public voice
-
ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్: సమస్యలను ఏకరువు పెట్టుకునేందుకు నగరంలోని ప్రజా భవన్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులు బారులు తీరుతున్నారు. శుక్రవారం ప్రజావాణిలో దరఖాస్తులనుసమర్పించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో ప్రజాభవన్ సమీపంలోని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కొందరు క్యూలైన్లోనే అల్పాహారం తీసుకున్నారు. సందట్లో సడేమియా వలే ఇక్కడ దరఖాస్తులను రాసేందుకు కొందరు తెల్ల కాగితాలను సైతం విక్రయించారు. మొత్తానికి శుక్రవారం గ్రీన్‌హిల్స్‌లోని ప్రజాభవన్ వేలాది మంది అర్జీదారులతో కిటకిటలాడుతూ కనిపించింది. -
ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు..
-
ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్‌సిటీ
మేయర్ రవీందర్‌సింగ్ కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలకసంస్థ దేశంలోని 100 స్మార్ట్ నగరాల్లో చోటు దక్కించుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మేయర్ రవీందర్‌సింగ్ అన్నారు. శుక్రవారం వైశ్యభవన్‌లో టైలరింగ్ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్‌సిటీ అవగాహన సదస్సులో మాట్లాడారు. స్మార్ట్ సిటీ హోదా దక్కించుకునేందుకు నగరవాసులు సహకరించాలని కోరారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరముందన్నారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ మాట్లాడుతూ ప్రజలంతా రాజకీయాలకతీతంగా మన నగరాన్ని స్మార్ట్‌గా చూడాలనే ఆకాంక్షతో పూర్తి సహకారం అందించాలన్నారు. అనంతరం మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కమిషనర్ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు పిట్టల శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, జౌళిశాఖ ఏడీ వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ డీఈ శంకర్, ఐసీఆర్ఏ సంస్థ బాధ్యులు శ్వేత, మీన తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్లతో నగరపాలకసంస్థ రిజిష్టర్డ్ కాంట్రాక్టర్లతో కార్పొరేషన్ సమావేశమందిరంలో స్మార్ట్‌సిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలు వివరించారు. కాంట్రాక్టర్ అసోసియేషన్ బాధ్యులు చల్ల హరిశంకర్, కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు యథాతథం !
ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో సగం కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. కలెక్టర్ అధ్యక్షతన జరిగే ప్రజావాణిలో వినతులు అందజేస్తే పరిష్కారం వెంటనే లభిస్తుందని ఆశిస్తున్న ఫిర్యాదుదారులకు నిరాశే మిగులుతోంది. 15 రోజుల్లో పరిష్కారం కావాల్సిన వినతులకు మోక్షం లేకపోవడంతో వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తూ..వినతులు అందజేస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల విభాగానికి స్పందన కరువైందనే విమర్శలు వస్తున్నాయి. వినతి అందజేసిన 15 రోజుల్లో సమస్య పరిష్కారం కావాల్సి ఉన్నా ఆ పరిస్థితి కానరావడం లేదు. జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వందలాది మంది ప్రజలు వారి సమస్యలను కలెక్టర్క మొరపెట్టుకుంటారు. అయితే వీటిలో ఎన్ని పరిష్కారం అవుతున్నాయనే దానిపై సమీక్షలు లేకపోవడంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి. గ్రీవెన్స్‌కి వచ్చిన వినతులను సంబంధిత క్షేత్రస్థాయి అధికారికి పంపిస్తునప్పటికీ అవి అక్కడ బుట్టదాఖలవుతున్నాయి. గతంలో మండలస్థాయిలో ఇచ్చిన వినతులుగానే చూస్తూ ఫిర్యాదులను పక్కనపెడుతున్నారు. దీంతో ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా అన్నిశాఖలు, కార్యాలయాలు కలిపి 191 విభాగాల్లో ప్రజావాణి పనిచేస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు వివిధ శాఖలకు 7,885 ఫిర్యాదు అందాయి. వీటిలో సకాలంలో 4,875 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. మిగిలిన వాటికి అతీగతిలేదు. పైగా పరిష్కారం చేయడానికి ఇష్టం లేని వినతులకు వివిధ అడ్డుంకులు చూపి వాయిదాలు వేయడం కొన్నిశాఖలకు పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ శాఖపై పర్యవేక్షణ లేపోవడం, ఇతర పనుల ఒత్తిడి కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో గడచిన నాలుగు నెలలుగా వచ్చిన ప్రజావాణి వినతులు, వాటి పరిష్కారాలు, పెండింగ్ వివరాలు శాఖల వారీగా చూస్తే... జిల్లా రెవెన్యూ అధికారికి 178 ఫిర్యాదులు రాగా 65 పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 168 కాగా 11, పశుసంవర్ధకశాఖకు 30 రాగా 21, డ్వామాకు 189 రాగా 90, ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు 22 రాగా 21 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారికి 115 ఫిర్యాదులు రాగా 90, ఇరిగేషన్ శాఖకు 40 ఫిర్యాదులు రాగా తొమ్మిది మాత్రమే పరిష్కారమయ్యాయి. పరిశ్రమల శాఖకు 10 ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖకు 14 ఫిర్యాదులుగా 8 పరిష్కారమయ్యాయి. కార్మికశాఖకు 22 రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. వ్యవసాయశాఖకు 116 ఫిర్యాదురాగా 44 మాత్రమే పరిష్కారమైనట్టు రికార్డులు చెబుతున్నాయి. తూనికలు, కొలతల శాఖకు ఒక ఫిర్యాదు రాగా అదీ పరిష్కారానికి నోచుకోలేదు. జిల్లా ప్రభుత్వాస్పత్రికి 31 ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. పోలీసు శాఖకు సంబంధించి 94 ఫిర్యాదు రాగా ఒకటి మాత్రమే పరిష్కారం కాలేదు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి నాలుగు ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కరించలేదు. భూసేకరణ యూనిట్ -1 కు 91 ఫిర్యాదులు రాగా 10 మాత్రమే పరిష్కారమయ్యాయి. మున్సిపల్ కమిషనర్‌కి పది ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. గిరిజన సంక్షేమశాఖ (ఇంజినీరింగ్) 39 ఫిర్యాదులకు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. గిరిజన సంక్షేమశాఖ డీడీకి 139 ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు. నాలుగుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశా హుద్‌హుద్ తుపాను నష్టపరిహారం జాబితాల తయారీలో అవకతవకలు జరిగాయని ప్రజావాణిలో నాలుగుసార్లు (ఫిబ్రవరి-16, ఫిబ్రవరి 23, మే18, మే 25) ఫిర్యాదు చేశాను. తుపాను తాకిడికి వలలు, బోట్లు, తెప్పలకు నష్టం జరిగిందని, అయితే పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదులో విన్నవించాను. కలెక్టర్‌కు, ముఖ్యమంత్రికి కూడా ఫ్యాక్స్ పంపించాను. అయినా ఇంతవరకు స్పందనలేదు. దరఖాస్తు తీసుకుంటున్నారు తప్పితే చర్యలు లేవు.- చింతపల్లి తోటయ్య డి.మత్స్యలే శం, ఎచ్చెర్ల మండలం -
కాగితాలకే జన‘వాణి’
పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి అర్జీలు పట్టించుకోని అధికారులు ఆందోళనలో అర్జీదారులు చిలకలపూడి : ...ఇలా గజ్జలకొండ వెంకట నరసింహారావు, బోలెం శ్రీనివాసరావు మాత్రమే కాదు.. ఎంతోమంది ప్రజల విన్నపాలను అధికారులు ఇలా విని.. అలా వదిలేస్తున్నారు. ప్రజా‘వాణి’ని కాగితాలకే పరిమితం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారుల సమక్షంలో అప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రతి అర్జీని 15రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. సమస్య పరిష్కారం కాని పక్షంలో అర్జీదారులకు తెలియజేయాలి. అధికారులు ఈ విధివిధానాలను పాటించకపోవడంతో అర్జీదారులు తమ సమస్యను పరిష్కరించాలని రెండు, మూడుసార్లు దూరప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి ప్రజావాణికి వచ్చి వినతిపత్రాలు అందజేస్తున్నారు. పరిష్కారం కాని అర్జీలు 1,700 ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అర్జీల్లో 1,700 వరకు పరిష్కారానికి నోచుకోలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని వివిధ శాఖల జిల్లా కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయంలో 83, ఎస్పీ కార్యాలయంలో 329, విజయవాడ నగరపాలక సంస్థలో 73, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో 58, విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 38, మచిలీపట్నం మునిసిపాల్టీలో 37, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్స్ కార్యాలయంలో 20, అటవీశాఖకు సంబంధించి 18 అర్జీలు పరిష్కారం కాలేదు. స్పందించిన అధికారులకు మెమో.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కారమయ్యాయి... ఎన్ని కాలేదు.. ఎందుకు కాలేదు.. అనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలిస్తూనే ఉంటారు. గతంలో ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన అర్జీలను 15 రోజుల్లోగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారికి మెమో కూడా జారీ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కలెక్టర్ ఉంటేనే అధికారుల హాజరు! ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో మొత్తం 56 శాఖల అధికారులు స్వయంగా హాజరుకావాల్సి ఉంది. కలెక్టర్ లేకపోతే జేసీ, ఏజేసీ, డీఆర్వో స్థాయి అధికారులు ప్రజావాణి నిర్వహిస్తే జిల్లా అధికారులు హాజరుకాకుండా కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే పంపి చేతులు దులిపేసుకుంటున్నారు. కలెక్టర్ హాజరైనప్పుడు మాత్రమే ఎక్కువ మంది జిల్లాస్థాయి అధికారులు వస్తున్నారు. ప్రజావాణికి హాజరుకాని వారికి మెమోలు జారీ చేసినా అధికారుల్లో పెద్దగా మార్పు లేదు. మరోవైపు అర్జీదారుల సమస్యలను జిల్లా అధికారులు అవగాహన చేసుకుని వాటిలో ముఖ్యమైన వాటికి ప్రాధాన్యతను ఇచ్చి స్వయంగా సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించినా ఫలితం ఉండటం లేదు. అర్జీదారులు మళ్లీ, మళ్లీ రాకుండా అధికారులు పరిష్కారానికి శ్రద్ధ చూపాలని కోరినా పెడచెవిన పెడుతున్నారు. చినపులిపాక గ్రామంలో నేను సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని అధికారులకు దరఖాస్తు చేసి ఆరు నెలలు పూర్తి కావచ్చింది. ప్రజావాణిలో ఐదుసార్లు అధికారులకు విన్నవించుకున్నా. సమస్య పరిష్కారం కాలేదు. - గజ్జలకొండ వెంకట నరసింహారావు, చినపులిపాక, తోట్లవల్లూరు మండలం నేను పుట్టుకతో వికలాంగుడిని. ఇంటి స్థలం ఇవ్వాలని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని అర్జీ పెట్టుకున్నా. ఎన్నోసార్లు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. - బోలెం శ్రీనివాసరావు, గరికపర్రు -
పరిశీలించండి.. పరిష్కరించండి
అధికారులకు అదనపు జేసీ సూచన మొత్తం 153 అర్జీల స్వీకరణ కలెక్టరేట్ (మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీదారుల సమస్యలను పరిష్కరించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, పశుసంవర్థక శాఖ డీడీ దామోదరనాయుడు, డీసీవో రమేష్‌బాబు, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, ఆర్వీఎం పీవో పుష్పమణి తదితర అధికారులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 153 అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారుల సమస్యలివీ.. ఆశలు అడియాసలు చేశారు... ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వికలాంగుల పింఛను రూ.1500 చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పుడు వైకల్య శాతాన్ని సాకుగా చూపి 40 నుంచి 80 శాతం ఉన్న వారికి వెయ్యి రూపాయలు, 80శాతం పైన ఉన్నవారికి రూ.1500 పించను ఇస్తామని ప్రకటించి వికలాంగుల ఆశలను అడియాసలు చేశారని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేలా వికలాంగులందరికీ రూ.1500 పింఛను అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు అర్జీ అందజేశారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి.. యనమలకుదురు గ్రామపంచాయతీలో డీఎల్పీవో విచారణలో రూ.15 లక్షలు దుర్వినియోగం అయ్యాయని వార్తలు వెలువడ్డాయని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. గైర్హాజరు అధికారులపై చర్యలేవీ? ప్రజావాణి కార్యక్రమానికి గత సోమవారం హాజరుకాని జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కోరారు. గత సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో 56 శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా 12 మంది మాత్రమే హాజరయ్యారని, వారికి మెమోలు జారీ చేయాలని ప్రకటించినా అమలుకాలేదని ఆయన అర్జీలో పేర్కొన్నారు. ఆ పాఠశాలకు అనుమతులు లేవు... విజయవాడ భవానీపురంలోని రవీంద్రభారతి ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో పాఠశాలను నడుపుతున్నారని, ఇప్పటి వరకు ఆ పాఠశాలకు అనుమతులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా యాజమాన్యం నిర్వహిస్తోందని బసవ సత్యప్రసాద్ అనే వ్యక్తి తెలిపారు. వెంటనే అనుమతులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అర్జీ సమర్పించారు. రేషన్ కార్డు బదిలీ చేయరూ... నూజివీడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పుట్ట వెంకటేశ్వరరావు అదే మండలంలోని మర్రిబంధం గ్రామంలో తాను రేషన్‌కార్డు పొంది ఉన్నానని, జీవనోపాధి నిమిత్తం సీతారామపురంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటున్నానని అధికారులకు తెలిపారు. తమ రేషన్ కార్డును సీతారామపురం గ్రామానికి బదిలీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు. తొమ్మిదేళ్లుగా పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు... బందరు మున్సిపల్ కార్మికులకు 2005 పీఆర్సీ బకాయిలను నేటికీ చెల్లించలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.సత్యనారాయణ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే మునిసిపల్ కార్మికులకు పీఆర్సీ బకాయిలు ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఎన్నికల విధులకు భత్యం చెల్లించలేదు... ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిగా పనిచేసిన తమకు టీఏ, డీఏలు చెల్లించలేదని కె.శ్రీనివాసరావు, వి.రామచంద్రరావు, డి.వెంకటేశ్వరరావు, కేవీ బాలాజీ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమకు పెడన తహశీల్దార్ టీఏ, డీఏలు ఇంతవరకు చెల్లించలేదని వారు వివరించారు. ఇతర నియోజకవర్గాల్లో పనిచేసిన సిబ్బందికి ఎన్నికల విధులు పూర్తయిన వెంటనే చెల్లించారని వారు తెలిపారు. వెంటనే తమకు టీఏ, డీఏలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ‘‘ఎన్నికల కోడ్ ఈ నెలాఖరులోగా అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయండి’’ అని కలెక్టర్ ఎం.రఘునందనరావు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌తో పాటు ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్సుదంరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధిదారులకు పథకాల యూనిట్లు మంజూరు, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూపొందించిన ప్రణాళికలు, సబ్‌ప్లాన్ అమలు వేగవంతం చేయాలన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం, గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేయాల్సిన గృహాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి కొరత రాకుండా ఆర్డబ్ల్యూఎస్ శాఖ కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. ముఖ్యమైన ఫైళ్ల వెంటనే క్లియర్ చేయాలన్నారు. డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బి.పద్మావతి, డీఎంఅండ్‌హెచ్‌వో జె.సరసిజాక్షి, డీఎస్వో పి.సంధ్యారాణి, డీఈవో డి.దేవానందరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీల్లో కొన్ని.. తమ గ్రామంలో అనుమతి లేకుండా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు జరుపుతున్నారని, దీని వల్ల సమీప పంటభూములు సెలినిటీ బారిన పడే ప్రమాదం ఉందని మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన కాగిత శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు. బందరు పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని, మచిలీపట్నం ప్రధాన పార్కులో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. సమాచార హక్కు చట్టం ద్వారా తాము కోరిన వివరాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తు న్న కైకలూరు తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరతూ వెంపటి విష్ణురావు అర్జీ ఇచ్చారు. కంకిపాడు మండలంలోని వేల్పూరులో ఎస్సీల స్వాధీనంలో ఉన్న భూమిలో లిక్కర్ స్టిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని దళిత జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనరు మారుమూడి విక్టర్‌ప్రసాద్ అర్జీ సమర్పించారు. నీలం తుపాను నష్టపరిహారం కోసం బందరు మండలం కోన గ్రామానికి చెందిన రైతులకు బ్యాంకు ఖాతాలు తెరిచినా ఇంత వరకు డబ్బులు జమ చేయలేదని అదే గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు. మండవల్లి మండలం కొర్లపాడును రెవెన్యూ గ్రామంగా మండల పరిషత్ కార్యాలయంలో గెజిట్ ప్రకటించి, గ్రామంలోని భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచి సీహెచ్ శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు. జాతీయ రహదారి విస్తరణలో కోసం తమ భూములు సేకరించారని, ప్రభుత్వం ప్రకటించిన ధరతో తమకు నష్టం జరుగుతోందని, న్యాయమైన ధర ఇప్పించాలని గన్నవరం మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన రైతుల అర్జీ ఇచ్చారు. -
ఫేస్ టూ ఫైర్
=ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడం లేదని ఆవేదన =ఖిన్నులైన మేయర్, కమిషనర్ = ‘ ఫేస్ టూ ఫేస్’లో ఆగ్రహావేశాలు 90 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణ అనుమతి కోసం నెలల తరబడి తిరుగుతున్నా. తిరిగి తిరిగి వేసారి పోతున్నాం. వివిధ సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు -బాగ్‌లింగంపల్లికి చెందిన నారాయణరెడ్డి ఆవేదన బోరబండలోని సారథి హౌసింగ్ సొసైటీలోని నా ఫ్లాట్‌ను దొంగ దస్తావేజులతో ఆక్రమించుకున్న వారి కి కరెంటు, మంచినీటి కనెక్షన్లు ఇచ్చారు. తగిన దస్తావేజులతో విన్నవించినా అధికారుల నుంచి స్పందన లేదు. స్వయంగా మేయర్ దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా పట్టించుకుంటారా.. లేదా - సీహెచ్ కృష్ణ ఆగ్రహం నాలుగేళ్లుగా తిరుగుతున్నా నల్లా కనెక్షన్ ఇవ్వరు. చెల్లించాల్సిన ఫీజులన్నీ చెల్లించినా..వాణిజ్య కేటగిరీ కింద కనెక్షన్ ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. - ఓ సాఫ్ట్వేర్ సంస్థ నిర్వాహకుడి ఆక్రోశం ఇదీ శనివారం జరిగిన ‘ఫేస్ టూ ఫేస్’లో ప్రజాగ్రహం. కార్యాలయాలు చుట్టూ రోజులు..నెలలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజావాణి’లలో మొరపెట్టుకున్నా పరిస్థితిలో మార్పు ఉండటం లేదంటూ పలువురు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ఫేస్ టూ ఫేస్’లో మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించని వేదికల వల్ల ప్రజలకు సమయం, ధనం వ్యయం తప్ప మిగిలేదేమిటంటూ రగిలిపోయారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మేయర్ మాజిద్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు నచ్చజెప్పేందుకు యత్నించారు. 90 చ.గజాల్లో ఇంటి నిర్మాణ అనుమతికి సంబంధించిన దస్త్రాలన్నీ ఉంటే..వెంటనే అనుమతిప్పిస్తామని కమిషనర్ హామీఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12గంటల్లోగా అనుమతి పత్రం ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. శివరాంపల్లి, టాటానగర్, హసన్న గర్లలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ మాజిద్ మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే నోటీసులు జారీచేశామని..పాటించాల్సిన విధివిధానాలు పాటిస్తూ కూల్చివేతలు చేపడుతున్నామన్నారు. ఎంతోకాలంగా తామెదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. చర్యలు తీసుకోండి : తమ స్థాయిలోనే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేయర్ మాజిద్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. ‘ఫేస్ టు ఫేస్’లో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో..మ్యాన్‌హోల్ కవర్ మూత వేయాలన్నా కమిషనరే చేయాలనుకోవడం తగదని..సంబంధిత సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు ఎవరి పరిధిలోని సమస్యల్ని వారే పరిష్కరించాలన్నారు. వారు పరిష్కరించనందునే ప్రజలు జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయం దాకా వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రికార్డు బ్రేక్!
= కుటుంబాలు 11 లక్షలు = తెల్ల కార్డులు 12.34 లక్షలు = జిల్లాలో ధనికులు లేనట్టే! = విస్మయం కలిగిస్తున్న లెక్కలు = ఇంకా వెల్లువలా దరఖాస్తులు = బ్లాక్ మార్కెట్‌కు సరకులు = రూ.కోట్లలో ప్రజా ధనం వృథా జిల్లాలో శత శాతం పేద కుటుంబాలే ఉన్నాయా?.. ధనికులు లేరా?.. ప్రతి కుటుంబానికీ తెల్లరేషన్ కార్డు ఉందా?.. కార్డులు లేని వారే లేరా?.. తెల్లరేషన్ కార్డుల సంఖ్యను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్యే ఎక్కువగా ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఆ దిశగా బోగస్ కార్డులపై ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కాని ప్రశ్న. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో 2011 సంవత్సరంలోని గణాంకాల ప్రకారం 44 లక్షలకు పైగా జనాభా ఉంది. కుటుంబానికి సగటున నలుగురు చొప్పున లెక్కేసినా జిల్లాలో 11 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అధికారుల లెక్కల ప్రకారం 2009లో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కుటుంబాల సంఖ్య కంటే తెల్లరేషన్‌కార్డుల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. జిల్లాలో గత రెండు దఫాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమాలకు ముందు 9,85,126 తెల్లరేషన్‌కార్డుదారులు ఉన్నారు. కుటుంబాల సంఖ్య కంటే కార్డుల సంఖ్య అధికంగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితం బోగస్ కార్డులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు చేపట్టిన సర్వేలో కేవలం 50 వేల కార్డులను మాత్రం రద్దు చేశారు. ఇందులో సగానికి పైగా లబ్ధిదారుల కార్డులను రద్దు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో మరోసారి 1,35,978 మందికి అదనంగా రేషన్‌కార్డులు మంజూరు చేశారు. దీంతో కార్డుల సంఖ్య 11,21,104కు చేరింది. మళ్లీ రెండోసారి బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసారి అర్హులు కాని వారి దగ్గర ఉన్న కార్డులను అప్పగించాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం 22 వేల మంది మాత్రమే కార్డులను వెనక్కి ఇచ్చారు. రచ్చబండ-2లోనే కాకుండా కొద్ది రోజుల క్రితం వరకు 1.5 లక్షల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 1.13 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించి ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ-3లో పంపిణీ చేస్తున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం కార్డు సంఖ్య 12,34,104కు చేరింది. కానీ ఎన్ని విధాలుగా లెక్కలు వేసుకున్నా కుటుంబాల సంఖ్య 11 లక్షలకు మించదు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం జిల్లాలో ఉన్న కుటుంబాల కంటే 1,34,104 కార్డులు అదనంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యమన్న విషయం అధికారులకే తెలియాలి. జిల్లాలో ఇప్పుడు నిర్వహిస్తున్న రచ్చబండ-3లో మరో 60 వేల మంది వరకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికీ వెల్లువలా కార్డుల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ధనికులే లేరా? : పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మాత్రమే తెల్లరేషన్‌కార్డులను మంజూరు చేయాలి. కానీ ప్రస్తుతం కార్డుల సంఖ్య చూస్తే కుటుంబాల కంటే అధికంగా ఉంది. దీన్ని బట్టి జిల్లాలో ధనికులే లేనట్టుగా ఉంది. వాస్తవానికి జిల్లాలో 50 శాతానికి పైగా కుటుంబాలకు రేషన్‌కార్డులు లేవు. వీరిలో ధనికులు, తెల్లరేషన్‌కార్డులకు అర్హులు కానీ వారు ఉన్నారు. అలాగే కార్డులకు అర్హులైన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఉన్న తెల్లరేషన్‌కార్డులు.. కుటుంబాల సంఖ్య కంటే 60 శాతానికిపైగా అదనంగా ఉన్నట్టు అర్థమవుతోంది. కార్డుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం జిల్లాకు నిత్యావసరాల కేటాయింపులను చేస్తోంది. పేదలకు అందాల్సిన కోట్ల రూపాయల విలువ చేసే నిత్యావసర సరకులు 60 శాతానికి పైగా వృథా అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ బోగస్ కార్డులకు సంబంధించిన సరకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. అప్పుడప్పుడూ చేసే తనిఖీల్లోనే అనేక అక్రమాలు బయటపడుతుండడమే ఇందుకు నిదర్శనం. బోగస్ కార్డులపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేగానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొనే అవకాశం లేదు. లక్షల సంఖ్య లో బోగస్ కార్డులు ఉన్నా ప్రభుత్వం ఓట్ల కోసం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కార్డుల సంఖ్య కుటుంబాల సంఖ్యనే కాదు, జనాభా కంటే అధికమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.