నూజివీడు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే తెలుగుజాతి రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చిందని వైఎస్సార్ సీపీ నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శించారు. ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి 17మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిందని చెప్పారు.
తెలంగాణ ప్రాంతంలో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా, వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే సమైక్యాంధ్రే మేలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇవేమీ పట్టకుండా కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడి సీమాంధ్ర ద్రోహిగా మారాడన్నారు.
ఏ మోహం పెట్టుకుని యాత్ర మొదలెట్టారు..
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పుట్టిన పార్టీ అని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే టీడీపీ నాయకులు, రాష్ట్ర విభజనకు అంగీకారం ఎలా తెలిపారని ప్రతాప్ ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ పాదాల వద్ద తాకట్టుపెట్టి, మరల సీమాంధ్రలో ఏ మోహం పెట్టుకుని చంద్రబాబు యాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూసిఉండరన్నారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్ ఫార్మాట్‌తో తమ పదవులకు రాజీనామా చేస్తే, టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
దీన్నిబట్టి వారికి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు. సీమాంధ్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామాలు చేసి సోనియాగాంధీపై ఒత్తిడి తీసుకువస్తేనే విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారన్నారు. వారు సోనియా ఇంటి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. అసలు ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తారా, లేదా అనే విషయాన్ని సీమాంధ్ర ప్రజలకు తేల్చిచెప్పాలన్నారు. చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎలాంటి నాయకత్వం లేకుండానే నేడు సీమాంధ్రలోని ప్రజలు గత నెల రోజులుగా ఉద్యమంలో పాల్గొని సమైక్యాంధ్రే కావాలని నినదిస్తున్నారని గుర్తుచేశారు.
చంద్రబాబు వల్లే విభజన తిప్పలు
Published Mon, Sep 2 2013 2:26 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement