ఫామ్‌హౌస్‌ల కోసమే మూసీ ముసుగు! | CM Revanth Reddy fires on BRS leaders | Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌస్‌ల కోసమే మూసీ ముసుగు!

Published Fri, Oct 4 2024 5:48 AM | Last Updated on Fri, Oct 4 2024 8:03 AM

CM Revanth Reddy fires on BRS leaders

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు పైలట్‌ ప్రాజెక్టు ప్రారంబోత్సవంలో బీఆర్‌ఎస్‌ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫైర్‌ 

అక్రమ నిర్మాణాలపై వేటు పడకుండా మూసీ నిర్వాసితులను కవచంగా వాడుకుంటున్నారని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: చెరువుల్లో అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌లపై వేటుపడకుండా ఉండేందుకే బీఆర్‌ఎస్‌ నేతలు ముసుగు తొడుక్కొని మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బురదలో కూరుకుపోతున్న నగరాన్ని కాపాడేందుకు తాము మూసీపై ముందుకెళ్తుంటే దానిపైనా బురదజల్లుతున్నారని పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

పేదలకు అన్యాయం జరుగుతోందని డ్రామాలాడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు చేతనైతే ఆ పార్టీ ఖాతాలోని రూ. 1,500 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ములో రూ. 500 కోట్లను మూసీ బాధితులకు పంచాలని సూచించారు. మురికి మూసీలో జీవచ్ఛవా­ల్లా ఉన్న పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి ఇళ్లు ఇస్తుంటే రెచ్చగొట్టడం తగదన్నారు. గురువారం సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజ్‌లో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు పైలట్‌ ప్రాజెక్టు కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావులతోపాటు సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారులకు చెందిన ఫాంహౌస్‌ల అక్రమ నిర్మాణాలను కూల్చాలో వద్దో చెప్పాలని వారినే ప్రశ్నించారు. కేవీపీ రామచంద్రరావు ఫాంహౌస్‌లను కూలగొట్టాలో వద్దో కూడా సలహా ఇవ్వాలన్నారు. నాలాలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో అక్రమాలు చేసిందేవరో తేల్చుకుందాం రావాలని సవాల్‌ విసిరారు. నల్లచెరువు, సున్నం చెరువు, మూసీ ఒడ్డున అక్రమంగా ప్లాట్లు వేసి అమ్మింది బీఆర్‌ఎస్‌ వారు కాదా? అని సీఎం ప్రశ్నించారు. 

బలిసినోళ్లు వదిలిన నీళ్లు పేదలు తాగాలా? 
‘హైదరాబాద్‌కు తాగునీరు అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో బలిసినోళ్లు ఫాంహౌస్‌లు కట్టుకొని వారి డ్రైనేజీ తీసుకొచ్చి వాటిల్లో కలిపితే ఆ నీళ్లు నగర ప్రజలు తాగాల్నా?’అని సీఎం రేవంత్‌ నిలదీశారు. అక్రమాలకు పాల్పడ్డ వారిని వదలబోమని, ఒక్కొక్కడినీ చింతపండు చేస్తానని హెచ్చరించారు. 

అఖిలపక్షంలో మంచి సూచనలివ్వండి.. 
నిర్వాసితులు ఇళ్లు పోయిన దుఃఖంలో ఆవేశంగా ఉంటారని.. 20 ఏళ్లపాటు ప్రజాక్షేత్రంలో తిరిగిన తనకు పేదల కష్టాలు, రాజకీయాల లోతు తెలియక కాదని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ రాబోయే తరాల భవిష్యత్‌ దృష్ట్యా ముందుకే వెళ్తానన్నారు. 

హైదరాబాద్‌ నగరాన్ని, రాష్ట్రాన్ని ముంచేస్తున్న మూసీ వరదలకు విపక్షాలు చేతనైతే పరిష్కారం చెప్పాలని సూచించారు. అఖిలపక్ష సమావేశాలు పెడతానని, మంచి సూచనలివ్వాలని కేటీఆర్, హరీశ్‌లను కోరారు. మూసీలో నిర్వాసితులయ్యే వారికి 15 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపుతోపాటు రూ. 25 వేల చొప్పున నగదు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. 

ఈటలకు ఇంకా ఆ వాసనలు పోలేదు.. 
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పైనా సీఎం రేవంత్‌ విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీ మారినా పదేళ్లు బీఆర్‌ఎస్‌లో ఉన్నందున ఇంకా ఆ గర్దు (కంపు) పోలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్‌ ఏం మాట్లాడితే తెల్లారే ఆ జిరాక్స్‌ కాపీలతో ఈటల మాట్లాడతారని ఆరోపించారు. ఆయన కూడా బతకడానికి హైదరాబాద్‌ వచ్చి ఎంపీ అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని.. గౌరవం నిలబెట్టుకోవాలని ఈటలకు సూచించారు. 

మూసీ ప్రక్షాళనకు చేతనైతే ప్రధానిని రూ. 25 వేల కోట్టు ఇవ్వాల్సిందిగా కోరదామని.. ప్రధానిని కలవడానికి తనకు భేషజాల్లేవని చెప్పారు. జవహర్‌నగర్‌లో వెయ్యి ఎకరాల భూములున్నాయని.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తే మూసీ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లతో కాలనీలే కడతామన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసిన మోదీని అనుసరించే బీజేపీ నేతలు.. మూసీ అభివృద్ధిని వద్దనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. 
 


ఇంకుడుగుంతల్లేని ఇళ్లకు పంపే ట్యాంకర్లకు రెండింతల చార్జీ.. 
‘కొందరు దురాశపరుల వల్ల చెరువుల్లోని నీళ్లు రోడ్లపైకి.. అక్కడి నుంచి ఇళ్లలోకి వస్తున్నాయి. కొందరి స్వార్థంతో లక్షల కుటుంబాలు నీట మునుగుతున్నాయి. దీనికో పరిష్కారం చూపించాలి. అందరూ నాకెందుకులే అనుకుంటే నగరం మునుగుతుంది. 

చూస్తుండగానే చెరువులు, నాలాలు మూసుకుపోయాయి. ఇలాగే చూస్తూపోతే మూసీ కూడా మూసుకుపోతుంది’అని రేవంత్‌ అన్నారు. అందుకే ఇకపై ఇంకుడు గుంతల్లేకుంటే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వబోమని.. ఇంకుడుగుంతల్లేని ఇళ్లకు పంపే ట్యాంకర్లకు రెండింతల చార్జీలు వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

నల్లగొండను చంపేద్దామా? 
‘నల్లగొండ జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్‌తో, మరోవైపు మూసీ కాలుష్యంతో బతకలేని పరిస్థితిలో ఉంటే ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు ఏం ముఖం పెట్టుకొని నల్లగొండలో తిరుగుతారన్నారు. ఆ జిల్లాలో మీకు ఓట్లేయకుంటే ప్రజలను చంపేస్తారా అని బావబావమరుదులను అడుగుతున్నా’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. 

పేదలకు మెరుగైన సేవల కోసమే డిజిటల్‌ కార్డు 
కంటోన్మెంట్‌: పేదలకు మెరుగైన సేవలు అందించడానికే డిజిటల్‌ ఫ్యామిలీ హెల్త్‌ కార్డు ప్రాజెక్టు చేపట్టామని సీఎం రేవంత్‌ చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు లేదా వార్డుల్లో పైలట్‌ ప్రాజెక్టుగా సర్వే మొదలుపెట్టామన్నారు. కుటుంబ సమగ్ర సమాచారాన్ని.. సంక్షేమ పథకాల అమల్లో 30 శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరిచి ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు. 

వన్‌న్‌స్టేట్‌ వన్‌న్‌కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ కూడా పొందుపరుస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలిపేలా కేంద్రాన్ని ఒప్పించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు. కాగా, దసరాలోపే నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పేరిట లబి్ధదారులకు అందిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement