మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు దక్కింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నుంచి గురువారం ఉత్తర్వులు అందాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2008లో మచిలీపట్నం కేంద్రంగా ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీలు ఉన్నాయి. కృష్ణా తప్ప మిగతావన్నీ 12–బీ గుర్తింపు సొంతం చేసుకున్నాయి. ఇటీవల వరకు అద్దె భవనాల్లోనే (ఆంధ్ర జాతీయ కళాశాలలో) కొనసాగడం, వర్సిటీ అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 12–బీ గుర్తింపు దక్కలేదు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పెత్తందారులు చేసిన రాజకీయ క్రీడతో వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో 12–బీ సాధనకు ఇదే సరైన సమయమని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కె.బి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రామిరెడ్డి తమ బృదానికి దిశానిర్దేశం చేశారు. దీంతో 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు సొంతమైంది. ఇకపై వర్సిటీ కార్యకలాపాలకు 80 శాతం నిధులు యూజీసీ నుంచి మంజూరవుతాయి.
ఉన్నత విద్యకు ఊపిరి
► 2008–09లో అద్దె భవనాల్లో ప్రారంభమైన యూనివర్సిటీ ప్రస్తుతం రుద్రవరం వద్ద 102 ఎకరాల సువిశాల ప్రదేశంలో సొంతభవనాల్లో నడుస్తోంది.
► వర్సిటీకి అనుబంధంగా యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు కలిపి164 కాలేజీల్లో ఏటా సుమారు 53 వేల మంది చదువుతున్నారు.
► వర్సిటీ క్యాంపస్‌లో ఆర్ట్స్‌అండ్ సైన్సు కోర్సులతో పాటు, ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ కోర్సులను సైతం అందిస్తున్నారు. 2011–12 విద్యా సంవత్సరం నుంచి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ అందుబాటులో ఉండగా, ఇటీవలనే వంద మంది విద్యార్థుల సామర్థ్యంతో ఎన్‌సీసీ యూనిట్ ఏర్పాటైంది.
► వర్సిటీలో ఆరు డిపార్టుమెంట్లు, నూజివీడులో మూడు డిపార్టుమెంట్లు పనిచేస్తున్నాయి. పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు నిర్వహిస్తున్నారు.
ప్రయోగాలకు అవకాశం
12–బీ గుర్తింపుతో విద్యార్థులతో పాటు, బోధనా సిబ్బందికీ మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయోగాలు చేయవచ్చు. ఇందుకయ్యే నిధులను యూజీసీ సమకూరుస్తుంది. ఈ గుర్తింపు సాధన కమిటీలో నేనూ కూడా ఓ సభ్యుడిని అయినందుకు ఆనందంగా ఉంది. కృష్ణా యూనివర్సిటీ ప్రయోగాలకు కేంద్రంగా నిలువనుంది.
– డాక్టర్ డి.రామశేఖర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్
నాక్ గుర్తింపుపై దృష్టి
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే 12–బీ గుర్తింపు సాధ్యమైంది. ఈ గుర్తింపు సాధనలో ఉన్నత విద్యామండలి పెద్దల సహకారంతో ఎంతో ఉంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఎస్‌ఓ 9001–2015 సర్టిఫికెట్ సొంతం చేసుకున్నాం. నా హయాంలో 12–బీ గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నాక్ గుర్తింపుపై దృష్టిపెట్టాం.
– కె.బి.చంద్రÔశేఖర్, వైస్ చాన్స్‌లర్
విద్యార్థుల అభివృద్ధే లక్ష్యం
కృష్ణా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఎక్కువగా పేదవర్గాల విద్యార్థులు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయా లకు అనుగుణంగా విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా అంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. సొంత భవనాల్లో మౌలిక సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. వర్సిటీ మరింత అభివృద్ధికి యూజీసీ 12–బీ గుర్తింపు ఊతమిస్తుంది.
– డాక్టర్ ఎం.రామిరెడ్డి, రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment