భావిస్తున్నా. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. వారి సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. నర్సాపూర్‌లో ప్రధానంగా ఆర్టీసీ డిపో ఏర్పాటుకు కృషి చేస్తాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆయనే మన సీఎం అయినందున డిపో ఏర్పాటుకు నిధులు త్వరగా మంజూరు చేస్తారనే విశ్వాసం నాకు ఉంది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వరకు నాల్గు లైన్ల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తాను. అలాగే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంజీర తాగునీరు అందెలా చర్యలు తీసుకుంటాను. - మదన్ రెడ్డి భూసమస్యలు పరిష్కరిస్తా దుబ్బాక: భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తా. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతా. దుబ్బాక నియోజకవర్గంలో ప్రధానంగా భూసమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూసమస్యలన్నీ పరిష్కరించి రైతులకు సహకారం అందిస్తా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించి పేదలకు అండగా నిలబడతాను. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కేసీఆర్ నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాను. - రామలింగారెడ్డి ప్రగతికి పాటుపడతా జహీరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి కోసం పాటు పడతాను. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఏం చేశామన్నదే ముఖ్యం. ప్రతిపక్షంగా మేము అసెంబ్లీలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాం. కొత్త రాష్ట్ర అసెంబ్లీలో నాకు ప్రాతినిధ్యం లభించడం ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ గాలి వీచినా ప్రజల ఆదరాభిమానాలతో నేను విజయం సాధించా. టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసిందనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు గుర్తించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పోరాడి నిధులను సాధిస్తా. జహీరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. గొలుసు చెరువుల నిర్మాణంతో పాటు నారింజ నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిమ్జ్‌ను ముందుకు తీసుకెళ్లి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా చూస్తాను. - గీతారెడ్డి ప్రజా సమస్యలపై పోరాడతా నారాయణఖేడ్: ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాడతా. నేను 1989, 2009లో శాసనసభ్యునిగా ఎన్నికైన సమయంలో మా పార్టీ (కాంగ్రెస్) అధికారంలో ఉంది. 1999లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. 1999లో ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ సైతం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో శాసనసభకు ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం చేపట్టే స్పీకర్ ఎన్నికకు సంపూర్ణంగా సహకరిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పోరాడతాను. టీఆర్ఎస్ పార్టీ చేసే మంచి పనులకు సహకరిస్తాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే నిలదీసి పోరాడేందుకు సిద్ధంగా ఉంటాను. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తాను. - కిష్టారెడ్డి మరువలేని రోజు సదాశివపేట: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సంగారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జీవితంలో మరిచిపోలేనిది. నియోజకవర్గ ఓటరు దేవుళ్లు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. ఎమ్మెల్యే కావాలనే చిరకాల కోరిక నెరవేరింది. నేను సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం పూర్వజన్మ సుకృతం. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఎంతో ఆనందం కల్గించింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రజల నమ్మకాన్ని నిలబెడతా. ప్రజాసేవకుడిగా ఉంటూ అవినీతి లేని పాలన అందిస్తా. సదాశివపేటలో మంజీరా తాగునీటి పథకం పనులు పూర్తి చేయిస్తా. సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు, వీధి దీపాల వంటి ప్రజా సమస్యలను పరిష్కరిస్తా. కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. - ప్రభాకర్ -
ఆదాయాన్ని తగ్గించుకోండి
నాకు ముప్పైరెండేళ్లు. పెళ్లయి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ ఓ యాభై వేలు అవసరం అయితే సర్దడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. నేను ఇంటివద్దే ‘లేడీస్ నీడ్స్’ దుకాణం నడుపుతున్నాను. నెలనెలా ఏడెనిమిది వేలు మిగులుతాయి. మా ఆయనకు పాతికవేలు వస్తాయి. ఇద్దరు పిల్లల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ మా జీతం కంటే వేగంగా పెరుగుతుండటంతో ఎప్పుడూ మేము పొదుపు చేయలేకపోయాం. ఎల్లైసీలు తప్ప మేము చేసిన వేరే పొదుపు ఏం లేదు. మాకేమైనా సలహా ఇవ్వండి.? - కిరణ్మయి, విజయవాడ పనిచేసేవారికి పని, పనిచేయనివారికి సాకు దొరుకుతుందట. అలాగే పొదుపు చేసేవారికి డబ్బులు, పొదుపు చేయని వారికి ఖర్చులు కనిపిస్తాయి. మీరు నెలకు ఏడెనిమిది వేలు సంపాదిస్తాను అంటున్నారు. మీకు మీ వ్యాపారంలో ఒక వెయ్యి రూపాయల ఆదాయం తగ్గిందంటే ఏం చేస్తారు... ? వెంటనే నెలనెలా ఆ ఖర్చులకు అలవాటు పడ్డారు కాబట్టి తగ్గిన ఆ వెయ్యి రూపాయలు అప్పు చేసి తెస్తారా... లేకపోతే ఉన్నదాంట్లో సర్దుకుంటారా చెప్పండి. కచ్చితంగా ఉన్నదాంట్లోనే సర్దుకుంటారు. ఏ ఇల్లాలు అయినా ఇదే పనిచేస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచనా విధానం పాజిటివ్‌గానే ఉండాలి. మీరు పొదుపు చేయాలనే గట్టి సంకల్పం పెట్టుకోండి. ఇక నుంచి మీకు ఆరువేలు మాత్రమే ఆదాయం వస్తుందని భావించండి. మీ ఖర్చులు ఆ మొత్తానికే సర్దుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బౌండరీ దాటకండి. ఆరువేలకు మించి వచ్చిన ప్రతిపైసా పొదుపులోకే వెళ్లాలి. అలా చేస్తే ఏడాదిలో మీకో నలభై నుంచి యాభైవేల అత్యవసర నిధి ఏర్పడుతుంది. ఇది మీ రకరకాల భవిష్యత్తు అవసరాలను సంతృప్తి పరుస్తుంది. వీలైతే మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో లోపాలు పరిశీలించడం, వినియోగదారులను పెంచుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా నెల ఆదాయం కూడా పెంచుకోవచ్చు. అపుడు మీ పొదుపు కూడా పెరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బు అవసరాలను తీర్చడమే కాదు, ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. -
చంద్రబాబు వల్లే విభజన తిప్పలు
నూజివీడు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే తెలుగుజాతి రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చిందని వైఎస్సార్ సీపీ నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శించారు. ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి 17మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా, వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే సమైక్యాంధ్రే మేలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇవేమీ పట్టకుండా కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడి సీమాంధ్ర ద్రోహిగా మారాడన్నారు. ఏ మోహం పెట్టుకుని యాత్ర మొదలెట్టారు.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పుట్టిన పార్టీ అని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే టీడీపీ నాయకులు, రాష్ట్ర విభజనకు అంగీకారం ఎలా తెలిపారని ప్రతాప్ ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ పాదాల వద్ద తాకట్టుపెట్టి, మరల సీమాంధ్రలో ఏ మోహం పెట్టుకుని చంద్రబాబు యాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూసిఉండరన్నారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి స్పీకర్ ఫార్మాట్‌తో తమ పదవులకు రాజీనామా చేస్తే, టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దీన్నిబట్టి వారికి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు. సీమాంధ్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామాలు చేసి సోనియాగాంధీపై ఒత్తిడి తీసుకువస్తేనే విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారన్నారు. వారు సోనియా ఇంటి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. అసలు ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తారా, లేదా అనే విషయాన్ని సీమాంధ్ర ప్రజలకు తేల్చిచెప్పాలన్నారు. చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎలాంటి నాయకత్వం లేకుండానే నేడు సీమాంధ్రలోని ప్రజలు గత నెల రోజులుగా ఉద్యమంలో పాల్గొని సమైక్యాంధ్రే కావాలని నినదిస్తున్నారని గుర్తుచేశారు.