పాలమూరు కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల కలెక్టరేట్‌కు పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన వృద్ధులు
పెద్దకొడప్‌గల్ తహసీల్ కార్యాలయంలో పురుగు మందు తాగిన రైతు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ మంచిర్యాల అగ్రికల్చర్/ పెద్దకొడప్‌గల్ (జుక్కల్): భూ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ సోమవారం మహబూబ్‌నగర్, మంచిర్యాల, కలెక్టరేట్లకు కొందరు పెట్రోల్ సీసాలతో రావడం సంచలనం రేపింది. పెద్దకొడప్‌గల్ తహసీల్ కార్యాలయంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తనకున్న ఎకరం భూమి తనకు కాకుండా చేస్తున్నారంటూ మనస్తాపంతో ఓ రైతు మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హన్వాడ మండలం హనుమాన్ టెంపుల్ తండాకు చెందిన కేతావత్ రాములు సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై చల్లుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఏఎస్, పోలీసులు ఆయన చేతిలో ఉన్న సీసాను లాక్కున్నారు.
రైతు మాట్లాడుతూ తన తండ్రి రేఖ్యానాయక్ పేరుతో సర్వే నం.108లో లావణి పట్టా ఎకరం వ్యవసాయ భూమి ఉందని, అయితే ఇటీవల తన చిన్నాన్న కుమారులు రమేశ్, లచ్యానాయక్, రవి, గోపాల్ తనతో గొడవ పెట్టుకుంటూ పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సైతం తనపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కలెక్టర్ స్పందించి తన భూమి ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ విజయేందిరకు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
మరోఘటనలో...
కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన శీలం బానక్క, శీలం పోశయ్య, శీలం సత్తయ్య ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌కు వచ్చారు. టేకులపల్లి గ్రామ శివారులో తమకు ఉన్న భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అర్జీ సమర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో కాసేపు కూర్చున్న వాళ్లు.. తర్వాత పెట్రోల్ బాటిల్ తీసేందుకు యత్నించారు.గమనించిన కలెక్టర్ గన్‌మెన్ పెట్రోల్ బాటిల్ లాక్కున్నాడు.
ఈ సందర్భంగా బానక్క, పోశయ్య, సత్తయ్య మాట్లాడుతూ బానక్క పేరుమీద ఉన్న 12 ఎకరాల భూమి నలుగురు అన్నదమ్ములకు చెందాల్సి ఉండగా భూమిని శీలం కిష్టయ్య కొడుకు శీలం శ్రీనివాస్ పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికి కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నాడని వివరించారు.
ఈ విషయమై కలెక్టర్‌కు, ఆర్డీవోకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, పట్టా రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. మా చావుతోనైనా అక్రమ పట్టాదారుపై చర్యలు తీసుకుంటారని పెట్రోల్ బాటిల్‌తో వచ్చామని పేర్కొన్నారు. వారిని నస్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
లంచం ఇచ్చినా పనికాలేదంటూ...
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ తహసీల్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దకొడప్‌గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన గైని అంజయ్య, అన్నదమ్ముల పేరిట గ్రామ శివారులో మూడెకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ భూమిని తమ పేరిట రిజి్రస్టేషన్ చేయాలని కోరుతూ ఆర్‌ఐ పండరి వద్దకు ఆరు నెలల క్రితం వెళ్లారు.
ఈ భూమి పార్ట్ ‘బి’లో ఉందని, రూ. 20 వేలు ఇస్తే పార్ట్ ‘బి’నుంచి తొలగించి పట్టా చేసి పాస్ బుక్ ఇస్తానని పండరి చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఆర్‌ఐకి ఫిబ్రవరిలో రూ. 19 వేల నగదు, రూ. 1000 ఫోన్ పే ఇతరుల ఫోన్‌కు చెల్లించామన్నారు. అయితే ఆరు నెలల నుంచి తిరుగుతున్నా పనికాకపోవడంతో విసుగు చెందిన అంజయ్య తహసీల్దార్ చాంబర్‌లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే అక్కడున్నవారు రైతును చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ దశరథ్‌ను సంప్రదించగా అంజయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని, ఆర్‌ఐ పండరి డబ్బులు తీసుకున్న విషయం తన దృష్టికి రాలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment