ఎన్నాళ్లీ కష్టాలు
- బాలారిష్టాలు దాటని కృష్ణా యూనివర్సిటీ
- సొంత భవనాలు లేవు
- ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత
- హాస్టళ్లు, ల్యాబ్ సౌకర్యాలు నిల్
- రేపు ద్వితీయ స్నాతకోత్సవం
మచిలీపట్నం : ఉన్నత ఆశయంతో ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా కృష్ణా యూనివర్సిటీ మాత్రం బాలారిష్టాలను దాటడం లేదు. భూమి కేటాయించినా, నిధులు మంజూరు చేసినా పాలకుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కలగానే మిగిలింది. యూనివర్సిటీ పరిధిలో జిల్లాలోని 143 కళాశాలలు ఉన్నాయి. నూజివీడులో పీజీ సెంటర్ ఉంది. యూనివర్సిటీని ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 42 మంది ప్రొఫెసర్లకు గానూ కేవలం 21 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. 50 మంది సిబ్బందికి గానూ ఇద్దరే పర్మినెంటు ఉద్యోగులు ఉన్నారు. మరో 15 మంది అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్నారు.
స్థలం, నిధులు కేటాయించినా...
జిల్లాకో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో 2008, ఏప్రిల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం యూని వర్సిటీని పట్టించుకునే వారే కరువయ్యారు. వర్సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు బందరు మండలం రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరు మండలంలో 44 ఎకరాలు, ప్రస్తుతం యూనివర్శిటీ నడుస్తున్న ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలో 24 ఎకరాలను కేటాయించారు.
భవనాల నిర్మాణానికి రూ.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ విభాగం నిపుణులు భవనాల నిర్మాణానికి నమూనాలు తయారు చేశారు. అయినప్పటికీ భవన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కావటం లేదు. ఏడాది క్రితం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యూనివర్శిటీ పాలకులు అనంతరం ఆ విషయాన్ని మరిచిపోయారు. అయితే గత ఐదేళ్లుగా యూనివర్శిటీ భవనాల నిర్మాణంపై ఎవరూ దృష్టిసారించటం లేదు. యూనివర్శిటీకి భవనాల నిర్మాణానికి బిల్డింగ్ అడ్వయిజరీ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించినా ఫలితం లేకపోయింది.
హాస్టల్ భవనాలు, ల్యాబ్‌లు లేవు
యూనివర్శిటీ అభివృద్ధి చెందాలంటే హాస్టల్ భవనాలు ఉండాలి. విద్యార్థినులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ కోసం మూడు వేర్వేరు హాస్టల్స్ ఉండాలి. ఆరేళ్లు గడుస్తున్నా హాస్టల్ భవనాల నిర్మాణం ఊసే లేదు. ఆంధ్ర జాతీయ కళాశాల భవనంలోని 20 గదుల్లో, నిర్మలా కాన్వెంట్ సమీపంలోని ఓ భవనంలో యూనివర్శిటీని నడుపుతున్నారు. తరగతి గదులనే ల్యాబ్‌లుగా మార్చారు. ఆర్గానిక్ కెమెస్ట్రీ విభాగంలో ప్రస్తుతం 60మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్, ఫిజికల్ కెమీస్ట్రీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం నాలుగు ప్రత్యేక ల్యాబ్‌లు ఉండాలి.
ఉన్న ఒకే ల్యాబ్‌ను ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు ఉపయోగిస్తున్నారు. బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఎం.ఫార్మసీ విభాగాలకు తరగతి గదులు లేవు. వారికి ల్యాబ్‌లనే తరగతి గదులుగా ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఎం.ఫిల్, పీహెచ్‌డీలో అభ్యర్థులను చేర్చుకున్నారు. వీరికి ప్రత్యేక వసతి గృహం, ల్యాబ్‌లు అవసరం. స్కాలర్స్‌కు యూనివర్శిటీలో పాఠ్యాంశాలు బోధించే అవకాశం కల్పించి వారికి నెలకు కొంత మొత్తాన్ని అందజేయాల్సి ఉంది.
ఈ ప్రక్రియ యూనివర్శిటీలో అమలుకావటం లేదు. పరీక్షల విభాగానికి ప్రత్యేక గది కేటాయించాల్సి ఉండగా, తరగతి గదినే ఇందుకు ఉపయోగిస్తున్నారు. పరీక్షల విభాగంలో రెగ్యులర్ ప్రొఫెసర్లకు బదులు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న ప్రొఫెసర్లే విధులు నిర్వర్తిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ప్రొఫెసర్లు క్లాసులు చెప్పిన అనంతరం కూర్చునేందుకు ఒక టేబుల్, కుర్చీ కూడా ఇవ్వకపోవటం ఇక్కడ దుస్థితికి నిదర్శనం. హాస్టల్ భవనాలు, లేబొరేటరీలు సక్రమంగా లేకపోవటంతో ఈ యూనివర్శిటీలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
భవనాల నిర్మాణం ప్రశ్నార్థకమే..
యూనివర్శిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రుద్రవరం గ్రామంలో 102 ఎకరాలను కేటాయించింది. ఇక్కడే రూ. 70 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తామని ఈ నెల 21వ తేదీన యూనివర్శిటీ వీసీ వున్నం వెంకయ్య వెల్లడించారు. వర్షాకాలం కావటంతో ఇక్కడ భవనాలు నిర్మించేందుకు అవకాశం లేదు. ఈ 102 ఎకరాల్లో మూడువేల మీటర్ల మేర ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది మట్టి రోడ్లను నిర్మించారు. యూనివర్శిటీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఈ భూమి అభివృద్ధి కోసం ఖర్చు చేయకపోవటం గమనార్హం. ఈ భూమి లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షాకాలంలో నీరు నిలబడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భవనాల నిర్మాణం ఎలా చేపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
గవర్నర్ దృష్టి సారిస్తే మేలు
కృష్ణా వర్సిటీ మొదటి స్నాతకోత్సవం 2012, డిసెబర్ 9వ తేదీన నిర్వహించారు. రెండో స్నాతకోత్సవాన్ని ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా యూనవర్శిటీకి ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ అటు యూనివర్శిటీ ప్రతినిధులు, పాలకులు ఈ యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు ఏ మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ద్వితీయ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ కులపతి హోదాలో హాజరువుతున్న గవర్నర్ నరసింహన్ అన్ని అంశాలపై దృష్టిసారించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. గవర్నర్ దృష్టిసారించి యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.