మీరు సినిమా బాగా చేశారండి.. పెదాలపై చిన్న చిరునవ్వు.. మీ నటనకు నంది అవార్డు వచ్చిందండి.. గుండె నిండా సంతోషం.. ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలన్న తన్మయత్వం.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు నంది అవార్డులు ఎవరిస్తున్నారని! ఈ అవార్డులు ప్రకటించక ఆరేడేళ్లవుతోంది.
నంది పురస్కారాలను ఎవరూ పట్టించుకోవట్లేదని ఇటీవలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత ఆది శేషగిరి రావు. నంది అవార్డులకు ప్రాముఖ్యతే లేకుండా పోయిందని బాధపడ్డారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వినీదత్ నోరు జారుతూ ఇస్తారులే.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు అంటూ వెటకారంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి ఉత్తమ మోసగాడు అవార్డులు మీకే ఇస్తాంలే అని కౌంటరిచ్చాడు. అయినా బాబు హయాంలో కులాలాను బట్టి నంది అవార్డులు ప్రకటించేవారని, నిజాయితీగా అవార్డులు ఇవ్వలేదని ఆరోపించారు.
నిజమే., టీడీపీ హయాంలో నీది ఏ కులం? ఏ ప్రాంతం? నీకు అవార్డు ఇస్తాను.. మరి నాకేటిస్తావు? ఇలా అన్నీ చర్చించుకున్న తర్వాతే నంది ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికే ఇచ్చేవారట. ఈ క్రమంలో కొన్ని అద్భుతం అనిపించిన చిత్రాలను సైతం నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసేవారు. దీంతో ఎంతోమంది చిన్నబుచ్చుకునేవారు. వారిలో కొందరే ఆక్రోశం అణుచుకోలేక బయటపడేవారు. అలా రుద్రమదేవి తీసిన గుణశేఖర్, రేసుగుర్రం నిర్మించిన బన్నీ వాసు, డైరెక్టర్ మారుతి సోషల్ మీడియాలో తమ అసహనాన్ని ప్రదర్శించారు కూడా!
తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా నంది పురస్కారానికి పేరుంది. అలాంటి నంది పురస్కారాల వేడుక మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి ఓసారి ఈ అవార్డుకు సంబంధించిన విశేషాలను గుర్తు చేసుకుందాం..
► 1964లో నంది అవార్డుల ప్రదానం మొదలైంది. దాదాపు 50 సంవత్సరాలు ఈ పరంపర కొనసాగింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ 2017లో నంది అవార్డులు ప్రకటించారు. ఆ తర్వాత నంది అవార్డుల ప్రదానంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
► 1964లో ఉత్తమ ఫీచర్ ఫిలింగా డాక్టర్ చక్రవర్తి సినిమా ఎంపికైంది. అప్పుడు కేవలం ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే ఉండేది.
► 1977 నుంచి నటీనటులు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ఇచ్చే పరంపర మొదలైంది.
► ఎక్కువ నంది అవార్డులు అందుకున్న హీరో నాగార్జున. నటుడిగా నాలుగు, నిర్మాతగా ఐదు నందులు గెలుపొందారు.
► 8 నంది పురస్కారాలతో మహేశ్‌బాబు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.
►వెంకటేశ్, జగపతి బాబు 7 సార్లు, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ మూడేసి చొప్పున నందులు పొందారు.
► 2016లో చివరగా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్‌గా(నాన్నకు ప్రేమతో) అవార్డు అందుకున్నారు.
► ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి 11సార్లు నంది అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment