praja vani
-
ప్రజావాణిలో పెట్రోల్ సీసాల కలకలం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ మంచిర్యాల అగ్రికల్చర్/ పెద్దకొడప్గల్ (జుక్కల్): భూ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ సోమవారం మహబూబ్‌నగర్, మంచిర్యాల, కలెక్టరేట్లకు కొందరు పెట్రోల్ సీసాలతో రావడం సంచలనం రేపింది. పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకున్న ఎకరం భూమి తనకు కాకుండా చేస్తున్నారంటూ మనస్తాపంతో ఓ రైతు మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హన్వాడ మండలం హనుమాన్ టెంపుల్ తండాకు చెందిన కేతావత్ రాములు సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై చల్లుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఏఎస్, పోలీసులు ఆయన చేతిలో ఉన్న సీసాను లాక్కున్నారు. రైతు మాట్లాడుతూ తన తండ్రి రేఖ్యానాయక్ పేరుతో సర్వే నం.108లో లావణి పట్టా ఎకరం వ్యవసాయ భూమి ఉందని, అయితే ఇటీవల తన చిన్నాన్న కుమారులు రమేశ్, లచ్యానాయక్, రవి, గోపాల్ తనతో గొడవ పెట్టుకుంటూ పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సైతం తనపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కలెక్టర్ స్పందించి తన భూమి ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ విజయేందిరకు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మరోఘటనలో... కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన శీలం బానక్క, శీలం పోశయ్య, శీలం సత్తయ్య ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌కు వచ్చారు. టేకులపల్లి గ్రామ శివారులో తమకు ఉన్న భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అర్జీ సమర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో కాసేపు కూర్చున్న వాళ్లు.. తర్వాత పెట్రోల్ బాటిల్ తీసేందుకు యత్నించారు.గమనించిన కలెక్టర్ గన్‌మెన్ పెట్రోల్ బాటిల్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా బానక్క, పోశయ్య, సత్తయ్య మాట్లాడుతూ బానక్క పేరుమీద ఉన్న 12 ఎకరాల భూమి నలుగురు అన్నదమ్ములకు చెందాల్సి ఉండగా భూమిని శీలం కిష్టయ్య కొడుకు శీలం శ్రీనివాస్ పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికి కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నాడని వివరించారు. ఈ విషయమై కలెక్టర్‌కు, ఆర్డీవోకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, పట్టా రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. మా చావుతోనైనా అక్రమ పట్టాదారుపై చర్యలు తీసుకుంటారని పెట్రోల్ బాటిల్‌తో వచ్చామని పేర్కొన్నారు. వారిని నస్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. లంచం ఇచ్చినా పనికాలేదంటూ... కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన గైని అంజయ్య, అన్నదమ్ముల పేరిట గ్రామ శివారులో మూడెకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ భూమిని తమ పేరిట రిజి్రస్టేషన్ చేయాలని కోరుతూ ఆర్ఐ పండరి వద్దకు ఆరు నెలల క్రితం వెళ్లారు. ఈ భూమి పార్ట్ ‘బి’లో ఉందని, రూ. 20 వేలు ఇస్తే పార్ట్ ‘బి’నుంచి తొలగించి పట్టా చేసి పాస్ బుక్ ఇస్తానని పండరి చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఆర్ఐకి ఫిబ్రవరిలో రూ. 19 వేల నగదు, రూ. 1000 ఫోన్ పే ఇతరుల ఫోన్‌కు చెల్లించామన్నారు. అయితే ఆరు నెలల నుంచి తిరుగుతున్నా పనికాకపోవడంతో విసుగు చెందిన అంజయ్య తహసీల్దార్ చాంబర్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్నవారు రైతును చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ దశరథ్ను సంప్రదించగా అంజయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని, ఆర్ఐ పండరి డబ్బులు తీసుకున్న విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. -
మిగిలిన రూ.99,999 కోట్లూ పంచాల్సిందే... : సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజావాణికి వచ్చిన ఓ మహిళ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని, నేను రూ.లక్ష ఇచ్చి పరిష్కరిస్తున్నా అని కేటీఆర్ అన్నట్టు పత్రికల్లో వచ్చింది. నీ రూ.లక్ష కోట్లలో రూ.లక్షను మెడలు వంచి పేదలకు ఇప్పించామంటే ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. అక్రమంగా సంపాదించిన రూ.లక్ష కోట్ల నుంచి రూ.లక్షను ఒక మహిళకు ఇవ్వగలిగాం. ఇంకా రూ.99,999 కోట్లు కేటీఆర్ వద్ద ఉన్నాయి. వాటినీ పంచాల్సిన పరిస్థితిని కల్పిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై న్యాయ విచారణకు ఆదేశిస్తూ ఇప్పటికే ఉత్తర్వులిచ్చాం. ఈ విచారణలో తేలే అంశాల ఆధారంగా రెవెన్యూ రికవరీ చట్టం కింద తిరిగి వసూలు చేస్తాం..’.’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చార్లెస్ శోభరాజ్‌ను అడిగినా తాను ఏ తప్పు చేయలేదని అంటాడని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంలో ఎల్అండ్టీ, హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర అధికారుల పాత్ర విచారణలో తేలుతుందని చెప్పారు. ‘వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్నది. ఈరోజు వాళ్లు తినేది ప్రజల రక్తపు కూడు..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలనపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బావాబామ్మర్దుల తాపత్రయమే.. ‘శాసనసభలో బావాబామ్మర్దుల (కేటీఆర్, హరీశ్) తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడైనా వీరికి మద్దతుగా లేచి మాట్లాడాడా? వాళ్లిద్దరే ఆరాటపడుతున్నారు. రోళ్లకల్లి నిప్పులు చిమ్మేలా వెనకటికి ఇద్దరు దంచుతున్నారట. ఆ దంచడం చూసి అందరూ అ బ్బా..ఏం దంచుతున్నారు అ ని చప్పట్లు కొట్టుతున్నారట. ఓ అరగంట తర్వాత ఓ ము సలావిడ అక్కడినుంచి పో తూ ఆ రోళ్లో జొన్నలు, సజ్జలు లేవు. ఎంత దంచ్చి నా అలసిపోవడం తప్ప వచ్చేది ఏం లేదని చెప్పిందట. అసెంబ్లీలో కూడా హరీశ్, కేటీఆర్ దంచుడు అలానే ఉంది..’అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. భవనాలను కూల్చడం ఆస్తుల సృష్టి కాదు ‘ఉపయోగపడేవాటన్నింటినీ కూల్చి మళ్లీ కట్టారని శ్వేతపత్రంలో చెప్పాం. సచివాలయం భవనాలను కూల్చకుండా కిరాయి భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను తరలించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అచ్చిరాలేదంటే ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి కొత్తగా ఖాళీ జాగాలో సచివాలయం కడితే ఉపయోగపడేది. అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తవి కట్టి ఆస్తి సృష్టించినం అంటున్నారు. 22 ల్యాండ్ క్రూజర్లను కొని దాచిపెట్టారు నేను కొత్త వాహనాలను కొనొద్దు అని అధికారులకు చెప్పా. పాతబళ్లకు మరమ్మతులు చేయాలని నేను అంటుంటే..22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టామని ఓ అధికారి చెప్పాడు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే తెద్దాం అనుకున్నాం కానీ ఆయన నెత్తిమీద దర్రిదం ఉండి ఇంటికి పోయిండు అని అన్నాడు. మూడోసారి కూడా వస్తాననుకుని కేసీఆర్ తనతో పాటు తన మందిమాగధుల కోసం ఒక్కో బండికి రూ.3 కోట్లు పెట్టి కొన్నారు. ఆయన సృష్టించిన సంపద అలాంటిది. ఆ వాహనాలు ప్రభుత్వ ఆస్తి. తీసుకోకుంటే ఎక్కడికిపోతాయి? కావాలంటే మీకు (జర్నలిస్టులకు) ఇస్తాం. అలా రౌండ్ కొట్టి రండి..’అంటే సీఎం ఛలోక్తి విసిరారు. ఆ అధికారుల సమాచారం మా వద్ద ఉంది ‘వరంగల్‌లో సైనిక్ స్కూల్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది? ఐటీఐఆర్ కోసం అడగలేని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బుల్లెట్ ట్రైన్ కోసం మేము ప్రధానిని అడగలేదని సుద్దులు చెప్తున్నాడు. గత ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం ఇస్తున్న అధికారుల సమాచారం మా వద్ద ఉంది. నిన్నటి వరకు మీరే మంత్రులు కదా. షాడో టీమ్స్ ఎందుకు? (కొత్త ప్రభుత్వ పనితీరును గమనించేందుకు షాడో టీమ్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనను విలేకరులు గుర్తు చేయగా రేవంత్ ఇలా స్పందించారు) మా కొడంగల్, ఇతర ప్రాంతాల్లో కల్తీ కల్లు దొరకనప్పుడు బాధితులు పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తే కుటుంబ సభ్యులే మంచానికి తాళ్లతో కట్టేస్తారు. అధికారం పోయిన కేటీఆర్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌తో అలా మాట్లాడుతున్నాడు. కొంత కాలం అతన్నీ తాళ్లతో మంచానికి కట్టాల్సిన పరిస్థితి ఉంటది. అప్పుడే అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని బావాబామ్మర్దులు తోక తెగిన బల్లిలా దుంకుతున్నారు. గత రెండేళ్లుగా డిసెంబర్ 22 నుంచి మార్చి 31 మధ్యనే రైతుబంధు వేశారు. మేం ఈసారి డిసెంబర్ 9నే ప్రారంభించాం..’అని రేవంత్ చెప్పారు. త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ప్రస్తుత చైర్మన్, సభ్యుల రాజీనామాలను నాలుగైదు రోజుల్లో గవర్నర్ ఆమోదిస్తారు: సీఎం రేవంత్ వెల్లడి త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు రానుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో గ్రూప్– 2 పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని బుధవారం సచివాలయంలో మీడియా ప్రశ్నించగా, సీఎం ఈ విధంగా స్పందించారు. ‘టీఎస్పీఎస్సీ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఉద్యోగ నియామక పత్రాల జారీకి చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు. న్యాయపరంగా, చట్టరీత్యా చెల్లుబాటు కాదు. చైర్మన్, సభ్యుల రాజీనామాపై గవర్నర్ నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఇదే సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఆమె రాష్ట్రపతి అనుమతి కోరారు. న్యాయనిపు ణుల సలహాలు తీసుకుని రాజీనామాలను నాలుగైదు రోజుల్లో ఆమోదిస్తారు. ఆ వెంటనే కొత్త బోర్డు నియామకాలు చేపడతాం’’అని సీఎం స్పష్టం చేశారు. ‘మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలండర్ ప్రకారం సంవత్సరం తిరిగే లోపు డిసెంబర్ 9, 2024 నాటికి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇక ఇప్పుడు అభ్యర్థులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు’అని సీఎం వ్యాఖ్యానించారు. -
ఉద్యోగాలు.. బదిలీలు
లక్డీకాపూల్: ప్రజాభవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి అర్జీల వరద కొనసాగుతోంది. మంగళవారం 2,717 దరఖాస్తులు అందగా, వాటిని కంప్యూటరైజ్డ్ చేసి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) విభాగానికి ప్రభుత్వం బాధ్యతలప్పగించింది. దరఖాస్తుల సంఖ్య పె రుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. మంగళవారం ఉపాధ్యాయుల దంపతుల బదిలీపై స్పౌజ్ ఫోరం ప్రతినిధులు భారీగా ప్రజావాణికి తరలివచ్చారు. స్పౌజ్ ఫోరం ప్రతినిధు లు వివేక్, నరే‹శ్, అర్చన, సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలోని అశాస్త్రీయ విధానా లవల్ల భర్త ఒకచోట, భార్య మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే బదిలీ లు చేపట్టాలని కోరారు. మహిళా సమాంతర రిజర్వేషన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఏఈఈ గ్రూప్–4 ఫలితాలను విడుదల చే యాలని పలువురు నిరుద్యోగులు ప్రభుత్వాని కి మొరపెట్టుకున్నారు. నిరుద్యోగ ప్రతినిధులు నాగులు సాయికిరణ్, పవన్, శరత్ మీడియా తో మాట్లాడుతూ.. హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో అనవసరమైన కాలయాపన చేయకుండా మెమో నెం.7593ను ప్రకారం డాక్యు మెంట్ వెరిఫికేషన్ జాబితాను పదిహేను రోజు ల్లో విడుదల చేయాలని కోరారు. నా భర్త ఉద్యోగం ఇవ్వండి విధి నిర్వహణలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన జెన్కో ఉద్యోగి సదానందన్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుని భార్య వందన సదానందన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సాయం అందలేదనీ, ఇప్పటికైనా భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఓపిక పట్టండి అన్నీ పరిష్కరిస్తాం
లక్డీకాపూల్: ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ప్రధానంగా ధరణి, భూ సమస్యలను పరిష్కరించాలంటూ ఎక్కువమంది రాగా, కొండ పోచమ్మ సాగర్ బాధితులు, టీఎస్పీఎస్సీ రద్దు చేయాలంటూ నిరుద్యోగులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు విన్నవించారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మంత్రితో పాటు ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన ఉన్నారు. ఆటోవాలాలపై విధానపరమైన నిర్ణయం ప్రజావాణి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అందరి సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. మంగళవారం ప్రజా వాణి కార్యక్రమంలో 5,324 వినతి పత్రాలందాయని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోవాలాలు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు, రేషన్, భూసమస్యల వంటివన్నీ ఆరు గ్యారంటీల అమలుతో పరిష్కారమవుతాయని మంత్రి అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాదీనం చేసుకోవాలి తెలంగాణలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డిపాజిట్‌దారులకు తక్షణమే డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. బాలమల్లేష్ ప్రజావాణిలో కోరారు. మాజీ హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల మాజీ హోంగార్డుల ప్రతినిధులు ఇందిర, యూనస్ మహ్మద్ వ్రిజ్ఞప్తి చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి న్యాయం జరగలేదన్నారు. ఇంకా పలు సమస్యలపై.. ప్రభుత్వ పాఠశాల్లోని స్వచ్ఛ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు, ప్రమీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 28 వేల మంది కార్మికులకు నిధుల కొరత పేరిట గ్రా మ పంచాయతీలు వేతనాలు చెల్లించడం లేదన్నా రు. కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో బాధితులు పాదయాత్రగా ప్రజాభవన్‌కు వచ్చి కొండపోచమ్మ సాగర్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలకు అనుమతించాలని స్పౌజ్ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి 10గంటల్లోపు వచ్చిన వారికి మాత్రమే శుక్రవారం నుంచి ఉదయం 10 గంటలలోపు వచ్చిన వారికే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు ప్రజా భవన్ అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రజాభవన్ వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. -
ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు
-
కలెక్టర్ సారూ.. కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదు..!
మద్యం ప్రియులు బ్రాండ్ల విషయంలో ఏ మాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది. తమకు అత్యంత ఇష్టమైన మద్యం బ్రాండ్ లేకపోతే తాము ఎందుకు సర్దుకుపోవాలి అనుకున్నాడో ఏమో గానీ ఒక వ్యక్తి ఏకంగా కలెక్టరేట్‌నే ఆశ్రయించాడు. ‘మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో లేవు’ అని ఫిర్యాదు చేశాడు. మద్యం పాలసీ అనేది ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాన్ని ఏకండా ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికే తీసుకెళ్లాడు మనోడు. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాడు చేశాడు. జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి తమ ఊరిలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందనే విషయం తెలుసుకున్నాడు. ఏదైనా సమస్య కదా అనుకున్నాడు. తనకు వచ్చిన సమస్య కింగ్ ఫిషర్ బ్రాండ్ అందుబాటులో లేదనేది. దీన్ని కలెక్టర్ వద్దకే తీసుకెళ్లాడు. ప్రజావాణిలో తమకు కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు దొరకడం లేదని విన్నవించాడు. ఇది చూడటానికి నవ్వు తెప్పించినా మనోడి కష్టం ఎవరికి తెలుసు. మరి ఆ కలెక్టర్‌గారు దీనిపై చర్యలు తీసుకుంటామన్నారా.. లేక లైట్ తీసుకుంటారో చూడాలి. గతంలో కూడా జగిత్యాల ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అదే జగిత్యాలలో 2018లో అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా కింగ్ ఫిషర్ బ్రాండ్ బీరు దొరకడం లేదని ఫిర్యాదు చేశాడు. అప్పుడు కూడా ప్రజావాణి కార్యక్రమంలోనే కలెక్టర్‌గా ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు విక్రయాలను నిలిపేసి వాటి స్థానంలో నాసిరకం బీరును అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. పొరుగున కరీంనగర్లో కింగ్ ఫిషర్ బీర్ యథేచ్చగా దొరుకుతుండగా జగిత్యాలలో ఈ గడ్డు పరిస్థితికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడుమరొక ఫిర్యాదు. వ్యక్తులు మారారు కానీ అదే ఫిర్యాదు. బ్రాండ్ కూడా అదే. -
అప్పు చెల్లించలేదని భార్యను తీసుకెళ్లారు
మంచిర్యాలసిటీ: అప్పు చెల్లించలేదని ఓ వ్యాపారి రుణగ్రహీత భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి దాచిపెట్టాడు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుడు జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావుకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. నెన్నెల మండలం ఆవ డం గ్రామానికి చెందిన బాసవేన హన్మంతు, సరోజ దంపతులకు, రుషిత్ (3), ఐసు(1) సంతానం. అదే మండలం చిత్తాపూర్‌కు చెందిన రైస్‌మిల్లు వ్యాపారి సందాని వద్ద రెండేళ్ల కిందట రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి అసలుతో పాటు వడ్డీ చెల్లించలేదు. ఈ క్రమంలో హన్మంతు రెండు నెలల కిందట తన కాపురాన్ని ఆవడం నుంచి మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్‌నగర్‌కు మార్చాడు. విషయం తెలుసుకున్న సందాని.. హన్మంతు భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఓ ఇంట్లో దాచి పెట్టాడు. నెల క్రితం హన్మంతు తర్వాత భార్యా పిల్లలు ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్లడంతో సందాని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆదివారం మరోసారి వెళ్లానని, కొడుకు నాన్నా అంటూ నా వెంట రావడంతో తీసుకొచ్చానని తెలిపాడు. ‘అప్పు తీర్చితేనే నీ భార్యా పిల్లలు నీ వెంట వస్తారు.. లేకుంటే చంపేస్తా’ అని బెదిరించడంతో నెన్నెల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇది సివిల్ కేసు, కోర్టుకు వెళ్లమని ఎస్ఐ చెప్పడంతో గత్యంతరం లేక జేసీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని రోదిస్తూ విలేకరులకు చెప్పాడు. వడ్డీ సహా అప్పు తీర్చుతానని ఎంత ప్రాథేయపడినా వ్యాపారి కనికరించడం లేదని వాపోయాడు. -
రక్తంతో కలెక్టర్‌కు లేఖ రాసిన మహిళ
సాక్షి, యాదాద్రి : కలెక్టరమ్మ జైహింద్ నాకు న్యాయం చేయండి.. అంటూ భువనగిరి మండలం బొమ్మాయిపల్లికి చెందిన మేడబోయిన స్వప్న రక్తంతో కాగితంపై రాసుకుని కలెక్టరేట్‌కు వచ్చింది. సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి చేతిపై గాజుతో గాట్లు పెట్టుకుంది. దాంతో వచ్చిన రక్తంతో పలు విధంగా రాసింది. చనిపోయిన తన తండ్రి మంగలి మల్లేశం పేరున గల రెండెకరాల భూమిని గ్రామంలో భిక్షపతి అనే వ్యక్తి కబ్జా చేశాడని ఫి ర్యాదు చేశారు. తాను అత్తగారిల్లు అయిన అల్వాల్‌లో ఉం టున్నానన్నారు. తన తండ్రి భూమి తన పేరున చేయాలని అధికారులను కలిసినా న్యాయం జరగడం లేదని ఆరోపించారు. అధికారులకు లంచాలు ఇవ్వడానికి తాళిబొట్టు తా కట్టు పెట్టి ఇత్తడి తాళిబొట్టు వేసుకున్నానన్నారు. అయినా అధికారులు తన సమస్య పరిష్కరించడం లేదని పలువురు అధికారులపై ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ దగ్గరికి వచ్చానని వివరించారు. న్యాయం కోసం తాను చనిపోతానని ఇందుకోసం తన వెంట తెచ్చుకున్న చిన్న చిన్న గాజు ముక్కలను నొట్లో వేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో పక్కనే ఉన్న పోలీసులు ఆమెను వారించి కొద్ది సేపు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రజావాణిలో ఉన్న కలెక్టర్ అనితారామచంద్రన్ వద్దకు తీసుకెళ్లారు. స్వప్న తన సమస్యను వివరించడంతో భువనగిరి ఆర్డీఓతో విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె బయటకు వచ్చింది. -
చదువుకోవాలని ఉంది..
మెదక్‌రూరల్ : అమ్మా..నాన్నా లేని అనాథను చదువుకోవాలని ఉంది రెసిడెన్షియల్లో సీట్ ఇప్పించండి సారూ అంటూ శివ్వంపేట మండలం తల్లెపల్లి తండాకు చెందిన శ్రావణి అనే చిన్నారి ప్రజావాణిలో వేడుకుంది. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి 119 ఆర్జీలు వచ్చాయి. శ్రావణి తన నానమ్మ చామంతితో కలిసి ప్రజావాణిలో ఆర్జీని సమర్పించింది. తాను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలానని, వరుసకు నానమ్మ అయిన చామంతి వద్ద ఉంటున్నట్లు తెలిపింది. శివ్వంపేట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న తనకు రెసిడెన్షియల్లో సీట్ ఇప్పించి ఆదుకోవాలని కోరింది. మురికి నీటిని వదులుతున్నారు ఉద్దేశ్యపూర్వకంగా మా ఇంట్లోకి మురికి నీటిని వదులుతున్నారని హ వేళిఘణాపూర్ మండలం బోగుడ భూపతిపూర్ గ్రామానికి చెందిన విఠల్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. గ్రామంలో తాను ఇళ్ళు నిర్మించుకుటుండగా అదే గ్రామానికి చెందిన సాదుల పోచయ్య ఉద్దేశ్యపూర్వకంగానే మురికి నీటిని, వ్యర్థ జలాలను వదులుతూ అపరిశుభ్ర వాతావరణాన్ని చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
నేను సచ్చినంక ఇస్తరా..
కరీంనగర్‌సిటీ : సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు. ప్రధానంగా డబుల్బెడ్రూంల మంజూరు, భూ సమస్యలు, ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువగా అర్జీలు సమర్పించారు. జిల్లావ్యాప్తంగా గత సోమవారం కంటే వంద అర్జీలు తగ్గాయి. 121 మంది బాధితులు దరఖాస్తులను అధికారులకు విన్నవించారు. ఎండల తీవ్రతతో జనం బయటికి రాలేకపోతున్నారు. బాధితుల నుంచి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ బద్రి శ్రీనివాస్, డీఆర్వో అయేషా మస్రత్‌ఖానమ్, ఆర్డీవో రాజాగౌడ్‌లు అర్జీలు స్వీకరించారు. ఎండ.. అధికారుల ఎఫెక్ట్ ప్రజావాణికి ఎండతోపాటు జిల్లా అధికారులు కానరాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏసీల ఎఫెక్టో.. ఏమోనని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం ప్రజావాణికి జిల్లా అధికారులు డుమ్మా కొట్టారు. తమ శాఖల్లోని కిందిస్థాయి అధికారులను ప్రజావాణికి పంపించి ప్రజాసమస్యలపై తమ శ్రద్ధ ఏంటో స్పష్టం చేశారు. కొంత మంది టూర్లు అని ప్రజావాణికి ఎగనామం పెట్టారు. కొంతమంది జిల్లా అధికారులు మాత్రమే తమ చిత్తశుద్ధిని కనబరిచారు. అందులో ఎక్కువగా మహిళా అధికారులే ఉన్నారు. ఇక ఖాళీ కుర్చీల స్థానంలో అక్కడికి వచ్చిన బాధితులతో సీట్లు నిండుగా దర్శనమిచ్చాయి. కలెక్టర్ పదేపదే చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా భర్త మనసు మార్చండి.. నాకు రెండేళ్ల క్రితం శంకరపట్నం మండలం ఆముదాలపల్లి వాసి అయిన రాజేశ్‌తో కట్నకానుకల లాంచనలాలతో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం స్వగ్రామంలో కాకుండా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముంటున్నాం. వివాహం జరిగిన 8 నెలలే కలిసి ఉన్నాం. నాకు ఒక బాబు పుట్టాడు. భర్త మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పెద్దమనుషులకు విన్నవించినా వారి మాటవినకుండా టార్చర్ చేశాడు. 3 నెలల నుంచి బాబును, నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను పుట్టింటి నుంచి తీసుకెళ్లడం లేదు. నా భర్త, ఆడపడుచు, అత్తగార్లను పోలీసుల ద్వారా పిలిపించి కౌన్సెలింగ్ చేయించి నా కాపురాన్ని చక్కదిద్ది న్యాయం చేయాలని వేడుకుంటున్నా. - ఎర్ర రిషిత, కాపువాడ కరీంనగర్ నేను సచ్చినంక ఇస్తరా.. నాకు ఎనబై ఏళ్లు దాటినయి. శాతనైతలేదు. నా తల్లి పేరు మీద నుంచి వారసత్వంగా వచ్చిన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. రెండేళ్లుగా ప్రజావాణిని ఆశ్రయిస్తున్నా. ఇప్పటివరకు 103 దరఖాస్తులు సమర్పించుకున్నా. గ్రామంలో 32 గుంటల నా భూమిని కబ్జా చేశారని, కబ్జాదారులు భయబ్రాంతులకు గురిచేయడంతోపాటు దాడి కూడా చేశారంటూ అధికారులకు విన్నవించాను. ప్రస్తుతం నగరంలో ఓ అద్దె నివాసంలో ఉంటూ ప్రతినెలా వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛన్‌పై ఆధారపడి జీవి స్తున్నాను. ఈ అధికారుల తీరుతోటి కలెక్టరేట్లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాను. వెయ్యి రూపాయల పెన్షన్‌తో అద్దె ఇంట్లో బతుకుతున్న. ఇల్లు కిరాయి కూడా ఎళ్తలేదు. పనిచేయడానికి కూడా చాతనైతలేదు. కోర్టుల చుట్టూ తిరిగి పోరాడే శక్తి లేదు. కలెక్టరేట్‌కు వస్తే తొందరపడకు వస్త ది అంటుండ్రు. ఇంకెప్పుడస్తది.. నేను సచ్చినంక వస్తదా!! హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో 714 సర్వే నంబర్లోని 32 గుంటల భూమిని ఇప్పించి న్యాయం చేయాలి. - కన్నం వెంకటయ్య, రాంపూర్, హుజూరాబాద్ -
వినరండోయ్..!
