ఆ ఎమ్మెల్యేల ఆస్తులు ఏకంగా 82% పెరిగాయ్!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 311 మంది ఎమ్మెల్యేలు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విశేషమేమంటే ఈ ఎమ్మెల్యేల ఆస్తులు గత ఐదేళ్లలో సగటున రూ. 2.84 కోట్ల మేర పెరిగాయి. అంటే వీరి ఆస్తి ఎమ్మెల్యేగా ఉన్నకాలంలో సుమారు 82శాతం పెరిగిపోయింది. ఈ 311మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి 2012 ఎన్నికల్లో రూ. 3.49 కోట్లు (రూ. 3,49,08,073) ఉండగా.. ఇప్పుడది రూ. 6.33 కోట్ల (రూ. 6,33,64,781)కు పెరిగిందని ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఏడీఆర్) వెల్లడించింది. 2012లో పోటీచేసి 2017లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 311 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి సగటున రూ. 2.84 కోట్ల మేర పెరిగిపోయిందని తెలిపింది.
యూపీ ఎన్నికల నిఘా సంస్థతో కలిసి ఆయా అభ్యర్థుల ఆస్తుల వివరాలను విశ్లేషించడం ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. తిరిగి పోటీచేస్తున్న ఎమ్మెల్యేలలో బీఎస్పీ నేత షా ఆలం ఉర్ఫ్ జమాలి అత్యధికంగా ఆస్తులు కూడబెట్టారు. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఆయన ఆస్తులు ఏకంగా రూ. 64 కోట్లు పెరిగిపోయాయి. ఆయన తర్వాత మరో బీఎస్పీ ఎమ్మెల్యే నవాబ్ కరీం ఆలీ ఖాన్ ఆస్తులు ఏకంగా రూ. 40 కోట్లు పెరిగాయి. తదుపరి స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అనూప్ కుమార్ ఉన్నారు. ఆయన ఆస్తులు రూ. 35 కోట్లు పెరిగాయి. పార్టీల ప్రకారం చూసుకుంటే ఎస్పీకి చెందిన 162మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటును రూ. 2 కోట్ల మేర పెరిగిపోగా, బీఎస్పీకి చెందిన 57మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 4 కోట్ల వరకు పెరిగిపోయాయి. బీజేపీకి చెందిన 55మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ. 2 కోట్లు పెరుగగా, కాంగ్రెస్‌కు చెందిన 19మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ. 2 కోట్ల మేర పెరిగాయి.