ఆదాయాన్ని తగ్గించుకోండి
నాకు ముప్పైరెండేళ్లు. పెళ్లయి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ ఓ యాభై వేలు అవసరం అయితే సర్దడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. నేను ఇంటివద్దే ‘లేడీస్ నీడ్స్’ దుకాణం నడుపుతున్నాను. నెలనెలా ఏడెనిమిది వేలు మిగులుతాయి. మా ఆయనకు పాతికవేలు వస్తాయి. ఇద్దరు పిల్లల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ మా జీతం కంటే వేగంగా పెరుగుతుండటంతో ఎప్పుడూ మేము పొదుపు చేయలేకపోయాం. ఎల్లైసీలు తప్ప మేము చేసిన వేరే పొదుపు ఏం లేదు. మాకేమైనా సలహా ఇవ్వండి.?
- కిరణ్మయి, విజయవాడ
పనిచేసేవారికి పని, పనిచేయనివారికి సాకు దొరుకుతుందట. అలాగే పొదుపు చేసేవారికి డబ్బులు, పొదుపు చేయని వారికి ఖర్చులు కనిపిస్తాయి. మీరు నెలకు ఏడెనిమిది వేలు సంపాదిస్తాను అంటున్నారు. మీకు మీ వ్యాపారంలో ఒక వెయ్యి రూపాయల ఆదాయం తగ్గిందంటే ఏం చేస్తారు... ? వెంటనే నెలనెలా ఆ ఖర్చులకు అలవాటు పడ్డారు కాబట్టి తగ్గిన ఆ వెయ్యి రూపాయలు అప్పు చేసి తెస్తారా... లేకపోతే ఉన్నదాంట్లో సర్దుకుంటారా చెప్పండి. కచ్చితంగా ఉన్నదాంట్లోనే సర్దుకుంటారు. ఏ ఇల్లాలు అయినా ఇదే పనిచేస్తుంది.
ప్రతి విషయంలోనూ ఆలోచనా విధానం పాజిటివ్‌గానే ఉండాలి. మీరు పొదుపు చేయాలనే గట్టి సంకల్పం పెట్టుకోండి. ఇక నుంచి మీకు ఆరువేలు మాత్రమే ఆదాయం వస్తుందని భావించండి. మీ ఖర్చులు ఆ మొత్తానికే సర్దుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బౌండరీ దాటకండి. ఆరువేలకు మించి వచ్చిన ప్రతిపైసా పొదుపులోకే వెళ్లాలి. అలా చేస్తే ఏడాదిలో మీకో నలభై నుంచి యాభైవేల అత్యవసర నిధి ఏర్పడుతుంది. ఇది మీ రకరకాల భవిష్యత్తు అవసరాలను సంతృప్తి పరుస్తుంది.
వీలైతే మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో లోపాలు పరిశీలించడం, వినియోగదారులను పెంచుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా నెల ఆదాయం కూడా పెంచుకోవచ్చు. అపుడు మీ పొదుపు కూడా పెరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బు అవసరాలను తీర్చడమే కాదు, ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.