వినతులు..కుప్పలు తెప్పలు | heavy response to prajavani program | Sakshi
Sakshi News home page

వినతులు..కుప్పలు తెప్పలు

Published Tue, Jul 22 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

heavy response to prajavani program

 హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్‌సెల్)లో తమ బాధలు చెప్పుకునేందుకు జనం పోటెత్తారు. ఒకవైపు గ్రామస్థాయిలో ‘మన ఊరు-మన ప్రణాళిక’ వంటివి జరుగుతున్నా కలెక్టరేట్‌లో రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ముఖ్యంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, భూసమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత కలెక్టర్ కిషన్ ప్రజావాణిలో పాల్గొన్నారు. ఆయనతోపాటు కొద్దిసేపు జేసీ, డీఆర్వో, డీఆర్‌డీఏ పీడీ ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.

 వెన్నారం చెరువుపై బ్రిడ్జి నిర్మించాలి
  డోర్నకల్‌లోని కన్నెగుండ్ల గ్రామం నుంచి తోడేళ్లగూడెం వెళ్లే దారిలో కన్నెగూడెం పెద్దచెరువు వరద కారణంగా రాాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని,  విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి వెన్నారం చెరువుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ  ఉప సర్పంచ్ వడ్డం వెంకన్న వినతిపత్రం ఇచ్చారు. అంతేకాక అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టాలని కోరారు.

 వంటచేసే అవ కాశం ఇవ్వండి
 కేసముద్రం మండలం మొహమూద్‌పట్నంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు వంటచేసే అవకాశం స్థానికులకే కల్పించాలని కోరుతూ స్థానిక మహిళలు వినతిపత్రం ఇచ్చారు. తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు తాము స్థలం కేటాయించామని అలాంటిది పక్కగ్రామం వారికి వంటచేసే అవకాశం ఇవ్వడంవల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వివరించారు.

 అకారణంగా తొలగించారు
 వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎస్టీ హాస్టల్‌లో అకారణంగా 18మంది విద్యార్థుల పేర్లను వార్డెన్ తొలగించారని, ఈ విషయంలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాని కోరుతూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బిర్రు మహేందర్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. విద్యార్థులను తిరిగి హాస్టల్‌లో చేర్పించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 ‘మీ సేవ’కు అనుమతివ్వరూ..
 వైకల్యంతో నానా కష్టాలు పడుతూనే ఎంఏ, బీఈడీ పూర్తిచేశానని, తనకు మీసేవ, ఏపీఆన్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ భూపాలపల్లికి చెందిని కానుగుల ఐలయ్య కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు.

 మెసెంజర్లను కొనసాగించాలి
 సర్వశిక్షా అభియాన్‌లో  మండలస్థాయిలో పనిచేసిన మెసెంజర్లను కొనసాగించాలని, మెసెంజర్ల వ్యవస్థను రద్దు చేయడం వల్ల వారు ఉపాధి కోల్పోతున్నారంటూ టీఎస్ ఎమ్మార్సీ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.బిక్షపతి కలెక్టర్‌ను కోరారు. వ్యవస్థను రద్దుచేయడంలో మెసెంజర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తక్షణం దీనిపై స్పందించి న్యాయం చేయాలని కోరారు.

 కేయూ రిజిస్ట్రార్, డీవోలపై చర్య  తీసుకోవాలి
 కుమార్‌పల్లిలోని సర్వే నంబర్ 214లోగల తమ పట్టాభూమి విషయంలో వివాదాలు సృష్టించి తమను అనవసరంగా ఇబ్బందులు పెడుతున్న కేయూ రిజిస్ట్రార్, డీవోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎర్రబెల్లి ప్రభాకర్‌రెడ్డి, గట్టురాజు, రామకృష్ణ, నగేష్ తదితరులు వినతిపత్రం అందించారు. ఈ భూమి విషయంలో ఇప్పటికే పలుమార్లు సర్వేలు, విచారణలు చేసినట్లు తెలిపారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదని వివరించారు. దీనికి  స్పందించిన కలెక్టర్, జేసీ సర్వేకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement