బందరు తీరంలో.. త్వరలో 'లంగరు' | Fast forward port construction works | Sakshi
Sakshi News home page

బందరు తీరంలో.. త్వరలో 'లంగరు'

Published Sun, Jan 7 2024 5:39 AM | Last Updated on Sun, Jan 7 2024 10:49 AM

Fast forward port construction works - Sakshi

కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం శరవేగంగా వాస్తవ రూపంలోకి వస్తోంది.  దక్షిణాసియాకు అత్యంత సమీప ముఖ ద్వారంగా ఉన్న ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు  పెడుతున్నాయి. ప్రారంభించిన ఏడు నెలల్లోనే  కీలకమైన బ్రేక్‌ వాటర్‌ పనులను పూర్తిచేయడం ద్వారా ఈ పోర్టు నిర్మాణంపై తన చిత్తశుద్ధిని  రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోంది. ప్రత్యక్షంగా..  పరోక్షంగా 25,000 మందికి ఉపాధి క ల్పించే  ఈ పోర్టు.. 2025 ఆరంభానికల్లా పూర్తయ్యేలా పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి.     – సాక్షి, అమరావతి 

బందరు పోర్టు తొలిదశ కింద రూ.5,254 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ మే 22, 2023న భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించడంతో పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నార్త్‌బ్రేక్‌ వాటర్‌ నిర్మాణం పూర్తికాగా, సౌత్‌బ్రేక్‌ వాటర్‌ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలాగే, రెండు బెర్తుల నిర్మాణ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.

ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా వేయగా.. వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్‌ బ్లాక్స్, ముడి ఇనుము, కంటైనర్ల ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అంచనా. ఈ పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. 

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. 
ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే.. ఇక్కడ సముద్రంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉండడంతో పాటు తీరప్రాంతం కూడా ఇసుకతో ఉండటంతో భారీ కట్టడాల నిర్మాణానికి అనువుగా ఉండదు. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను పటిష్టపరుస్తున్నారు.

2,075 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్‌ వర్టికల్‌ డ్రెయిన్స్‌ (పీవీడీ) విధానంలో భూమిలోంచి నీటిని తోడి ఆ స్థానంలో మట్టిని పంపి భారీ కట్టడాలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా 52 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడిపోయడం ద్వారా భారీ ఓడలు నిలుపుకునే విధంగా సముద్రాన్ని డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఆ్రస్టేలియా నుంచి అత్యాధునిక డ్రెడ్జింగ్‌ మిషన్లను తీసుకొస్తున్నారు. ఏడు నెలల కాలంలోనే 12 శాతం నిర్మాణ పనులను పూర్తిచేయడం ద్వారా ఏపీ మారిటైమ్‌ బోర్డు రికార్డు సృష్టించింది. 

తండ్రి కోరికను నెరవేరుస్తున్న తనయుడు.. 
నిజానికి.. మచిలీపట్నం పోర్టు పునరుద్ధరణ అనేది స్థానిక ప్రజల చిరకాల స్వప్నమంటూ 2004 తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తీసుకెళ్లారు. వారి కోరికను నెరవేర్చే విధంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి 2008, ఏప్రిల్‌ 23న శంకుస్థాపన చేశారు. వైఎస్‌ మరణానంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కెంది. 2014 తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా 2019 ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు కొబ్టరికాయ కొట్టి మమ అనిపించారు.

కానీ, దీనికి భిన్నంగా ప్రసుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం.. సీఎం పదవి చేపట్టిన ఏడాదిలోపే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలపమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు. రూ.5,254 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా జగన్‌ సర్కారు నిధులను కూడా సమకూర్చింది.

ఆ తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌తో 2023, ఫిబ్రవరి 26న ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా 2023, ఫిబ్రవరి 28న వచ్చాయి. ఇలా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించడమే కాక ఆ పనులు వేగంగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

పోర్టు ఎప్పుడెప్పుడు ఎలా..? 
1590 నుంచి ఎగుమతి దిగుమతులతో మచిలీపట్నం పోర్టు కళకళ.. 
♦ 1970 నుంచి నిలిచిపోయిన పోర్టు కార్యకలాపాలు 
 బందరు వాసుల చిరకాల వాంఛను తీరుస్తూ దివంగత సీఎం వైఎస్‌ 2008 ఏప్రిల్‌లో శంకుస్థాపన 
 ఆయన మరణానంతరం అటకెక్కిన పోర్టు పనులు 
 ఎన్నికలకు నెలన్నర ముందు ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో చంద్రబాబు మరోసారి శంకుస్థాపన 
 దీనికి భిన్నంగా ఇప్పుడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన సీఎం జగన్‌ 
రూ.11,464 కోట్ల వ్యయంతో 116 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో పోర్టు నిర్మాణం ప్రారంభం 
తొలిదశలో రూ.5,254 కోట్ల పెట్టుబడితో పోర్టు పనులకు గత మే 22న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌ 
♦ 2,075 ఎకరాల్లో నాలుగు బెర్తులతో 35 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
 పోర్టును జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ మేర నాలుగులైన్ల రహదారి నిర్మాణం 
అలాగే.. ఏడు కి.మీ రైల్వేలైన్‌ కూడా నిర్మాణం 
♦ ఈ పోర్టుతో రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణకు ప్రయోజనం 
♦ దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి 

ప్రాజెక్టు పూర్తి వ్యయం - 11,464 కోట్లు 
తొలిదశ పోర్టు సామర్థ్యం - 35 ఎంఎంటీపీఏ 
పూర్తిస్థాయి సామర్థ్యం - 116 ఎంఎంటీపీఏ 
బెర్తులు - 2,075ఎకరాల్లో నాలుగు బెర్తులతో నిర్మాణం 
కార్యకలాపాలు ప్రారంభం 2025ప్రారంభం నాటికి 

భారీ ఓడలు నిలిచేలా నిర్మాణం.. 
మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. భారీ ఓడలు నిలిచే విధంగా రాష్ట్రంలోని నాలుగు ఓడ రేవులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఓడరేవుల సగటు లోతు 7–8 మీటర్లు ఉండగా, ఇప్పుడు నిర్మిస్తున్న ఈ పోర్టుల్లో 16–18 మీటర్ల లోతు ఉండేలా నిర్మిస్తున్నాం. దీంతో భారీ ఓడలు రావడమే కాకుండా సరుకు రవాణా కూడా పెరుగుతుంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారం మొత్తం ఇప్పుడు మచిలీపటా్ననికే వస్తుంది.     – రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ,  ఏపీ మారిటైమ్‌ బోర్డు 

2025 నాటికి రెడీ..
అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవడంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడు నెలల్లోనే 12 శాతం పనులు పూర్తిచేశాం. 6.5 కి.మీ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, నాలుగు బిల్డింగ్‌లు, జాతీయ రహదారి 216కు అనుసంధానం చేస్తూ 6.5 కి,మీ రోడ్డు అనుసంధానం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు బెర్తులకు సంబంధించి ఈ పైల్స్‌ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 ప్రారంభం నాటికి ఈ పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నాం.     – ఎం. దయాసాగర్, ఎండీ, మచిలీపట్నం    పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 

సంతోషంగాఉంది..
బందరు ప్రాంత అభివృద్ధి ఈ పోర్టు నిర్మాణంతో సాకారం కానుంది. పోర్టు నిర్మాణానికి నాకున్న భూమిని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. భావితరాల మేలు కోసం మాజీమంత్రి పేర్ని నాని చేసిన కృషి ఫలించింది.  – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, పోతేపల్లి, బందరు మండలం 

గర్వంగా ఉంది..
సొంత ఊరు అభివృద్ధికి కీలకమైన బందరు పోర్టు నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగాను, గర్వంగాను ఉంది. నేను ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడిని. కానీ, ఈ పోర్టు నిర్మాణంలో నా వంతు కృషిచేయాలన్న తలంపుతో మచిలీపట్నంకు బదిలీ చేయించుకున్నా. బందరు పోర్టును జాతీయ రహదారికి అనుసంధానించే పనిలో పాలుపంచుకుంటున్నా. త్వరలో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. – బి.నాగసూర్య చంద్ర, అసిస్టెంట్‌ మేనేజర్, రైట్స్‌ సంస్థ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement