పూందమల్లిలో ఉద్రిక్తత
► ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం
► ఘర్షణకు దిగిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేల వర్గీయులు
► నాలుగు కార్లు ధ్వంసం
► భారీగా పోలీసుల మోహరింపు
తిరువళ్లూరు: దినకరన్ గ్రూపులో కొనసాగుతున్న పూందమల్లి ఎమ్మెల్యే తన్నీర్‌కుళం ఏలుమలై తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే మణిమారన్, ఆయన మద్దతుదారులతో ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన ఏలుమలై వర్గీయులు వారిపై దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తిరువళ్లూరు జిల్లా, పూందమల్లి అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏలుమలై ప్రస్తుతం దినకరన్ క్యాంపులో ఉంటున్నారు. ఈయనకు జిల్లా కన్వీనర్ పదవి కేటాయిస్తూ దినకరన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏలుమలై తన నిర్ణయం మార్చుకుని ఎడపాడి పళణిస్వామికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మణిమారన్ నేతృత్వంలో దాదాపు 50మంది కార్యకర్తలు తన్నీర్‌కులంలో ఆయన ఇంటిని ముట్టడికి యత్నించారు.
దీంతో ఏలుమలై, మణిమారన్ వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపుచేశారు. ఘర్షణలో మణిమారన్ వర్గానికి చెందిన నాలుగు కార్లును ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. కాగా ఘర్షణ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఏలుమలైకు మద్దతుగా స్థానికులు రాస్తారోకోకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం మహిళలను రాస్తారోకోకు ఉసికొల్పిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. నియోజకవర్గంలో తిరగనివ్వం: కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా దినకరన్ ఇచ్చే తాయిలాలకు ఆశపడిన ఏలుమలైను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని మణిమారన్ అన్నారు. పార్టీతో సంబంధం లేని దినకరన్ వెంట ఏలుమలై ఎలా వెళతారని ప్రశ్నించారు.