cennakesavaravu
-
పరిశీలించండి.. పరిష్కరించండి
అధికారులకు అదనపు జేసీ సూచన మొత్తం 153 అర్జీల స్వీకరణ కలెక్టరేట్ (మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీదారుల సమస్యలను పరిష్కరించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, పశుసంవర్థక శాఖ డీడీ దామోదరనాయుడు, డీసీవో రమేష్‌బాబు, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, ఆర్వీఎం పీవో పుష్పమణి తదితర అధికారులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 153 అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారుల సమస్యలివీ.. ఆశలు అడియాసలు చేశారు... ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వికలాంగుల పింఛను రూ.1500 చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పుడు వైకల్య శాతాన్ని సాకుగా చూపి 40 నుంచి 80 శాతం ఉన్న వారికి వెయ్యి రూపాయలు, 80శాతం పైన ఉన్నవారికి రూ.1500 పించను ఇస్తామని ప్రకటించి వికలాంగుల ఆశలను అడియాసలు చేశారని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేలా వికలాంగులందరికీ రూ.1500 పింఛను అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు అర్జీ అందజేశారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి.. యనమలకుదురు గ్రామపంచాయతీలో డీఎల్పీవో విచారణలో రూ.15 లక్షలు దుర్వినియోగం అయ్యాయని వార్తలు వెలువడ్డాయని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. గైర్హాజరు అధికారులపై చర్యలేవీ? ప్రజావాణి కార్యక్రమానికి గత సోమవారం హాజరుకాని జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కోరారు. గత సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో 56 శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా 12 మంది మాత్రమే హాజరయ్యారని, వారికి మెమోలు జారీ చేయాలని ప్రకటించినా అమలుకాలేదని ఆయన అర్జీలో పేర్కొన్నారు. ఆ పాఠశాలకు అనుమతులు లేవు... విజయవాడ భవానీపురంలోని రవీంద్రభారతి ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో పాఠశాలను నడుపుతున్నారని, ఇప్పటి వరకు ఆ పాఠశాలకు అనుమతులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా యాజమాన్యం నిర్వహిస్తోందని బసవ సత్యప్రసాద్ అనే వ్యక్తి తెలిపారు. వెంటనే అనుమతులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అర్జీ సమర్పించారు. రేషన్ కార్డు బదిలీ చేయరూ... నూజివీడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పుట్ట వెంకటేశ్వరరావు అదే మండలంలోని మర్రిబంధం గ్రామంలో తాను రేషన్‌కార్డు పొంది ఉన్నానని, జీవనోపాధి నిమిత్తం సీతారామపురంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటున్నానని అధికారులకు తెలిపారు. తమ రేషన్ కార్డును సీతారామపురం గ్రామానికి బదిలీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు. తొమ్మిదేళ్లుగా పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు... బందరు మున్సిపల్ కార్మికులకు 2005 పీఆర్సీ బకాయిలను నేటికీ చెల్లించలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.సత్యనారాయణ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే మునిసిపల్ కార్మికులకు పీఆర్సీ బకాయిలు ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఎన్నికల విధులకు భత్యం చెల్లించలేదు... ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిగా పనిచేసిన తమకు టీఏ, డీఏలు చెల్లించలేదని కె.శ్రీనివాసరావు, వి.రామచంద్రరావు, డి.వెంకటేశ్వరరావు, కేవీ బాలాజీ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమకు పెడన తహశీల్దార్ టీఏ, డీఏలు ఇంతవరకు చెల్లించలేదని వారు వివరించారు. ఇతర నియోజకవర్గాల్లో పనిచేసిన సిబ్బందికి ఎన్నికల విధులు పూర్తయిన వెంటనే చెల్లించారని వారు తెలిపారు. వెంటనే తమకు టీఏ, డీఏలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. -
అర్జీదారులకు న్యాయమైన పరిష్కారం
ప్రజావాణిలో అధికారులకు ఏజేసీ సూచన 130 దరఖాస్తుల రాక కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణిలో అర్జీదారులు పేర్కొన్న సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని దాదాపు రెండు నెలల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు దరఖాస్తుదారుల నుంచి వచ్చి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఎన్నికల విధులు ముగిశాయని, ఇకపై ప్రజావాణి అర్జీలపై అధికారులు దృష్టిసారించాలని చెప్పారు. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి అప్పగించకుండా అర్జీదారు ఇచ్చిన సమస్యను పరిష్కరించాలన్నారు. అర్జీదారుడికి న్యాయమైన పరిష్కారం చూపి వారిలో నమ్మకం కలిగించాలని సూచించారు. పరిష్కరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఖరీఫ్ సీజన్, విద్యాసంవత్సరం ప్రారంభం కావస్తున్నాయని, ఇకపై అర్జీలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఏజేసీ తెలిపారు. ఆలస్యంగా వచ్చిన అధికారులు... రెండు నెలల తరువాత నిర్వహించిన ప్రజావాణి తొలి కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా హాజరుకావడం గమనార్హం. సాధారణంగా ప్రజావాణి కార్యక్రమానికి 60 నుంచి 70 మంది అధికారులు, సిబ్బంది హాజరవుతారు. సోమవారం మాత్రం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి తొలుత కేవలం పది, పదిహేను మంది అధికారులు మాత్రమే వచ్చారు. 11.30 నుంచి 12 గంటలలోపు ఒక్కొక్క అధికారి రావటం ప్రారంభించారు. కలెక్టర్ రఘునందనరావు ప్రజావాణి కార్యక్రమానికి హాజరైతే అధికారులు 10 నిమిషాలు ముందుగానే సమావేశపు హాలుకు చేరుకునే అధికారులు.. కలెక్టర్, జేసీ రారని తెలియటంతో ఆలస్యంగా హాజరవటం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి లక్ష్మీదుర్గ, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో డి.పద్మావతి, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దృష్టికి వచ్చిన పలు సమస్యలివీ... గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న తమకు గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని 104 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శాంతికుమార్ అర్జీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించి 24 రోజుల పని దినాలను అమలు పరచాలని అర్జీలో కోరారు. రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణాజిల్లాకు నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేయాలని ప్రముఖ న్యాయమూర్తి కంచర్లపల్లి శివరామప్రసాద్ అర్జీ ఇచ్చారు. జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన నందమూరి తారక రామారావును గుర్తించి జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన అర్జీలో కోరారు. వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఎస్.మోహనరెడ్డి తన వ్యవసాయ భూములకు సంబంధించి అడంగల్‌లో తప్పుగా నమోదైందని, ఆ వివరాలను సరిచేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. తమ భూముల సరిహద్దుల్లో అక్రమంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారని, వాటిని నియంత్రించాలని కోరుతూ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని మండవల్లి మండలం లోకుమూడి గ్రామానికి చెందిన బొందలపాటి గిరిధరవరప్రసాద్, గ్రామస్తులు అర్జీ అందజేశారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెడన పట్టణం 22వ వార్డులో ఇళ్ల మధ్యలో కలంకారీ ఉడుకుల పొయ్యిను ఏర్పాటు చేయటం వల్ల దట్టమైన పొగతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని యర్రా బాలసుబ్రమణ్యం అర్జీ అందజేశారు. కాలనీవాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇళ్ల మధ్యలో ఉన్న పొయ్యిను తొలగించాలని ఆయన కోరారు. మోపిదేవి మండలం కోసూరివారిపాలేనికి చెందిన కోసూరి వెంకటేశ్వరరావు 2014 ఏప్రిల్ 22న విద్యుత్‌షాక్‌కు గురై మరణించారని, కుటుంబ సభ్యులకు లోకాయుక్త ఆదేశాల మేరకు సహాయం అందజేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ అందజేశారు. ఆపద్బందు పథకం కింద రూ.50 వేలు, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష రూపాయలు మంజూరు చేయాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిందని ఆయన అర్జీలో పేర్కొన్నారు. కృత్తివెన్ను మండలంలోని ఇంతేరు గ్రామంలో చౌకధరల దుకాణం యజమాని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గ్రామానికి చెందిన తమ్ము ఆంజనేయులు అర్జీ ఇచ్చారు. చనిపోయిన రేషన్‌కార్డుదారుల రేషన్‌ను అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారని, షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సమగ్రంగా రండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణికి హాజరయ్యే అధికారులంతా అర్జీల పరిష్కారానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రావాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎల్ విజయచందర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏజేసీ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం అర్ధవంతంగా ఉండాలన్నారు. ఆయా శాఖాధికారులు సంబంధిత శాఖల పరిధిలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అందుకుగల కారణాలు తదితర వివరాలతో ఒక రిజిష్టర్ నిర్వహించాలని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ డీ మధుసూదనరావు, గృహనిర్మాణశాఖ పీడీ సీహెచ్.ప్రతాపరావు, ఐసీడీఎస్ పీడీ కే కృష్ణకుమారి, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎన్.చినబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, డీసీవో రమేష్‌బాబు, సీపీవో వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే.... ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి సూరపనేనిపాలెం వెళ్లే రహదారి మిగిలిపోయిన పనులను వెంటనే చేపట్టాలని గ్రామానికి చెందిన పోతన శివాజీ తదితరులు అర్జీ ఇచ్చారు. అవనిగడ్డ 1వ వార్డు రహదారిలో ఉన్న ఆక్రమణలు తొలగించి డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని రేపల్లె యోగానంద్ అర్జీ సమర్పించారు. నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ఎస్సీ గ్రాంటు నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పీ నరసింహారావు అర్జీ ఇచ్చారు. తన భర్తను సబ్ ఇన్స్పెక్టర్ అన్యాయంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని, ఆయనపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గుడ్లవల్లేరుకు చెందిన వీరంకి ఉమాదేవి వినతిపత్రం అందజేశారు. డిసెంబరు 15వ తేదీన సాక్షి జిల్లా ఎడిషనల్లో ప్రచురితమైన ‘ఆల్ టైమ్ అలక్ష్యం’ వార్తకు స్పందనగా జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి ఖాతాదారులకు భద్రత కల్పించాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సైకిల్ స్టాండులో అధికారికంగా నిర్ణయించిన ధరలకన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారని పాటదారులపై తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావుపురానికి చెందిన వైవీ సుబ్రమణ్యం అర్జీ సమర్పించారు. ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి మంజూరైన నిధులతో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టి ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న చెరువుకు వేలంపాటను నిర్వహించాలని గ్రామానికి చెందిన డీఎస్కే అప్పారావు అర్జీ సమర్పించారు. ఇటీవల జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని ఇనస్ట్రక్టర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని, నియామకాలపై విచారణ జరిపి ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన పీవీఎన్ కీర్తి కోరారు.