అభివృద్ధే ధ్యేయం | today frist assebly at telangana state | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ధ్యేయం

Published Mon, Jun 9 2014 11:53 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

అభివృద్ధే ధ్యేయం - Sakshi

అభివృద్ధే ధ్యేయం

ప్రమాణం వేళ ఎమ్మెల్యేల అభిమతం
ఆత్మగౌరవం కల నెరవేరిన వేళ.. తెలంగాణ ఆవిర్భావ స్వప్నం సాకారమైన సందర్భం.. కొత్త రాష్ట్రం కొంగొత్త ఉత్సాహంతో సోమవారం తెలంగాణ తొలి అసెంబ్లీ కొలువుదీరింది. సంబురాల సవ్వడి కొనసాగుతుండగానే పునర్నిర్మాణానికి పునాదులేసేందుకు వేదికైన చట్టసభకు ఎమ్మెల్యేలు తరలివచ్చారు. తామెప్పుడూ ప్రజాపక్షమే వహిస్తామంటూ సేవకులుగా పనిచేస్తామంటూ పదవీ ప్రమాణం చేశారు. అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
 
ఆకాంక్షల తెలంగాణ ఆవిర్భావ అసెంబ్లీకి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు సంబరంగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పాతాకొత్తల కలబోతగా వీరంతా సోమవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో తొలిసారిగా మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రభాకర్ ఎన్నికయ్యారు. మిగిలిన వారిలో గతంలోనే మంత్రులుగా పనిచేసిన వారు కొందరైతే ఎమ్మెల్యేలుగా ప్రజల మన్ననలు పొందిన వారు మరికొందరు. ఈ ప్రజానేతలు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు..
 
ఆత్మ గౌరవంతో స్వీకరించా
మెదక్: ఆత్మగౌరవంతో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెలంగాణ పునఃనిర్మాణం కోసం అలుపెరగని కృషి చేస్తా. లోగడ ఉద్యమ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అప్పట్లో చాలా సందర్భాల్లో అసెంబ్లీ నుంచి అవమానకరమైన పరిస్థితుల్లో బహిష్కరణకు గురిచేశారు. ఈ క్రమంలో మా పదవీ కాలమంతా పోరాటాలు, ఉద్యమాలు, రాజీనామాలకే సరిపోయింది. సంతృప్తికరంగా అనిపించలేదు. కాని నేడు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడింది. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నాకు ప్రజలు అవకాశం కల్పించారు. వారి రుణాన్ని తీర్చుకుంటా. కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. సాగునీరు, తాగునీరు, పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తా. సింగూర్ నుంచి ఘనపురం ప్రాజెక్ట్‌కు రావాల్సిన న్యాయమైన తాగునీటి వాటా కోసం, శాశ్వత జీఓ కోసం ప్రయత్నిస్తాను. జైకా పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తా.               - పద్మా దేవేందర్‌రెడ్డి
 
సాగు..తాగు నీటిని అందిస్తా
జోగిపేటః అందోలు నియోజకవర్గం పరిధిలోని రైతులు, ప్రజలకు సాగు, తాగునీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తాను. శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. అర్హులైన పేద వాళ్లందరికీ పక్కా ఇళ్లు, పెన్షన్‌లు మంజూరయ్యేలా కృషి చేస్తాను. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తా. అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాను. గతంలో  ఏ విధంగానైతే పనులు చేసి పేరు తెచ్చుకున్నానో అలాగే మళ్లీ పని చేస్తాను. 10 ఏళ్ల కింద చేపట్టిన పనులు కూడా ఇప్పుడు నా విజయానికి సహకరించాయి. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో కాలు పెట్టినందుకు సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఉన్న సిబ్బంది అసెంబ్లీలో ఇప్పటికీ ఉన్నారు, వారంతా వచ్చి నన్ను అభినందిస్తుంటే కల్గిన ఆనందం అంతా ఇంతా కాదు.
                                      - బాబూమోహన్
 
 న్యాయం చేస్తా

సిద్దిపేట అర్బన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టడం స్వేచ్ఛగా ఉంది. ఇదీ నా బాధ్యతలను మరింత పెంచింది. గతంలో మంత్రి పదవిని నిర్వహించినా మిత్ర పక్ష పాలనలో పనిచేశా. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో మంత్రి కావడం అద్భుతంగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటా. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసినట్లే పదవికి సరైన న్యాయం చేస్తాను. సిద్దిపేట ప్రజల ప్రేమను మరువను. సిద్దిపేటలో మరో రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తా. మార్కెట్ యార్డ్‌లో సమస్యలను పరిష్కరించి రైతులకు సౌకర్యాలు పెంచుతాను. గొలుసు చెరువులను పునరుద్ధరించి సిద్దిపేట ప్రాంతంలో భూగర్భ జలవనరులను పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపడతా. అన్ని రంగాల్లో సిద్దిపేటను అగ్రగామిగా మార్చడానికి కృషి చేస్తాను. తడ్కపల్లి వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి సుమారు రెండు లక్షల ఎకరాలకు నీటిని అందించే భారీ ప్రణాళికను ఆమలు చేస్తా. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచుతాను.                                                                                  - హరీష్‌రావు
 

ఆ అనుభూతి  చెప్పలేను
నర్సాపూర్: నేను ఎమ్మెల్యేగా గెలవడం అదృష్టంగా భావిస్తున్నా. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినపుడు కల్గిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. ఎంతో సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేగా గెలవడం నా ఇన్నేళ్ళ రాజకీయ జీవితానికి న్యాయం జరిగినట్లు భావిస్తున్నా. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. వారి సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. నర్సాపూర్‌లో ప్రధానంగా ఆర్‌టీసీ డిపో ఏర్పాటుకు కృషి చేస్తాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆయనే మన సీఎం అయినందున డిపో ఏర్పాటుకు నిధులు త్వరగా మంజూరు చేస్తారనే విశ్వాసం నాకు ఉంది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వరకు నాల్గు లైన్ల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తాను. అలాగే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంజీర తాగునీరు అందెలా చర్యలు తీసుకుంటాను.
 - మదన్ రెడ్డి
 
భూసమస్యలు పరిష్కరిస్తా                 
దుబ్బాక: భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తా. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతా. దుబ్బాక నియోజకవర్గంలో ప్రధానంగా భూసమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూసమస్యలన్నీ పరిష్కరించి రైతులకు సహకారం అందిస్తా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించి పేదలకు అండగా నిలబడతాను. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కేసీఆర్ నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాను.                 - రామలింగారెడ్డి
 
ప్రగతికి పాటుపడతా
జహీరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి కోసం పాటు పడతాను. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఏం చేశామన్నదే ముఖ్యం. ప్రతిపక్షంగా మేము అసెంబ్లీలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాం. కొత్త రాష్ట్ర అసెంబ్లీలో నాకు ప్రాతినిధ్యం లభించడం ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ గాలి వీచినా ప్రజల ఆదరాభిమానాలతో నేను విజయం సాధించా. టీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసిందనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు గుర్తించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పోరాడి నిధులను సాధిస్తా. జహీరాబాద్‌ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. గొలుసు చెరువుల నిర్మాణంతో పాటు నారింజ నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిమ్జ్‌ను ముందుకు తీసుకెళ్లి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా చూస్తాను.                     - గీతారెడ్డి
 
ప్రజా సమస్యలపై పోరాడతా
నారాయణఖేడ్: ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాడతా. నేను 1989, 2009లో శాసనసభ్యునిగా ఎన్నికైన సమయంలో మా పార్టీ (కాంగ్రెస్) అధికారంలో ఉంది. 1999లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. 1999లో ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ సైతం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో శాసనసభకు ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం చేపట్టే స్పీకర్ ఎన్నికకు సంపూర్ణంగా సహకరిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పోరాడతాను. టీఆర్‌ఎస్ పార్టీ చేసే మంచి పనులకు సహకరిస్తాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే నిలదీసి పోరాడేందుకు సిద్ధంగా ఉంటాను. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తాను.          - కిష్టారెడ్డి
 
మరువలేని రోజు
సదాశివపేట: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత  సంగారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జీవితంలో మరిచిపోలేనిది. నియోజకవర్గ ఓటరు దేవుళ్లు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. ఎమ్మెల్యే కావాలనే చిరకాల కోరిక నెరవేరింది. నేను సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం పూర్వజన్మ సుకృతం. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఎంతో ఆనందం కల్గించింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రజల నమ్మకాన్ని నిలబెడతా. ప్రజాసేవకుడిగా ఉంటూ అవినీతి లేని పాలన అందిస్తా. సదాశివపేటలో మంజీరా తాగునీటి పథకం పనులు పూర్తి చేయిస్తా. సీసీ,  బీటీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు, వీధి దీపాల వంటి  ప్రజా సమస్యలను పరిష్కరిస్తా. కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.                                   - ప్రభాకర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement