మంత్రులు... మహారాజులు
* ఐదేళ్లలో ఆస్తులు రెండింతలు
* మహిళల్లో వలర్మతికి ప్రథమస్థానం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చే నేతల రోజులు పోయాయి. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు సేవ చేసేందుకే ఉన్నారని ప్రజలు సైతం నమ్మే రోజులు అంతరించిపోయాయి. రాజకీయాలు, కోట్లు కుమ్మరించి ఎన్నికల్లో గెలవడం అంతకు రెట్టింపు సంపాదించుకోవడం కోసమేనని తమిళ మంత్రులు మరోసారి రుజువుచేశారు. అన్నాడీఎంకే అభ్యర్దులుగా నామినేషన్ వేసిన మంత్రి పుంగవులంతా తమ ఆస్తులను ప్రకటించారు. 2011 నాటి ఎన్నికల్లో పేర్కొన్న ఆస్తుల చిట్టాలో పోల్చుకుంటే ఎక్కువశాతం మంత్రులు మరింత ఆస్తి పరులైనారు.
పురుష మంత్రుల్లో రూ.13.55 కోట్లతో మంత్రి వెంకటాచలం, మహిళా మంత్రుల్లో వలర్మతి రూ.8.92 కోట్ల ఆస్తులతో ప్రధమ స్థానం పొందారు. మంత్రి ఎడపాడి పళని స్వామి: 2011-రూ.65.15 లక్షలు, 2016-రూ.7.77 కోట్లు. మంత్రి తంగమణి: 2011-రూ.75.52 లక్షలు 2016-రూ.1.57 కోట్లు. మంత్రి పళనియప్పన్: 2011-రూ.29.69 లక్షలు, 2016- రూ.2.50 కోట్లు. మంత్రి సంపత్: 2011- రూ.2.08 కోట్లు, 2016-రూ.4.87 కోట్లు. మంత్రి ఎస్‌పీ షణ్ముగనాధన్: 2011- రూ.8.60 లక్షలు, రూ.2.27 కోట్లు. మంత్రి వేలుమణి: 2011- రూ.2.71 కోట్లు, 2016-రూ.4 కోట్లు. డిప్యూటీ స్పీకర్ జయరామన్: 2016 రూ.8.90 కోట్లు. మంత్రి మోహన్: 2011-రూ.85.60లక్షలు, 2016 రూ.73.62 లక్షలు.
అలాగే తేని నుండి నామినేషన్ వేసిన మంత్రి ఓ పన్నీర్ సెల్వం: 2011- రూ.55.50 లక్షలు, 2016 రూ.1.53 కోట్లు. మధురై పడమర నుండి పోటీచేస్తున్న మంత్రి సెల్లూరు రాజా: 2011-39.44 లక్షలు, 2016- రూ.1.18 కోట్లు. మధురై తిరుమంగళం అభ్యర్ది మంత్రి ఉదయకుమార్: 2011-రూ.14.59లక్షలు, రూ.30.95లక్షలు. దిండుగల్లు ఆత్తూరు నియోజవర్గ అభ్యర్ది మంత్రి నత్తం విశ్వనాధం: 2011- రూ.1.39 కోట్లు, 2016- రూ.2.24 కోట్లు. విరుదునగర్ శివకాశీ అభ్యర్ది మంత్రి కేటీ రాజేంద్రబాలాజీ: 2011- రూ.51.33లక్షలు, 2016- రూ.2.14 కోట్లు. మంత్రి వెంకటాచలం: 2011-రూ.11.80 కోట్లు, 2016-రూ.13.55 కోట్లు.
మాజీకి తగ్గిన ఆస్తి: తూత్తుకుడి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో గెలిచి కార్మిక సంక్షేమశాఖా మంత్రిగా ఉండిన చెల్లపాండియన్ మధ్యలో పదవిని కోల్పోయారు. గత ఎన్నికల్లో రూ.17 కోట్ల స్థిరాస్థులు చూపిన ఆయన ప్రస్తుత ఎన్నికల్లో రూ.5.7 కోట్లుగా చూపడం విశేషం.
మహిళల్లో వలర్మతికి మొదటి స్థానం
జయలలిత మంత్రి వర్గంలోని మహిళా మంత్రుల్లో వలర్మతి 2016లో రూ.8.92 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. 2011లో రూ.3.31 కోట్లు. మంత్రి గోకుల ఇందిర: 2011-రూ.1.4 కోట్లు, 2016-రూ.4.51 కోట్లు.