అక్రమంగా సెల్లార్ కట్టు...
* నేలమాళిగలో యథేచ్ఛగా అక్రమాలు
* ఖాళీ స్థలాలలో సాగుతున్న వ్యాపారాలు
* భవనాల నిర్మాణంలో షరతుల ఉల్లంఘన
* పట్టించుకోని పట్టణ ప్రణాళిక అధికారులు
* వాహనాల నిలుపుదలకు అనేక ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘సెల్లార్లు వాహనాలు నిలపటానికి కేటాయించిన నిర్మాణాలు. అక్కడ ఎలాంటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వొద్దు. అలాంటివి ఎక్కడైనా ఉంటే వాటిని గుర్తించి తొల గించండి. వాహనాల నిలుపుదలకు అనువుగా తీర్చిదిద్దండి. అప్పుడే రహదారులపై సమస్యలు తగ్గి రాకపోకలు సులభమవుతాయి’’ పట్టణ ప్రణాళిక విభాగం ఉత్తర్వులు ఇవి. నగరంలో మాత్రం అమలు కావడం లేదు.
సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టటం లేదు. బహుళ, వ్యాపార సముదాయాల యజమానులు అనుమతులను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. సెల్లార్లు, స్టిల్ట్ (భూమిపై ఖాళీ స్థలాలు)ను వ్యాపారులకు అనువుగా మార్చుతున్నారు. దీంతో నగరంలో వాహనాల నిలుపుదల పెద్ద సమస్యగా మారింది. భారీ కట్టడాలను పార్కింగ్ స్థలాలు లేకుండా నిర్మిస్తుండటం తో నగరవాసులకు, పనుల మీద జిల్లా కేంద్రానికి వచ్చేవా రికీ ఇబ్బందులు తప్పటం లేదు.
200 చదరపు మీటర్ల పరిధిలోపు కట్టడమైతే స్టిల్ట్, 750 చదరపు మీటర్ల పరిధి దాటితే నేలమాళిగ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ప్రధానంగా బహళ అంతస్థులు, వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు, ప్రయివేటు విద్యాసంస్థలు, ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. నిర్మాణ సమయంలో వాహనాల నిలుపుదలకు స్థలాన్ని చూపించి, ఆ పై తెలివిగా వ్య వహరిస్తున్నారు. నిర్మాణం పూర్తి కాగానే ఆ ప్రదేశాన్ని వ్యాపార ప్రయోజనాలకు వినియోగిస్తూ ఆర్థికం గా లబ్ధి పొందుతున్నారు.
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే..
* నిజామాబాద్-హైదరాబాద్ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా నిర్మించే బహుళ అంతస్థుల భవనాలు, వాణిజ్య సముదాయాలలో వాస్తవంగా సెల్లార్‌ను వాహనాల పార్కింగ్ కోసం వినియోగించాలి. ఇవి లేని కారణంగా వాహనదారులకు చాలాచోట్ల పెయిడ్ పార్కింగ్‌లు శరణ్యంగా మారుతున్నాయి. లేదంటే దుకాణాల వద్దకు వచ్చే ప్రజలు వాహనాలు రహదారిపై నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురవుతోంది.
* రైల్వేస్టేషన్ నుంచి ఆర్‌టీసీ బస్టాండ్ వరకు తరచూ ట్రాఫి క్ జామ్ అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ రోడ్డుకిరువైపులా ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌ల ఎదుట పలు దందా లు జరుగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* ఆర్‌టీసీ బస్టాండ్ సమీపంలో రమేష్ థియేటర్‌కు ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్‌లో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ కాంప్లెక్స్‌కు పార్కింగ్ స్థలం లేకపోవడం, వాహనాలను బయటే నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
* శ్రీదేవి థియేటర్ ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు సెల్లార్ లేదు. ఏకంగా కొంత డ్రైనేజీ భాగాన్ని ఆక్రమించి నిర్మించిన ఈ భవనానికి కనీసం సెట్‌బ్యాక్ కూడా వదలకుండా నిర్మించడంపై ఆరోపణలు వస్తున్నాయి.
* వినాయకనగర్‌లోని గణపతి బావి ఎదురుగా నిర్మించిన ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోను సెల్లార్‌ను వాణిజ్య సముదాయంగా మార్చారు.
వారికి కాసులు... జనానికి జరిమానాలు
* హైదరాబాద్ నుంచి అనుమతి వచ్చిందా? లేదా ? నిబంధనల ప్రకారం భవనం నిర్మిస్తున్నారా? లేదా? అని చూడాల్సింది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే. కానీ మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారు. భవన యజమానులు వాటిని అద్దెకిస్తూ డబ్బు దండుకుంటున్నారు. * ఈ మొత్తంలో ఇబ్బంది పడుతున్నది మాత్రం జనమే! రద్దీగా ఉండే ప్రాంతాలలో వాహనాన్ని కాసింత రహదారిపై పెడితే ‘జరిమానా’ అంటూ ట్రాఫిక్ పోలీసులు కాచుకు కూర్చుంటున్నారు. సెల్లార్‌లో నిలిపే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని సెల్లార్లకు పురపాలక అధికారులు ఆస్తి పన్ను కూడా దండుకుంటుండడం గమనార్హం. కొన్నిచోట్ల నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి
* 750-1000 చ.మీ. విస్తీర్ణంలో భవనం, సెల్లార్ నిర్మాణానికి హైదరాబాద్‌లోని పట్టణ ప్రణాళిక విభాగం ప్రాంతీయ సంచాలకుడు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
* వెయ్యి చ.మీ. విస్తీర్ణం కంటే అధికంగా ఉంటే భవ నం, సెల్లార్ నిర్మాణానికి హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి అనుమతి పొందాలి.
* ప్రతిపాదిత సెల్లార్ నిర్మించే భవనానికి ఓ వైపు తప్పనిసరిగా 30 అడుగుల రహదారి ఉండాలి
* సెల్లార్‌ను పార్కింగ్ కోసమే వినియోగించాలి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.