జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ఆ పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపింది. 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ నాలుగు జిల్లాలుగా విభజన జరిగిన విషయం విధితమే. అధికార టీఆర్‌ఎస్ మినహా పలు ప్రధాన పార్టీలు జిల్లాల వారీగా కమిటీలు వేసుకున్నాయి. ఇదే సమయంలో ఆయా జిల్లాలకు నూతనంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుల ఎంపిక విషయంపై టీపీసీసీ మొదట్లో హడావుడి చేసింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరికి వారే హైదరాబాద్ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రయత్నాలు, ఊహాగానాలకు తెరవెస్తూ ఆ పార్టీ అధిష్టానం సుమారు ఆరు నెలల కిందట కటకం మృత్యుంజయంకే ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. అయితే.. ఇటీవల పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టిసారించిన టీపీసీసీ జిల్లాల వారీగా కమిటీలు వేయాలన్న ప్రతిపాదన చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గేహ్లాట్ ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 31 జిల్లా కమిటీలతో పాటు నగర/పట్టణ కమిటీలకు కూడా ఆయన ఆమోదం తెలిపారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాల పునర్విభజన తర్వాత చాలా కాలం కమిటీల ఊసెత్తని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే సంస్థాగతంపై దృష్టి సారించింది. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, బలోపేతంపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఆ పార్టీ నాయకత్వం చర్చలు, సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో రెండు నెలల వ్యవధి మూడు పర్యాయాలు భేటీ అయ్యింది. ఇదే సమయంలో పార్టీ అధిష్టానం ఉమ్మడి కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించింది.
జగిత్యాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని నియమించిన అధిష్టానం కోరుట్లకు సంజయ్‌యాదవ్, ధర్మపురికి జయరామరావు, రామగుండంకు లింగం యాదవ్, మంథనికి అబ్దుల్ సుహాని, పెద్దపల్లికి బోనగిరి రవీం దర్, కరీంనగర్‌కు రఘునాథ్‌రెడ్డి, చొప్పదండికి బొమ్మ వెంకటేశ్వర్, వేములవాడకు బండి సు ధాకర్‌యాదవ్‌ను నియమించారు. అదేవిధంగా సిరిసిల్లకు పీసీసీ కార్యదర్శి బాసెట్టి అశోక్, మానకొండూర్‌కు కె.సత్యనారాయణగౌడ్, హు జూరాబాద్‌కు కొత్త ఉప్పలయ్య గౌడ్, హుస్నాబాద్‌కు బలరాం అమ్‌గోత్‌ను నియమించారు. ఇదే సమయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ‘డీసీసీ’ల జోష్.. నాలుగు జిల్లాల నుంచి పోటాపోటీ..
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మళ్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ఆమోదం తెలపడంతో ఆ పార్టీలో మళ్లీ డీసీసీల జోష్ మొదలు కానుంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా ల నుంచి ఆయా జిల్లా కమిటీల అధ్యక్షుల కోసం పలువురు పోటీ పడే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి కటకం మృత్యుంజయం, తు మ్మేటి సమ్మిరెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, ఉప్పు ల అంజనీప్రసాద్, ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, కొమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మాధవి, కర్ర రాజశేఖర్, మేడిపల్లి సత్యంతోపాటు పలు వురు ఆశించనున్నారు. ఎవరికి వారుగా హైదరాబాద్‌లో ప్రయత్నాలు సాగిస్తున్నారన్న ప్రచా రం కూడా మొదలైంది. పెద్దపల్లి జిల్లా నుంచి ఈర్ల కొంరయ్య, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, గీట్ల సబితారెడ్డి, చేతి ధర్మయ్య, బడికెల రాజ లింగం పోటీపడే అవకాశం ఉన్న ట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగిత్యాల జిల్లా నుంచి చాలా మంది రాష్ట్రస్థాయి, సీనియర్‌లే ఉండగా, సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి ప్రతిపాదన మేరకు పార్టీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. కొమిరెడ్డి రామ్‌లు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బండి శంకర్, జేఎన్ వెంకట్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కేకే మహేందర్‌రెడ్డి రాష్ట్రస్థాయి పదవుల్లో ఉండగా, ఆది శ్రీనివాస్, చీటి ఉమేష్‌రావు, ఏనుగు మనోహర్‌రెడ్డితోపాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌యూఐ, ఐఎన్‌టీయూసీ తదితర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలలో చురుకుగా పని చేస్తున్న పలువురి పేర్లు కూడా తెరమీ దకు వచ్చే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment