కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణికి హాజరయ్యే అధికారులంతా అర్జీల పరిష్కారానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రావాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు చెప్పారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎల్ విజయచందర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏజేసీ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం అర్ధవంతంగా ఉండాలన్నారు.
ఆయా శాఖాధికారులు సంబంధిత శాఖల పరిధిలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అందుకుగల కారణాలు తదితర వివరాలతో ఒక రిజిష్టర్ నిర్వహించాలని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ డీ మధుసూదనరావు, గృహనిర్మాణశాఖ పీడీ సీహెచ్.ప్రతాపరావు, ఐసీడీఎస్ పీడీ కే కృష్ణకుమారి, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎన్.చినబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, డీఎస్‌వో పీబీ సంధ్యారాణి, డీసీవో రమేష్‌బాబు, సీపీవో వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు.
అర్జీలు ఇవే....
ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి సూరపనేనిపాలెం వెళ్లే రహదారి మిగిలిపోయిన పనులను వెంటనే చేపట్టాలని గ్రామానికి చెందిన పోతన శివాజీ తదితరులు అర్జీ ఇచ్చారు.
అవనిగడ్డ 1వ వార్డు రహదారిలో ఉన్న ఆక్రమణలు తొలగించి డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని రేపల్లె యోగానంద్ అర్జీ సమర్పించారు.
నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ఎస్సీ గ్రాంటు నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పీ నరసింహారావు అర్జీ ఇచ్చారు.
తన భర్తను సబ్ ఇన్‌స్పెక్టర్ అన్యాయంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని, ఆయనపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గుడ్లవల్లేరుకు చెందిన వీరంకి ఉమాదేవి వినతిపత్రం అందజేశారు.
డిసెంబరు 15వ తేదీన సాక్షి జిల్లా ఎడిషనల్‌లో ప్రచురితమైన ‘ఆల్ టైమ్ అలక్ష్యం’ వార్తకు స్పందనగా జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి ఖాతాదారులకు భద్రత కల్పించాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సైకిల్ స్టాండులో అధికారికంగా నిర్ణయించిన ధరలకన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారని పాటదారులపై తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావుపురానికి చెందిన వైవీ సుబ్రమణ్యం అర్జీ సమర్పించారు.
ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి మంజూరైన నిధులతో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టి ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు.
నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న చెరువుకు వేలంపాటను నిర్వహించాలని గ్రామానికి చెందిన డీఎస్‌కే అప్పారావు అర్జీ సమర్పించారు.
ఇటీవల జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని ఇనస్ట్రక్టర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని, నియామకాలపై విచారణ జరిపి ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన పీవీఎన్ కీర్తి కోరారు.
సమగ్రంగా రండి
Published Tue, Dec 24 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement