సాక్షి, భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాలనలో పారదర్శకత పట్ల అత్యంత మక్కువ కనబరుస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో అడుగిడిన తొలి రోజుల నుంచి పారదర్శక పాలన నినాదాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ నినాదాన్ని సోషల్ మీడియాతో అనుసంధానపరిచారు.
ట్రిపుల్ టీ మంత్రం..
ఈ నేపథ్యంలో పాలన అధికారులకు ట్రిపుల్ టీ మంత్రాన్ని ప్రబోధించారు. టీమ్‌వర్క్–ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత)–టెక్నాలజీ సూత్రంతో ప్రజలకు ప్రభుత్వ సేవల్ని సకాలంలో అందజేయాలని ఆదేశించారు. అధికారులకు ఆదేశాలు జారీ కంటే ముందుగా మంత్రి మండలి సభ్యులకు ఈ మేరకు సంకేతాలు జారీ చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు వంటి సందర్భాల్లో పార్టీ నుంచి తొలగించడంలో ఆయన ముందంజ వేస్తున్నారు.
ప్రతిఒక్కరూ పూచీదారులే
రాష్ట్రంలో బిజూ జనతాదళ్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి అయింది. ఈ వ్యవధిలో గత 17 ఏళ్ల నుంచి పార్టీ అధికారంలో నిరవధికంగా కొనసాగుతోంది. వ్యవస్థాపక అధ్యక్షునిగా నియమితులైన నవీన్ పట్నాయక్ నిరవధికంగా కొనసాగుతున్నారు. ఆయన అధ్యక్షతలో సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజలకు పూచీదారులుగా వ్యవహరించాల్సిందేనంటారు.
44 మంది మంత్రుల తొలగింపు
ఈ కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 17 ఏళ్ల పాలనలో 44 మంది మంత్రుల్ని తొలగించారు. వీరిలో అత్యధికులు అతిరథ మహారథులే. నిందిత సభ్యులు నిర్దోషులుగా రుజువు చేసుకునేంతవరకు పార్టీ వ్యవహారాల్లో చొరబడేందుకు ఏమాత్రం అవకాశం కల్పించరు. ఇటీవల కాలంలో నిర్దోషులుగా రుజువు చేసుకోవడంతో పాటు ఆయన వ్యక్తిగత విశ్వసనీయతను కూడా చూరగొనడం అనివార్యంగా పరోక్ష సంకేతాలు జారీ చేస్తున్నారు.
పార్టీ నుంచి దీర్ఘకాలంగా దూరమైన పలువురు సీనియర్లను అక్కున చేర్చుకునేందుకు నవీన్ పట్నాయక్ యోచిస్తున్నారు. అయితే అంతకుముందు ఆయన ఒక్కొక్కరి పూర్వాపరాల్ని సమీక్షించిన మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికి ఏడాది గడిచినా ఇంతవరకు ఈ మేరకు దాఖలాలు కనిపించడం లేదు. తొలగింపునకు గురైన పలువురు ప్రముఖులు పార్టీ అధ్యక్షుని పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు.
పునఃప్రవేశం ఆరుగురికి మాత్రమే
నవీన్ పట్నాయక్ పాలనా కాలంలో తొలగింపునకు గురైన 44 మంది మంత్రుల్లో కేవలం ఇద్దరు మాత్రమే రాజీనామా చేశారు. కాగా 6గురు మాత్రం నిర్దోషులుగా రుజువు చేసుకుని అధ్యక్షుని మనసు చూరగొని తిరిగి పార్టీలో ప్రవేశం సాధించగలిగారు. ఈ జాబితాలో దేబీ ప్రసాద్ మిశ్రా, డాక్టర్ దామోదర్ రౌత్, విజయ శ్రీ రౌత్రాయ్, రొబి నారాయణ నొందొ, ప్రతాప్ చంద్ర జెనా, ప్రదీప్ మహారథి ఉన్నారు. అలాగే క్రమంగా నిజాయితీ ప్రదర్శించి నవీన్ పట్నాయక్ విశ్వసనీయత కూడగట్టుకోవడంతో తొలుత పుష్పేంద్ర సింగ్‌దేవ్, అతున్ సవ్యసాచి నాయక్‌లకు పార్టీలో ప్రవేశానికి అవకాశం సాధించారు. 2014 ఎన్నికల్లో పార్టీ విజయానికి సారథ్యం వహించడంతో వీరికి కొనసాగుతున్న క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. తదుపరి దశల్లో ప్రఫుల్ల సామల్, ప్రతాప్ జెనా నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో స్థానం సాధించుకున్నారు.
ఆది నుంచి ఇదే వరస
నవీన్ పట్నాయక్ నేతృత్వంలో తొలి ప్రభుత్వం 2000వ సంవత్సరంలో ఏర్పడింది. 2004వ సంవత్సరం వరకు కొనసాగింది. ఈ వ్యవధిలో 6గురు మంత్రుల్ని క్యాబినెట్ నుంచి తొలగించి అవాక్కయ్యేలా చేశారు. నవీన్ తొలి వేటుకు బలైన వారిలో కమలా దాస్, ప్రొశాంతొ నొందొ, నళినీ కాంత మహంతి, అమర ప్రసాద్ శత్పతి, దేవీ ప్రసాద్ మిశ్రా, ఎ.పి. సింగ్ ఉన్నారు. ఈ విడతలో రాష్ట్ర రాజకీయాల్లో ఆరి తేరిన నాయకునిగా వెలుగొందిన రామకృష్ణ పట్నాయక్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
క్రమశిక్షణ చర్యల కింద..
అప్పట్లో ఆయన ఆర్థిక శాఖకు సారథ్యం వహించారు. రెండో విడత 2004 నుంచి 2009 సంవత్సరాల మధ్య పాలనలో క్రమ శిక్షణ చర్యల కింద నవీన్ పట్నాయక్ 14 మంది మంత్రుల్ని తొలగించారు. వీరిపట్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలున్నాయి. ప్యారీ అంకుల్ కూడా అతీతులు కాదు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజకీయ గురువు, మార్గదర్శి, శ్రేయోభిలాషిగా వెలుగొందిన ప్యారీ మోహన మహాపాత్రో పట్ల కూడా ఆయన క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరించేందుకు వెనుకంజ వేయలేదు.
అప్పట్లో ఈ సంఘటన తీవ్ర కలకలం రేకెత్తించింది. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌తో అత్యంత సన్నిహితునిగా చలామణి అయిన ప్యారీ మోహన మహాపాత్రోను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అంకుల్‌గా పిలిచే వారు. ప్యారీ తెర వెనక కథానాయకునిగా నవీన్ పట్నాయక్‌తో పాలన నిర్వహించిన ఘనుడుగా పేరొందారు. రాష్ట్ర పాలనలో ఆయనను అందరూ తృతీయ శక్తిగా గుర్తించారు. ఇంతటి బంధం కూడా క్రమ శిక్షణ ఉల్లంఘనతో ఒక్కసారిగా బెడిసికొట్టింది. ప్యారీ మోహన మహాపాత్రో కన్ను మూసేంత వరకు పార్టీ శిబిరం వైపు కన్నెత్తి చూడలేని దయనీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
బీజేడీ చరిత్రలో అర్ధరాత్రి కుట్ర..
మూడో విడత 2009 నుంచి 2014 సంవత్సర కాలంలో బీజేడీ పాలన వ్యవధిలో ప్యారీ మోహన మహాపాత్రోపై వేటు పడింది. అంత వరకు పార్టీ ఆవిర్భావం నుంచి అపర చాణుక్యునిగా ఆయన వెలుగొందారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా గద్దెని ఎక్కే యోచనతో ప్యారీ మోహన మహాపాత్రో పన్నిన కుట్ర బహిర్గతమైంది. నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. తక్షణమే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన అనుచరుల్ని కూడా తొలగించారు. ప్రఫుల్ల చంద్ర ఘొడై, ప్రఫుల్ల సామల్, ప్రతాప్ చంద్ర జెనా, పుష్పేంద్ర సింగ్‌దేవ్, అతున్ సవ్యసాచి నాయక్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. ఈ విచారకర సంఘటన 2012 లో జరిగింది. ఈ వ్యూహం బీజేడీ చరిత్రలో అర్ధరాత్రి కుట్రగా మిగిలిపోయింది.
ప్రస్తుత పరిస్థితి అదే
పార్టీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపట్ల బిజూ జనతా దళ్ అధ్యక్షునిగా నవీన్ పట్నాయక్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ పాలనకు కళంకం తెచ్చిన ఆరోపణ కింద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దామోదర్ రౌత్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే దామోదర్ రౌత్ నోటి దురుసుతనమే ఈ చర్యకు కారణం. లోగడ 2 సార్లు దామోదర్ రౌత్ పార్టీ క్రమ శిక్షణ వేటుకు గురయ్యారు. కొనసాగుతున్న 2014–19 విడత పాలనలో శ్రీ జగన్నాథుని నవ కళేబర మహోత్సవం, చిట్‌ఫండ్ మోసాల ఆరోపణలను పురస్కరించుకుని తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో అరుణ్ సాహు, సంజయ్ కుమార్ దాస్ వర్మను నవీన్ పట్నాయక్ తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment