సహకరించని మంత్రులపై కఠిన చర్యలు
► కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్
► పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొనాల్సిందే
సాక్షి, బెంగళూరు : పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో సహకరించని మంత్రులు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)అధ్యక్షుడు పరమేశ్వర్ హెచ్చరించారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కోటి మందిని సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందన్నారు.
బూత్‌స్థాయి నమోదు వంటి సంప్రదాయ విధానాలతో పాటు అన్‌లైన్, మొబైల్ తదితర అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించుకుంటూ సభ్యత్వ నమోదులో చురుకుగా వ్యవహరిస్తోందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామన్నారు. రాష్ట్ర పరిస్థితిని గమనించిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాం ధీ సభ్యత్వ నమోదుకు మరో రెండు నెలలు గడువు ఇచ్చారన్నారు.
ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, మండళ్ల అధ్యక్షుల పోస్టులను దక్కించుకున్న వారు సభ్యత్వ నమోదుపై ఎక్కువ దృష్టి సారిం చాలని సూచించారు. తానే స్వయంగా ప్రతి నియోజక వర్గానికి వచ్చి సభ్యత్వ నమోదు విషయమై సమీక్ష జరుపుతానని తెలిపారు. అంతేకాకుండా సభ్యత్వ నమోదు కార్యక్ర మ పరిశీలన కోసం నాలుగు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
తమ పరిశీలనలో సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించనట్లు తేలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇకపై కాంగ్రెస్ తరఫున మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎంపికయిన వారి కి కనిష్టంగా వారం పాటు ఘటప్రభలో పార్టీ శిక్షణ కేంద్రంలో పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణకు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయం పార్టీ పదాథికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పరమేశ్వర్ తెలిపారు.
న్యాయపోరాటం తప్పదు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెలాఖరులోపు బెంగళూరులోని జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకు అప్పగించకుంటే న్యాయపోరాటం తప్పదన్నారు. ఆ పార్టీ నాయకులే స్వయంగా కార్యాలయాన్ని ఖాళీ చేస్తే హుందాగా ఉంటుందని పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. సామాజిక వేత్తగా అభివర్ణించుకునే హీరేమఠ్ రాష్ట్ర మంత్రులను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని పరమేశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. అతనిదగ్గర సరైన ఆధారాలు ఉంటే లోకాయుక్తకు అందించి దర్యాప్తు కోరవచ్చుకదా? అని మీడియా అడిగిన ఓప్రశ్నకు పరమేశ్వర్ సమాధానమిచ్చారు.