ఎమ్మెల్యేకు టోకరా | police arrested man who cheated mlas | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు టోకరా

Published Sun, Jun 14 2015 1:12 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

నిందితుడు తోట బాలాజి అలియాస్ లక్ష్మణ్ మహేశ్ అలియాస్ మల్లిబాబు - Sakshi

నిందితుడు తోట బాలాజి అలియాస్ లక్ష్మణ్ మహేశ్ అలియాస్ మల్లిబాబు

- కుటుంబ సంక్షేమ అభివృద్ధి నిధి పేరుతో...
- బ్యాంక్ అకౌంట్ ఆధారంగా నిందితుడు అరెస్ట్
 
హైదరాబాద్:
ప్రభుత్వ సంక్షేమ పథకం పేరుతో మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి టోకరా వేసి రూ. 90 వేలు కాజేసిన వ్యక్తిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ రమారాజేశ్వరి కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన తోట బాలాజి అలియాస్ లక్ష్మణ్ మహేశ్ అలియాస్ మల్లిబాబు (37) రామగుండం ఎన్‌టీపీసీలో పని చేసేవాడు. పలు కారణాల రీత్యా సంస్థ వారు ఉద్యోగం నుంచి తొలగించారు.

అప్పటినుంచీ ప్రజాప్రతినిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసే పని చేపట్టాడు. ఈ క్రమంలో ఈ నెల 8న మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి సెల్‌కు కాల్ చేయగా ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడాడు. తనను రాఘవేంద్రారెడ్డిగా పరిచయం చేసుకుని, సెక్రటేరియట్‌లో పని చేస్తానని చె ప్పాడు. తెలంగాణ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో కారు కొనుగోలుకు, డెయిరీ ఫామ్, కిరాణ షాపుల కోసం కుటుంబ సంక్షేమ అభివృద్ధి నిధి పథకాన్ని ప్రారంభించిందని చెప్పాడు.

పథకంలో మెంబర్‌షిప్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 300 చొప్పున మూడు వందల మంది నుంచి రూ. 90 వేలు ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నంబర్ 200110100057005లో జమ చేయాలని ఇందుకు 8వ తేదీయే చివరి తేదీ అని చెప్పాడు. దీంతో వారు రూ. 90 వేలను బ్యాంక్‌లో జమ చేశారు. ఆ తర్వాత అదే నంబర్‌కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి సెక్రటేరియట్‌లో వాకబు చేయగా రాఘవేంద్రారెడ్డి అనే వారెవరూ అక్కడ లేరని, అలాంటి పథకమూ లేదని తెలిసింది.

దీంతో శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు. బ్యాంక్ అకౌంట్ కృష్ణా జిల్లా పెనుగంచిబ్రోలులో నివసించే షేక్ నాజర్‌వలి కుమారుడు నాగూర్‌వలిదిగా గుర్తించారు. వీరిని విచారించగా నిందితుడికి బ్యాంక్ అకౌంట్ లేదని వీరిని పరిచయం చేసుకుని.. నగరం నుంచి తన తమ్ముడు బ్యాంక్‌లో డబ్బులు వేస్తాడని నమ్మబలికి వారి అకౌంట్‌లో డబ్బులు పడగానే డ్రా చేసుకున్నాడని తెలిసింది.

వీరి సహాయంతో కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు మల్లిబాబుని శనివారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. 90 వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా గతంలో పలువురు ఎంపీలను మభ్యపెట్టి డబ్బులు కాజేసిన సంఘటనలో బోయినపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మల్లిబాబు గతంలో పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులనూ బురిడీ కొట్టించి డబ్బులు కాజేశాడు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement