అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అనైతిక కార్యకలాపాల వెనుక ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. వారందరికీ ఆమె తరచూ ఫోన్లు చేయడం, గంటల తరబడి జరిపిన వాట్సాప్ సంభాషణలను సీబీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి నేతృత్వంలో నిర్మలాదేవి కేసు విచారణ జరుగుతోంది. నిర్మలాదేవిపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ విద్యార్థినులను లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టడంపై ఉన్నతవిద్యాశాఖకు గత నెలలోనే ఫిర్యాదులు అందాయి. కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక నివేదిక తయారుచేసి అధికారులకు పంపారు. అయితే వారు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో సదరు నివేదికను గవర్నర్ కార్యదర్శి రాజగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం విచారణకు వచ్చిన కమిషన్ చైర్మన్ ఆర్ సంతానంను అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఒక్క నిర్మలాదేవి విషయమేగాక ఉన్నతవిద్యాశాఖలో చోటుచేసుకున్న అనేక అక్రమాలను ఆయన ముందుంచారు. ఇదిలాఉండగా, నిర్మలాదేవి మొబైల్ ఫోన్‌లో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అ«ధికారులు, ఉన్నత విద్యాశాఖలో పనిచేసే మరికొందరు అధికారులతో సంభాషణలు, ఫొటోలతో కూడిన ఆధారాలను సీబీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ పెద్దల భాగోతం బైటపడడంతో విచారణలో ప్రతిష్టంభన నెలకొంది. నిర్మలాదేవిని సస్పెండ్ చేస్తూ జారీఅయిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా ఆమె ఒత్తిడి మేరకు మదురై కామరాజ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్..రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో పట్టుదొరకని కాలంలో నిర్మలాదేవి పలువురితో సన్నిహితంగా మెలిగిందని, విద్యార్థినులతో ‘విందు’ ఏర్పాట్లు చేసిందని విచారణలో వెలుగుచూసింది. విద్యార్థినులను లైంగికంగా లొంగదీసుకునేందుకు వారికి చుడిదార్లు, చీరలు కొనిచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పలువురు విద్యార్థినులను శుక్రవారం విచారించారు. ఈ రకంగా వచ్చిన అక్రమార్జనతో వీసీ పోస్టు సంపాదించాలని భావించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం కమిషన్ చైర్మన్ సంతానం శుక్రవారం కళాశాలలో విచారణ జరిపారు. నిర్మలాదేవిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సీబీసీఐడీ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం మదురై సాత్తూరు కోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. నిర్మలాదేవిని వెంటపెట్టుకుని పోలీసులు రావడంతో మాదర్ సంఘం కార్యకర్తలు ఆమెను ముట్టడించి నిరసన నినాదాలు చేశారు. ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment