జీవిత సత్యాల్ని తెలిపేదే సాహిత్యం
జీవిత సత్యాల్ని తెలిపేదే సాహిత్యం
Published Mon, Sep 19 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
కామారెడ్డి:
జీవిత సత్యాల్ని తెలిపేది.. ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని పెంపొందించేది సాహిత్యమేనని ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొదట గుర్తించింది సాహిత్యకారులేనని, సాహిత్య అధ్యయనంతో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఏ తెలుగు విద్యార్థులకు ‘ఎంఏ తెలుగు–అధ్యయనం–అవగాహన’ అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏ కోర్సు అయినా శ్రద్ధగా చదివితే బతుకుబాట చూపుతుందని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా అవతరిస్తున్న నేపథ్యంలో ఎంఏ తెలుగు కోర్సును ఆరంభించడం శుభ సూచకమన్నారు. వ్యక్తిగత జీవితాల్లోని ఒడిదుడుకులను సరిచేసుకునేలా జీవితాన్ని మలచుకోవచ్చునని, సమాజంలో వేలాది మంది జీవితాల్ని సాహిత్యం ద్వారా చదివే అవకాశం కలుగుతుందన్నారు. ఉద్యోగులుగా, రచయితలుగా, జర్నలిస్టులుగా ఎదగడానికి సాహిత్య అధ్యయనం తోడ్పడుతుందని, విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలని సూచించారు. అందమైన అచ్చ తెలుగు పదాలు తెలంగాణ పలుకుబడుల్లోనే అత్యధికం అని, వాటిని పరిశోధించడానికి నిరంతరం కృషి చేయాలని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపల్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పీవీ నర్సింహం, లక్ష్మయ్య, డాక్టర్ వి.శంకర్, కో–ఆర్డినేటర్ అశోక్‌కుమార్, రవికిరణ్, రంజిత్‌మోహన్, డాక్టర్ ఏ.సుధాకర్, కిష్టయ్య, తౌహుస్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement