నెల్లూరు / పెళ్లకూరు: అధికారుల అత్యుత్సాహం ప్రజాగ్రహానికి కారణమైంది. శుభకార్యాల్లో కలశంగా.. అంత్యక్రియలు, అనంతర కార్యక్రమాల్లో పవిత్రం గా వినియోగించే చెంబును అవహేళన చేయడం తగదంటూ పెళ్లకూరు గ్రామస్తులు అధికారులపై విరుచుకుపడ్డారు. ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది’ అనే నినాదంతో చెంబుకు శవయాత్ర నిర్వహించడాన్ని అడ్డుకున్నారు. తమ సెంటిమెంట్లను అవహేళన చేయడం తగదని, శవయాత్ర నిర్వహించడం వల్ల ఊరికి అరిష్టం కలుగుతుందంటూ నిరసనకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. బహిరంగ మల విసర్జనను రూపమాపడానికి, అందరూ మరుగుదొడ్లను వినియోగించేలా చేయడానికి ఆత్మగౌరవ దీక్షల పేరిట జిల్లా యంత్రాం గం 41 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం’ దక్కిందనే నినాదంతో చెంబులకు పాడెకట్టి శవయాత్రల పేరిట ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండల టాస్క్‌ఫోర్స్ అధికారి నాగజ్యోతి ఆధ్వర్యంలో గురువారం పెళ్లకూరు దళిత కాలనీలో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. అధికారులు, సిబ్బంది కలిసి డప్పుల మోతల నడుమ ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది’ అంటూ నినాదాలు చేస్తూ చెంబుకు పాడెకట్టి శవయాత్ర చేపట్టారు.
అంతలో కాలనీకి చెందిన వారంతా ఏకమై అధికారుల తీరుపై నిరసన తెలిపారు. చెంబుకు పాడెకట్టి శవయాత్ర చేస్తూ ఊరంతా తిప్పడం మంచిది కాదని, ఇలాంటి పనులు ఊరికి అరిష్టం తెస్తాయంటూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఒకానొక దశలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. బహిరంగ మల విసర్జనను నివారించడానికి కార్యక్రమాలు చేపట్టడం, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం, చైతన్య యాత్రలు చేయడంపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, ప్రజల సెంటిమెంట్స్‌ను కించపరిచేలా చేయడం సరికాదన్నారు.
పురాతన కాలం నుంచి చెంబుకు ఎంతో విశిష్టత ఉందని.. ఎన్నో పనులు, అవసరాలతోపాటు సంప్రదాయబద్ధంగా నిర్వర్తించే క్రతువుల్లో దానిని వినియోగిస్తుంటారని తెలిపారు. బహిర్భూమికి మాత్రమే చెంబును వినియోగించరనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ఎంత చెప్పినా కాలనీ ప్రజలు వినకపోవడంతో చేసేది లేక అధికారులు కార్యక్రమం పూర్తి కాకుండానే వెనుదిరిగారు. గ్రామస్తుల నిరసనను ఎదుర్కొన్న వారిలో ఎంపీడీఓ నాగప్రసాద్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మునికుమారి, ఏఈలు మనోజ్‌కుమార్, కృష్ణారావు, ఏఈఓ పుట్టయ్య, మండల కోఆర్డినేటర్ కృష్ణయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment