సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కాం కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా గాంధీ జయంతి రోజు నిరాహార దీక్షా చేస్తానంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పచ్చిగా దోపిడీ చేసి జైలుకు వెళ్లారని, బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని తెలిపారు. అయితే దోపిడీ చేసి జైలుకు వెళ్లి దీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ప్రజల కోసం చేస్తే అర్థం చేసుకోవాలి..
తప్పు చేసినట్లు గుర్తించిన కోర్టు.. రిమాండ్‌కు పంపితే అక్కడ బాబు నిరాహార దీక్ష చేయటంపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏదైనా చేశారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలని స్వాతంత్ర్యం వచ్చాకా ప్రజల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. సిద్దాంతాల మీద చర్చలు జరుగుతున్నాయే గానీ, అమలు విషయంలో జరగడం లేదని అన్నారు. హింసలో దోపిడీ ఉందని సజ్జల.. అహింసతో కూడా పోరాటం చేయవచ్చని గాంధీజీ నిరూపించారని గుర్తు చేశారు.
గ్రామ స్థాయిలో అనేక మార్పులు
సజ్జల మాట్లాడుతూ.. పెత్తందారీతనం లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడవాలంటే కిందిస్థాయి వరకు పథకాలు అమలు చేయాలి. నిరక్షరాస్యత పోవాలి. అప్పట్లో అవసరాలు తక్కువ, అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది, అందరికీ సమాన అవకాశాలు రావాలి. గ్రామ స్థాయిలో మనం అనేక మార్పులు తేగలిగాం. గ్రామ సచివాలయం ఇరుసుగా ఉంటే దాని చుట్టూ అనేక వ్యవస్థలు పని చేస్తున్నాయి. కార్పొరేట్‌కు ధీటుగా విద్య, వైద్య రంగాల్లో మార్పులు తెచ్చాం. దీనిద్వారా అందరి జీవితాల్లో మార్పులు తెచ్చాం.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అద్భుత మార్పులు
ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతోంది. అంతకుముందు 98 లక్షల సర్టిఫికేట్లను కూడా ఇంటికి తీసుకుని వెళ్లి ఇచ్చాం. ఇదంతా కొత్తగా మనం వ్యవస్థను రూపొందించటం వల్లే సాధ్యం. 15 మెడికల్ కాలేజీలు, మండలానికి ముగ్గురు డాక్టర్లు చొప్పున పెట్టాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సీఎం తెచ్చాక అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. అందరి ఆరోగ్యంపై పూర్తి సమాచారం వస్తోంది. దీని ద్వారా ఎక్కడ ఎలాంటి రీసెర్చ్ సెంటర్లు పెట్టాలో, ఎలాంటి స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలో తెలుస్తుంది.
పేరుకు పాలన వైఎస్సార్‌సీపీదే అయినా ప్రజల చేతుల్లోనే పాలన
ఒకప్పుడు ధనవంతులే ఫ్యామిలీ డాక్టర్‌ను పెట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను సీఎం జగన్ నియమించారు. మారుమూల గ్రామాల్లోనూ ఈ విధానం అమలవుతోంది. విద్య, వ్వవసాయ రంగాల్లో కూడా అలాంటి మార్పులే చోటు చేసుకున్నాయి. చంద్రబాబు చెప్పిన నవనిర్మాణం అనేది బోగస్. కానీ వైఎస్ జగన్ చేసి చూపించారు. మహిళలకు కూడా అనేక అవకాశాలు కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే. ఎన్నికలలో మాట ఇచ్చి, తర్వాత వదిలేసే రోజులు పోయాయి. ఇచ్చినమాటకు కట్టుబడి పని చేయాలన్నది వైఎస్ జగన్ విధానం. పేరుకు పాలన వైఎస్సార్‌సీపీదే అయినా సీఎం ప్రజల చేతుల్లోనే పాలన పెట్టారు. నిశబ్ద విప్లవాన్ని ఆయన తెచ్చారు
Comments
Please login to add a commentAdd a comment