మరుగుదొడ్డి మహిళల ఆత్మగౌరవం
- ‘స్వచ్ఛ సత్తెనపల్లి’లో ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణన
సాక్షి, గుంటూరు: ‘‘మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. మరుగుదొడ్డికి ఆత్మగౌరవం అనే పేరు పెడుతున్నాను. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం కాపాడుకోవాలి’’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లాలోని తన నియోజకవర్గం సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయగా.. సీఎం బుధవారం వాటిని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సత్తెనపల్లి కార్యక్రమంలో భాగంగా ఆయన కంకణాలపల్లి, ఇరుకుపాలెం, సత్తెనపల్లి బహిరంగసభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. స్పీకర్ కోడెల ఆత్మగౌరవ చాంపియన్ అంటూ.. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో రాష్ట్రంలో సేవా కార్యక్రమంగా మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పర్యవేక్షిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాలను ఉద్యమ స్ఫూర్తిగా చేపట్టాలని పిలుపునిచ్చారు.త్వరలో పింఛన్లను డోర్ డెలివరీ చేస్తామన్నారు.
ఇంకా 63 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలి..
తరతరాల మరుగుదొడ్ల సమస్యకు నేడు పరి ష్కారం దొరికిందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి తరహాలో రాష్ట్రమంతా ఉద్యమంలా మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామన్నారు. 13 జిల్లాల్లో ప్రతి ఇంటికీ టాయిలెట్ నిర్మించాలంటే ఇంకా 63 లక్షలు నిర్మించాల్సి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు కుమార్తె లక్ష్మి రూ. 2.35 లక్షలు, నల్లపాటి చిన్నబ్బి రూ. 3.5 లక్షలు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి విరాళం ప్రకటించారు. స్వచ్ఛభారత్ పోస్టర్‌ను యునిసెఫ్ ప్రతినిధి ముఖ్యమంత్రిచే ఆవిష్కరించారు.