ఫైన్ ఐడియా!
• 6 నెలల కాలంలో 3 వేల కట్టడాలు
• అక్రమ నిర్మాణాలపై 10 శాతం జరిమానా
• రూ.10 కోట్లు ఆదాయం లక్ష్యం
• రంగంలోకి టౌన్‌ప్లానింగ్ అధికారులు
• బెంబేలెత్తుతున్న గృహ యజమానులు
విజయవాడ సెంట్రల్ : నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. గత ఆరు నెలల కాలంలో దాదాపు మూడు వేల భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు అంచనా. వాటిలో అక్రమ నిర్మాణాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్ అనధికారిక కట్టడాలపై జరిమానా అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. మార్కెట్ విలువలో పది శాతం మేర అక్రమ కట్టడాల యజమానుల నుంచి వసూలు చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనకు కమిషనర్ జి.వీరపాండియన్ సై అన్నారు. ఈ మేరకు వారం క్రితమే టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు గత వారం రోజుల వ్యవధిలో రూ.70 లక్షల మేరకు జరిమానాలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఈ విధంగా రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిసింది. వన్‌టౌన్, భవానీపురం, గవర్నర్‌పేట, పటమట, సింగ్‌నగర్, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే జల్లెడపట్టి మరీ అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు.
లబోదిబోమంటున్న గృహ యజమానులు
ఆన్‌లైన్ పుణ్యమా అని గత ఆరు నెలల కాలంలో నగరంలో పెద్ద సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. భవనం స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు అక్రమ వసూళ్లు కూడా సాగాయి. తిలాపాపం తలాపిడికెడు చందంగా ఇందులో బ్రోకర్ల నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారుల వరకు మామూళ్లు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు కార్పొరేటర్లు అక్రమ కట్టడాల్లో హవా సాగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు, మూడో అంతస్తులకు సంబంధించి లక్షల రూపాయలు మామూళ్ల రూపంలో గృహ యజమానులు సమర్పించుకున్నారు. ఇప్పుడు జరిమానా రూపంలో మరోమారు టౌన్‌ప్లానింగ్‌కు చలానా కట్టాల్సి రావడంతో గృహ యజమానులు లబోదిబో మంటున్నారు. బిల్డింగ్ మార్కెట్ విలువ రూ.20 లక్షలు ఉంటే అందులో పది శాతం అంటే.. రూ.2 లక్షలు చెల్లించాల్సి రావడంతో బాప్‌రే అంటున్నారు. గతంలో మామూళ్లు ఇచ్చుకున్నాం కాబట్టి కాస్తంత డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా అధికారులతో బేరమాడుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ఒత్తిళ్ల వల్లే...
రెండు నెలల క్రితం టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన మేయర్ అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని, తీరు మార్చుకోకుంటే ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయినా ఫలితం లేకపోవటంతో కొద్దిరోజుల క్రితం మరోమారు సమావేశం నిర్వహించి నిలదీయగా, అధికారులు స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే అక్రమ కట్టడాలను తాము చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోందని కుండబద్దలు కొట్టారు.
కొందరు మీ పార్టీ కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఓ రేంజ్‌లో అక్రమ కట్టడాలను వ్యాపారంగా చేస్తున్నారంటూ స్పష్టం చేశారు. అనూహ్య పరిణామంతో అవాక్కైన మేయర్.. ఇప్పటివరకు సాగిన అక్రమ కట్టడాల నుంచి పది శాతం చొప్పున జరిమానాలు వసూలు చేయాల్సిందిగా ప్రతిపాదన పెట్టారు. ఇందుకు కమిషనర్ అంగీకరించడంతో జరిమానాలు మొదలయ్యాయి. ఒక్కో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌కి తమ పరిధిలో కనీసం రూ.50 లక్షలకు తగ్గకుండా జరిమానాలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది.