అంతా అనుకున్నట్టే జరిగింది. టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్ష పదవుల ఎన్నిక వ్యవహారం హైడ్రామాను తలపించింది. అధ్యక్షుల ఎంపిక విషయంలో ఇన్‌చార్జి మంత్రి ఎదుట మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ మొక్కుబడి తంతుగా సాగింది.
ఒక దశలో జిల్లా పార్టీ ప్రాంగణంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగడం పరిస్థితికి అద్దంపట్టింది. అర్బన్ జిల్లా వరకు ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ రూరల్ జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో మాత్రం ఉదయం నుంచి రాత్రివరకు చర్చోపచర్చలు సాగించినా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరకు చేసేది లేక తుది నిర్ణయం అధిష్టానానికి వదిలేశారు.
- అర్బన్ అధ్యక్షునిగా మరోసారి వాసుపల్లి
- ప్రతిపాదించిన మెజార్టీ ఎమ్మెల్యేలు
- రూరల్ అధ్యక్షునిపై కుదరని ఏకాభిప్రాయం
- అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆనంద్, ముత్తంశెట్టి
- షీల్డ్ కవర్‌లో పేర్లు..నేడు అధికారిక ప్రకటన
నేటి సాయంత్రం అధ్యక్షుల ఖరారు
అభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం ఆదివారం రాత్రి మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నగర, జిల్లా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నాయకులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నామని, ఆ మేరకు కొన్ని పేర్లను పార్టీ అధిష్టానానికి పంపామని చెప్పారు. వీటని పార్టీ అధిష్టానం పరిశీలించి హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం పేర్లు వెల్లడిస్తుందని తెలిపారు.
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యంగా అధ్యక్ష పదవుల కోసం మంత్రులు గంటా-అయ్యన్న వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నటుగా వ్యవహరించడంతో పరిశీలకులకు తలనొప్పిగా మారింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో యనమల రామకృష్ణుడుకు ఈ ఎన్నికల నిర్వహణ సవాల్‌గా మారాయి. యనమలతో పాటు పరిశీలకులుగా కంభంపాటి రామ్మోహనరావు, ఎస్‌విఎస్‌ఎన్ వర్మలు నియోజక వర్గాల వారీగా వచ్చిన ఎమ్మెల్యేలు, నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
అర్బన్ జిల్లా అధ్యక్ష ఎంపికలో ఒకటి రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు విబేధించినా సిటీ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుత అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కొనసాగించాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. మంత్రి గంటా, మాజీ ఎంపీ ఎంవిఎస్ మూర్తి ఆశీస్సులతో అధ్యక్ష రేసులో నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్ పేరు అభిప్రాయ సేకరణ లో ఎక్కడా వినిపించలేదు. సిటీ పరిధిలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశానికి వెలగపూడి అనుచరులు మాత్రం పీలా శ్రీనివాస్ పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. మిగిలిన ఎమ్మెల్యేలంతా వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
రూరల్ జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
రూరల్ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మంత్రి అయ్యన్న స్థానికంగా మకాం వేస్తే ఇన్‌చార్జి మంత్రి హోదాలో కడప వెళ్లిన మంత్రి గంటా ఫోన్‌లో రాజకీయం నెరిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని భర్త భాస్కర్‌ను గంటా ప్రతిపాదించగా మెజార్టీ ఎమ్మెల్యేలు భాస్కర్‌ను విభేదించారు. తాను బలపర్చిన భాస్కర్‌ను మెజార్టీ నేతలు వ్యతిరేకించడంతో అనూహ్యంగా తన అనుచరుడైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆనంద్‌ను పెందుర్తి, యలమంచలి, పాయకరావుపేట ఎమ్మెల్యేలు బలపర్చినట్టు తెలిసింది. అధ్యక్షుడ్ని మార్చాల్సి వస్తే ఆనంద్‌కు ఇవ్వాలని.. లేకుంటే గవిరెడ్డిని కొనసాగించాలని చోడవరం ఎమ్మెల్యే సూచించినట్టు చెబుతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కూడా రూరల్ జిల్లా అధ్యక్షుడ్ని మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీకి ఎమ్మెల్యేలు లేని మాడుగుల, అరకు, పాడేరు నియోజకవర్గానికి చెందిన సీనియర్లు మాత్రం గవిరెడ్డికు మద్దతు పలికినట్టు తెలిసింది. గంటా అనుచరుడైన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేరును అనకాపల్లితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా సూచించినట్టు సమాచారం.
కార్యకర్తల బాహాబాహీ
అభిప్రాయాలు చెప్పిన తర్వాత బయటకొచ్చిన మాడుగుల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గవిరెడ్డికి వ్యతిరేకంగా రమణమ్మ అనే కార్యకర్త తన అభిప్రాయాన్ని చెప్పడంతో నేతలంతా ఆమెపై విరుచుకుపడ్డారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నువ్వు అభిప్రాయం చెప్పేందుకు ఎలా వచ్చావంటూ మండిపడ్డారు. ఈ దశలో కార్యాలయంలో ఎం జరుగుతుందో తెలియని గందర గోళ పరిస్థితి నెలకొంది.
గవిరెడ్డి కోసం అయ్యన్న మంత్రాంగం : మంత్రి అయ్యన్న తన అనుచరుడైన గవిరెడ్డి కోసం మంత్రాంగం జరిపారు. తొలుత ఉదయం సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి యనమలను కలిసి జిల్లా పరిస్థితిని వివరించిన అయ్యన్న ఆ తర్వాత అభిప్రాయసేకరణ పూర్తయ్యే వరకు కార్యాలయంలోనే మకాం వేసి మంత్రాంగం నెరిపారు. మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో పరిశీలకులు కంభంపాటి, వర్మలు భేటీ కాగా, అయ్యన్నను స్వయంగా పిలిపించుకుని యనమల సుదీర్ఘంగా చర్చించారు. సిటీ అధ్యక్ష ఎన్నిక కొలిక్కి వచ్చినప్పటికీ రూరల్ అధ్యక్ష ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో రెండింటి ప్రకటన వాయిదావేయకతప్పలేదు. అర్బన్‌కు వాసుపల్లి గణేష్‌కుమార్, రూరల్‌కు గవిరెడ్డితో పాటు ఆనంద్, అవంతి శ్రీనివాసరావు, లాలం భాస్కర్ పేర్లను అధిష్టానానికి యనమల పంపారు. సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
కొనసాగుతున్న హై డ్రామా!
Published Mon, May 18 2015 3:37 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement