రికార్డు బ్రేక్! | break the record! | Sakshi
Sakshi News home page

రికార్డు బ్రేక్!

Published Sat, Nov 30 2013 12:54 AM | Last Updated on Fri, Jul 27 2018 1:51 PM

break the record!

= కుటుంబాలు 11 లక్షలు
 = తెల్ల కార్డులు 12.34 లక్షలు
 = జిల్లాలో ధనికులు లేనట్టే!
 = విస్మయం కలిగిస్తున్న లెక్కలు
  = ఇంకా వెల్లువలా దరఖాస్తులు
 = బ్లాక్ మార్కెట్‌కు సరకులు
  = రూ.కోట్లలో ప్రజా ధనం వృథా

 
 జిల్లాలో శత శాతం పేద కుటుంబాలే ఉన్నాయా?.. ధనికులు లేరా?.. ప్రతి కుటుంబానికీ తెల్లరేషన్ కార్డు ఉందా?.. కార్డులు లేని వారే లేరా?.. తెల్లరేషన్ కార్డుల సంఖ్యను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్యే ఎక్కువగా ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఆ దిశగా బోగస్ కార్డులపై ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కాని ప్రశ్న.
 
 విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో 2011 సంవత్సరంలోని గణాంకాల ప్రకారం 44 లక్షలకు పైగా జనాభా ఉంది. కుటుంబానికి సగటున నలుగురు చొప్పున లెక్కేసినా జిల్లాలో 11 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అధికారుల లెక్కల ప్రకారం 2009లో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కుటుంబాల సంఖ్య కంటే తెల్లరేషన్‌కార్డుల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. జిల్లాలో గత రెండు దఫాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమాలకు ముందు 9,85,126 తెల్లరేషన్‌కార్డుదారులు ఉన్నారు.

కుటుంబాల సంఖ్య కంటే కార్డుల సంఖ్య అధికంగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితం బోగస్ కార్డులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు చేపట్టిన సర్వేలో కేవలం 50 వేల కార్డులను మాత్రం రద్దు చేశారు. ఇందులో సగానికి పైగా లబ్ధిదారుల కార్డులను రద్దు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో మరోసారి 1,35,978 మందికి అదనంగా రేషన్‌కార్డులు మంజూరు చేశారు. దీంతో కార్డుల సంఖ్య 11,21,104కు చేరింది. మళ్లీ రెండోసారి బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈసారి అర్హులు కాని వారి దగ్గర ఉన్న కార్డులను అప్పగించాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం 22 వేల మంది మాత్రమే కార్డులను వెనక్కి ఇచ్చారు. రచ్చబండ-2లోనే కాకుండా కొద్ది రోజుల క్రితం వరకు 1.5 లక్షల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 1.13 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించి ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ-3లో పంపిణీ చేస్తున్నారు.

దీని ప్రకారం ప్రస్తుతం కార్డు సంఖ్య 12,34,104కు చేరింది. కానీ ఎన్ని విధాలుగా లెక్కలు వేసుకున్నా కుటుంబాల సంఖ్య 11 లక్షలకు మించదు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం జిల్లాలో ఉన్న కుటుంబాల కంటే 1,34,104 కార్డులు అదనంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యమన్న విషయం అధికారులకే తెలియాలి. జిల్లాలో ఇప్పుడు నిర్వహిస్తున్న రచ్చబండ-3లో మరో 60 వేల మంది వరకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికీ వెల్లువలా కార్డుల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి.
 
ధనికులే లేరా? : పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మాత్రమే తెల్లరేషన్‌కార్డులను మంజూరు చేయాలి. కానీ ప్రస్తుతం కార్డుల సంఖ్య చూస్తే కుటుంబాల కంటే అధికంగా ఉంది. దీన్ని బట్టి జిల్లాలో ధనికులే లేనట్టుగా ఉంది. వాస్తవానికి జిల్లాలో 50 శాతానికి పైగా కుటుంబాలకు రేషన్‌కార్డులు లేవు. వీరిలో ధనికులు, తెల్లరేషన్‌కార్డులకు అర్హులు కానీ వారు ఉన్నారు. అలాగే కార్డులకు అర్హులైన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు.

దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఉన్న తెల్లరేషన్‌కార్డులు.. కుటుంబాల సంఖ్య కంటే 60 శాతానికిపైగా అదనంగా ఉన్నట్టు అర్థమవుతోంది. కార్డుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం జిల్లాకు నిత్యావసరాల కేటాయింపులను చేస్తోంది. పేదలకు అందాల్సిన కోట్ల రూపాయల విలువ చేసే నిత్యావసర సరకులు 60 శాతానికి పైగా వృథా అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ బోగస్ కార్డులకు సంబంధించిన సరకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి.

అప్పుడప్పుడూ చేసే తనిఖీల్లోనే అనేక అక్రమాలు బయటపడుతుండడమే ఇందుకు నిదర్శనం. బోగస్ కార్డులపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేగానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొనే అవకాశం లేదు. లక్షల సంఖ్య లో బోగస్ కార్డులు ఉన్నా ప్రభుత్వం ఓట్ల కోసం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కార్డుల సంఖ్య కుటుంబాల సంఖ్యనే కాదు, జనాభా కంటే అధికమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement