కృష్ణ.. కృష్ణా! | Krishna University Professors Did Not Receive Salaries From Past 3 Months | Sakshi

కృష్ణ.. కృష్ణా!

Jun 27 2019 9:53 AM | Updated on Jun 27 2019 10:17 AM

Krishna University Professors Did Not Receive Salaries From Past 3 Months - Sakshi

మచిలీపట్నంలోని ఏజే కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్సిటీ

సాక్షి,మచిలీపట్నం : జిల్లాకు తలమానికంగా నిలవాల్సిన కృష్ణా యూనివర్సిటీ గత పాలకుల నిర్వాకంతో గాడి తప్పింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో కొంతమంది ప్రజా ప్రతినిధులు సాగించిన రాజకీయ క్రీడతో యూనివర్సిటీ బ్రష్టు పట్టిపోయింది. చదువుల వాడగా కీర్తిగాంచిన కృష్ణా జిల్లాలో ఉన్నత విద్యను కూడా చేరువలోకి తీసుకొచ్చేందుకు మచిలీపట్నం కేంద్రంగా దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా యూనివర్సిటీ నెలకొల్పారు. ప్రస్తుతం యూనివర్సిటీలో పాలన గందరగోళ పరిస్థితుల్లోకి జారిపోయింది. 

కృష్ణా యూనివర్సిటీ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాల (ఏజే కాలేజీ) ప్రాంగణంలో 2008 అక్టోబర్‌ 13న యూనివర్సిటీ అకడమిక్, పరిపాలనాపరమైన కార్యకలాపాలను ప్రారంభించింది. దశాబ్ధకాలం ముగిసినప్పటికీ, పాలనా పురోభివృద్ధి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ రాజకీయ వేదికలుగా ఉపయోగించుకున్న క్రమంలో మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ కూడా వారి చర్యలకు బలైపోవాల్సి వచ్చింది.

పాలనా వ్యవహారాలను చక్కదిద్దే వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌ వంటి కీలక పోస్టుల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇంచార్జి హోదాలను కట్టబెట్టడంతో పాలన పూర్తిగా పక్కదారి పట్టింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావటంతో ఇప్పటి వరకు అడ్డగోలు పాలన సాగించిన ఒక్కొక్కరు పలాయనం చిత్తగించే క్రమంలో రాజీనామా బాట పట్టినప్పటికీ, వారి పాలనలో సాగించిన అడ్డగోలు విధానాల వల్ల వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. ఆ ప్రభావం కృష్ణా యూనివర్సిటీపై కూడా పడింది. ప్రస్తుతం వర్సిటీ దిక్కులేనదైంది. 

ప్రొఫెసర్‌లకు అందని వేతనాలు.. 
యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్‌లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. రెగ్యులర్‌ ప్రాతిపదికన పనిచేసే 22 మందికి ఏప్రిల్‌ నెల నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలపై ఆధారపడి, ఇక్కడ పని చేస్తున్న ప్రొఫెసర్‌లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వర్సిటీ పాలనాధికారుల నిర్వాకం వల్ల తమ కుటుంబాలు పస్తులతో ఉండాల్సి వస్తోందని, పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించే సమయంలో ఇటువంటి పరిస్థితులు దాపురించటం మనో వేదనకు గురి చేస్తోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఆవేదన వెలిబుచ్చారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి వీసీగా వ్యవహరించిన వేగేశ్న రామచంద్రరాజు కృష్ణా యూనివర్సిటీకి కూడా ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పదవీ యోగం దక్కించుకున్న ఆయన, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావటంతో రాజీనామా చేశారు. దీంతో కృష్ణా యూనివర్సిటీకి ప్రస్తుతం ఇంచార్జి వీసీ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇంచార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న అధికారి సైతం దీనిపై ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ప్రొఫెసర్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

నూతన భవనాలు వినియోగంలోకి వచ్చేనా.. 
యూనివర్సిటీకి సుమారు రూ.80 కోట్ల వ్యయంతో పట్టణానికి సమీపంలోని రుద్రవరంలో శాశ్వత భవనాలను నిర్మించారు. ఇవి పూర్తి అయినప్పటికీ, వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మాత్రం వర్సిటీ అధికారులు దృష్టి సారించటం లేదు. నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.10 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో, ఆ భవనాలను వర్సిటి అధికారులకు అప్పగించనట్లుగా తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటే, ఎన్నికల గిమ్మిక్కుల్లో భాగంగా ఫిబ్రవరి 7న మచిలీపట్నం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సిటీ భవనాలను ప్రారంభించేయటం గమనార్హం.

102 ఎకరాల విస్తీర్ణం వర్సిటీ కోసమని కేటాయించగా, ఇందులో నిర్మాణాలు మాత్రం సరైన రీతిలో చేపట్టకపోవటంతో వర్సిటీ కార్యకలాపాలకు సవ్యంగా ఉపయోగపడతాయా అనే సందేహాలు సైతం ఉన్నాయి. విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ, అపార్ట్‌మెంట్‌ మాదిరే దీనిని నిర్మించారని, దీని వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని వర్సిటీ అధికారులు బాహాటంగానే అంటున్నారు.   

1
1/1

రుద్రవరంలో నిర్మించిన నూతన భవనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement