సాక్షి, ఆదిలాబాద్: ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల మధ్య సమన్వయానికి పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీని నిలువరించాలంటే ముందుగా పార్టీలో ఐక్యత ముఖ్యమని భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ దిశగా ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల తెలంగాణకు ఇన్‌చార్జీలుగా నియమితులైన ముగ్గురిలో ఒకరైన ఏఐసీసీ కార్యదర్శి, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యనిర్వాహకులతో సమావేశం కానున్నారు. దీంతో ఆ పార్టీ వ్యవహారాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఏకతాటిపైకి సాధ్యమేనా..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జిల్లాలో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో పరిణామాలు జిల్లా రాజకీయాల్లోనూ వర్గపోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గాల్లో తన పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన ప్రాబల్యాన్ని చాటేందుకు యత్నాలు చేస్తున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ మూడు ముక్కలైంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి ఒక గ్రూపుగా, టీపీసీసీ కార్యదర్శి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మరో గ్రూపుగా, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్‌దేశ్‌పాండే ఇంకో గ్రూపు కొనసాగిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
బోథ్‌లో సోయం బాపురావు, అనిల్‌జాదవ్‌లు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి నడిచింది లేదు. మరోవైపు ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపురావు వచ్చే ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా.. లేనిపక్షంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నరేష్‌జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఆయన ఎంపీ స్థానానికే పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి వర్గంలో కొనసాగుతున్న ఆయన సీనియర్ నాయకుల అండదండలు ఉంటాయన్న విశ్వాసంతో కదులుతున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ముథోల్ నియోజకవర్గంలో అన్నదమ్ముళ్లు నారాయణరావుపటేల్, రామారావు పటేల్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి.
సీనియర్ నాయకులైన నారాయణరావు పటేల్ మరోసారి ఇక్కడినుంచి బరిలో దిగుతారా, లేనిపక్షంలో మహేశ్వర్‌రెడ్డి వర్గంతో కొనసాగుతున్న రామారావు పటేల్ పైచేయి సాధిస్తారా అనేది రానున్న రోజుల్లో తేటతెల్లం కానుంది. ఖానాపూర్ నియోజకవర్గంలో భరత్ చౌహాన్, హరినాయక్‌ల మధ్య వైరుధ్యం ఉంది. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాగజ్‌నగర్‌లో రావి శ్రీనివాస్, శ్రీనివాస్‌యాదవ్‌లు ఉండగా, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలు పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. చెన్నూర్‌లో బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బెల్లంపల్లిలో చిలుమురి శంకర్, దుర్గాభవానిలు నియోజకవర్గంలో పట్టుకు యత్నాలు చేస్తున్నారు.
పార్టీలో సందడి..
ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధానంగా ఇన్‌చార్జీలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల మనోగతం తెలుసుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు, సెప్టెంబర్‌లోనే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మన్ననల కోసం నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇటీవల టీపీసీసీలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే తీర్మానం కూడా చేసినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ద్వారా కొత్త జిల్లాలకు అధ్యక్షులను గుర్తించే విషయంలోనూ ఇన్‌చార్జీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
బైక్ ర్యాలీ..
ఆదిలాబాద్‌లో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న ఇన్‌చార్జీ శ్రీనివాసన్ కృష్ణన్, సబితా ఇంద్రారెడ్డిలకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ శివారు నుంచి వారిని సాదరంగా ఆహ్వానించి బైక్ ర్యాలీ ద్వారా జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉదయం 10గంటలకు ఆదిలాబాద్‌లోని పంచవటి హోటల్‌లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment