- అధికారులకు అదనపు జేసీ సూచన
- మొత్తం 153 అర్జీల స్వీకరణ
కలెక్టరేట్ (మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీదారుల సమస్యలను పరిష్కరించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, పశుసంవర్థక శాఖ డీడీ దామోదరనాయుడు, డీసీవో రమేష్‌బాబు, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్‌వో పీబీ సంధ్యారాణి, ఆర్‌వీఎం పీవో పుష్పమణి తదితర అధికారులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 153 అర్జీలు స్వీకరించారు.
పలువురు అర్జీదారుల సమస్యలివీ..
ఆశలు అడియాసలు చేశారు...
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వికలాంగుల పింఛను రూ.1500 చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పుడు వైకల్య శాతాన్ని సాకుగా చూపి 40 నుంచి 80 శాతం ఉన్న వారికి వెయ్యి రూపాయలు, 80శాతం పైన ఉన్నవారికి రూ.1500 పించను ఇస్తామని ప్రకటించి వికలాంగుల ఆశలను అడియాసలు చేశారని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేలా వికలాంగులందరికీ రూ.1500 పింఛను అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు అర్జీ అందజేశారు.
నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి..
యనమలకుదురు గ్రామపంచాయతీలో డీఎల్‌పీవో విచారణలో రూ.15 లక్షలు దుర్వినియోగం అయ్యాయని వార్తలు వెలువడ్డాయని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.
గైర్హాజరు అధికారులపై చర్యలేవీ?
ప్రజావాణి కార్యక్రమానికి గత సోమవారం హాజరుకాని జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కోరారు. గత సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో 56 శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా 12 మంది మాత్రమే హాజరయ్యారని, వారికి మెమోలు జారీ చేయాలని ప్రకటించినా అమలుకాలేదని ఆయన అర్జీలో పేర్కొన్నారు.
ఆ పాఠశాలకు అనుమతులు లేవు...
విజయవాడ భవానీపురంలోని రవీంద్రభారతి ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో పాఠశాలను నడుపుతున్నారని, ఇప్పటి వరకు ఆ పాఠశాలకు అనుమతులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా యాజమాన్యం నిర్వహిస్తోందని బసవ సత్యప్రసాద్ అనే వ్యక్తి తెలిపారు. వెంటనే అనుమతులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అర్జీ సమర్పించారు.
రేషన్ కార్డు బదిలీ చేయరూ...
నూజివీడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పుట్ట వెంకటేశ్వరరావు అదే మండలంలోని మర్రిబంధం గ్రామంలో తాను రేషన్‌కార్డు పొంది ఉన్నానని, జీవనోపాధి నిమిత్తం సీతారామపురంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటున్నానని అధికారులకు తెలిపారు. తమ రేషన్ కార్డును సీతారామపురం గ్రామానికి బదిలీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.
తొమ్మిదేళ్లుగా పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు...
బందరు మున్సిపల్ కార్మికులకు 2005 పీఆర్సీ బకాయిలను నేటికీ చెల్లించలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.సత్యనారాయణ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే మునిసిపల్ కార్మికులకు పీఆర్సీ బకాయిలు ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
ఎన్నికల విధులకు భత్యం చెల్లించలేదు...
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిగా పనిచేసిన తమకు టీఏ, డీఏలు చెల్లించలేదని కె.శ్రీనివాసరావు, వి.రామచంద్రరావు, డి.వెంకటేశ్వరరావు, కేవీ బాలాజీ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమకు పెడన తహశీల్దార్ టీఏ, డీఏలు ఇంతవరకు చెల్లించలేదని వారు వివరించారు. ఇతర నియోజకవర్గాల్లో పనిచేసిన సిబ్బందికి ఎన్నికల విధులు పూర్తయిన వెంటనే చెల్లించారని వారు తెలిపారు. వెంటనే తమకు టీఏ, డీఏలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.