తాడికొండ: ఒక సామాజికవర్గానికి చెందిన వారికే రాష్ట్రాన్ని దోచిపెట్టి, పేదల హక్కులను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు అండ్‌కోను రాజకీయంగా తరిమికొడతామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం నాటికి 1,168వ రోజుకు చేరుకున్నాయి.
పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ సామాజికవర్గమంతా కట్టగట్టుకుని కోల్పోయిన అధికారాన్ని తెచ్చుకునేందుకు చేస్తున్న ఆగడాలు బహుజనులను హక్కులకు దూరం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు అందకుండా తప్పుడు కేసులు వేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సమాన హక్కులు పొందకుండా బాబు అండ్ కో అడ్డుకుంటున్నారన్నారు.
రాజధాని పేరుతో రూ.3.50 లక్షల కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబు కోర్టుల ద్వారా బెయిల్ తెచ్చుకుని అధికారం కోసం రోడ్ల వెంబడి తిరుగుతూ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పలు కుంభకోణాల్లో నిందితుడు, ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి జైలులో పెట్టి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్యాకేజీ ఇస్తేగానీ బయటకు రాని పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో పోటీ చేస్తే.. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. నాయకులు ఏటూరి ఆదాం, మాదిగాని గురునాధం, పులి దాసు, కారుమూరి పుష్పరాజు, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment