అక్షర తూణీరం
క్యాంప్ కట్టడం ఓ బ్రహ్మవిద్య అని కొందరు, కాదు క్షుద్ర విద్య అని మరికొందరు అంటుం టారు. తన అనుకున్నవాళ్లందర్నీ ఒకచోట మళ్లే యడాన్ని క్యాంప్ రాజకీయం అంటారు. రేపు చేతులెత్తాల్సిన వాళ్లందర్నీ ఒకే తాటిమీద, ఒకే గూట్లో ఉంచడం. వాళ్లని రాచమర్యాదలతో ఆ పది రోజులూ సేవించుకోవడం చిన్న సంగతి కాదు. నరాలు తెగిపోతాయ్. ఎందుకంటే వాళ్లకి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవ్. సర్వభో గాలు ఉంటాయ్. ఈ క్యాంప్‌లు గడచిన నలభై ఏళ్లలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడంతో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈ క్యాంప్‌కి చాలామంది ఐచ్ఛికంగా వస్తే, కొద్దిమంది బలవం తంగా తీసుకు రాబడతారు. బడా ఎన్నికల నించి పంచాయతీ స్థాయి దాకా ఈ రాజకీయం నడు స్తోంది.
అప్పట్లో మావూరి మున్సబు గారి మామిడితోట క్యాంప్‌లు పెట్టడా నికి చాలా ప్రసిద్ధికెక్కింది. తాటాకు పందిళ్లు, మడత మంచాలు, పేకాట లకి విశాలమైన గడ్డి పరుపులు ఏర్పా టుగా ఉండేవి. వంటలకి, వార్పులకి అనువైన గాడి పొయ్యిలు, కోరినపు డల్లా ఒళ్లుపట్టి, టెన్షన్ దింపేసే పని వాళ్లు, చేగోడీల నించి చేపల పులుసు దాకా వండి వడ్డించగల వంటవాళ్లు క్యాంప్‌ని సుభిక్షం, సుసంపన్నం చేస్తుండేవారు.
ఈ సంప్రదాయం మన దేశంలో అన్ని దిక్కులా ఉంది. 30 ఏళ్ల క్రితం తమిళనాట ఓ క్యాంప్‌లో విధివశాత్తు ఉండాల్సి వచ్చింది. మద్రా సులో మెరీనా బీచ్‌కి దగ్గర్లో పది పన్నెండు అంత స్థుల హోటల్‌ని ఉన్నట్టుండి క్యాంప్‌గా మార్చే శారు. నేనందులో నెలవారీ కస్టమర్‌ని. మిగతా గదులన్నీ తమిళ పంచెలతో, బంగారు చెయిన్లతో నిండిపోయాయి. హోటల్ వారు తమ కిచెన్‌ని క్యాంపుకి అంకితం చేశారు. నన్ను మాత్రం క్యాంపులో కోరినవన్నీ ఉచితంగా తినెయ్యమ న్నారు. ఫ్రీగా తాగేయచ్చన్నారు. నిజంగా ఆ తిండి ఓ గొప్ప అనుభవం.
ఆంధ్రలో కూడా క్యాంప్‌లు నడపగల సమ ర్థులున్నారు. వారాల తరబడి కప్పలు చెదర కుండా, పిట్టలెగరకుండా కాపాడుకురావడం చిన్న విషయం కాదు. సమాచార వ్యవస్థని పూర్తిగా కట్టిపెట్టాలి. అన్నిరకాల ఆటలతో వాళ్లని ఉల్లాస మరియు వినోద పరచాలి. అవసరమైతే మన వాళ్లని ఆటలో కూచోపెట్టి, అవతలివాళ్లకి కుప్పలు తెప్పలుగా సొమ్ములొచ్చేలా చూడాలి. నిత్యావస రాలైన మందు, మందులు అందిస్తూ ఉపద్రవం రాకుండా చూసుకోవాలి. అవసరమైతే రెండు డైలీ పేపర్లలో నాలుగు పేజీలు జాగ్రత్తగా కల్తీచేసి క్యాంప్ సభ్యులకు హాయిని కలిగించాలి.
ఇలా చేస్తేనే ఓసారి రసాభాస అయింది. ఓ సాయంకాల వేళ సిల్కు లాల్చీ ఫెళ ఫెళల్లోంచి నిజం డైలీ పేజీ జారి పడింది. దాంట్లో పెద్దక్షరాల్లో సమాచారం వేరేగా ఉంది. ‘‘ఇంకే వుంది... క్యాంపు మునిగింది’’ అనుకుంటున్నారు కదూ?
రెండు మూడు బృహత్ క్యాంపులు నిర్వ హించినాయన చెప్పినప్పుడు నేనూ అలాగే అను కున్నా. ‘‘ఏవుందండీ... జరిగిన చిన్న పొరబా టుకి వంద కోట్లు పెనాల్టీ పడిందండీ. దాదాపు యాభైమంది మోసం చేశారంటూ ఎదురు తిరి గారు. తలొక రెండూ వడ్డించి సరిచేశాం. ఇవన్నీ తప్పదండీ చివరాఖరికి అంతరాత్మ ప్రబోధం అంటారండీ’’ అంటూ ఆర్గనైజర్ నిట్టూర్చాడు!
శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు
Comments
Please login to add a commentAdd a comment