సాక్షి, వనపర్తి/వనపర్తి : ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి సామాన్యుల సమస్యలను పరిష్కరించలేకపోతుంది. ఫిర్యాదుదారులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే చిన్నంబావి మండలం అయ్యవారిపల్లికి చెందిన ఇద్దరు సోదరులు భూమి కబ్జా విషయంలో తమకు న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై ప్రజావాణికి వెంట విషం తెచ్చుకున్నారు. మరుగుదొడ్డి బిల్లు రాలేదని.. పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎండీ సైదయ్య ఏడాది క్రితం మరుగుదొడ్డి నిర్మించుకున్నాడు. ఇందుకోసం సుమారు రూ.20వేలు ఖర్చ య్యాయి. ప్రభుత్వం రూ.12వేలు ఇస్తుందని చెప్పడంతో అధికారుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. అధికారుల చుట్టూ సంవత్సర కాలంగా తిరిగి తిరిగి వేసారిపోయాడు. అక్కడ న్యాయం జరగకపోవడంతో ఐదుసార్లు ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదుచేశాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఫిర్యాదుల వెల్లువ ప్రజావాణి సమస్యలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్ శ్వేతామహంతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, ఇన్చార్జ్ జేసీ చంద్రయ్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో ఎక్కువగా భూమికి సంబంధించినవి ఉన్నట్లు గ్రీవెన్స్‌సెల్ అధికారులు వెల్లడించారు. ఈ వారం 122 ఫిర్యాదులు అందినట్లు గ్రీవెన్స్‌సెల్ అధికారులు తెలిపారు. ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. భూమి కబ్జాచేశారు 20ఏళ్లుగా గ్రామంలోని ప్రభుత్వ భూమిని సాగుచేసుకుని జీవిస్తున్నాం. నా భర్త చనిపోవడంతో పిల్లల పోషణ, చదువుల కోసం వలస వెళ్లాల్సి వచ్చింది. మా భూమిని గ్రామంలోని కొందరు ఆక్రమించుకుని అమ్ముకున్నారు. మాకు దిక్కులేని మా కుటుంబాన్ని చూసి భూమి అమ్ముకున్నారు. ఆ భూమిపై మాకు హక్కు కల్పించాలి. – చెన్నమ్మ, కేతపల్లి, పానగల్ మండలం ప్రభుత్వ గుర్తింపు ఇవ్వండి ఇదివరకు నందగోపాలకృష్ణ యాదవ సంఘంలో సభ్యులుగా ఉన్న మేము పరమేశ్వరి యాదవ సంఘం పేరుతో కొత్త సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు మా సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి. – అప్పరాల గొర్రెల పెంపకందార్లు, కొత్తకోట మండలం వాడుకలోకి తీసుకురావాలి గ్రామంలో ఏడాదిన్నర క్రిత ం నిర్మించిన మూడు మినీవాటర్ ట్యాంకులను వాడుక లోకి తీసుకురావాలి. రూ. ల క్షల ప్రజాధనంతో నిర్మించిన ట్యాంకులు ప్రస్తుతం దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి. నివాసగృహాలకు తాగునీరు సరఫరా అయ్యే పైప్లైన్లకు ఈ ట్యాంకులను అనుసంధానం చేయలేదు. పలుమార్లు గ్రామకార్యద ర్శి, ప్రజాప్రతినిధులకు విషయం చెప్పినా పట్టి ంచుకోవడం లేదు.– మియాపూర్ గ్రామస్తులు, చిన్నంబావి మండలం -
వాయిదాల కోసం కోర్టులో లంచం
న్యాయం చేయాలని ‘ప్రజావాణి’లో మహిళ ఆత్మహత్యాయత్నం దురాజ్‌పల్లి (సూర్యాపేట): కోర్టు వాయిదాలు ఇవ్వకుండా సివిల్ బెంచ్ క్లర్క్ లంచం కోసం వేధిస్తున్నాడని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఇది చోటుచేసుకుంది. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన లక్ష్మమ్మ భూ వివాద కేసుకు సంబంధించి హుజూర్నగర్ సివిల్‌కోర్టులో పేచీ నడు స్తోంది. ఈ విషయమై కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే సివిల్ బెంచ్ క్లర్క్ గోవర్దన్ వాయిదాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇదేమిటని అడిగితే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. పైగా తనతో అసభ్య కరంగా ప్రవర్తించాడని పేర్కొంది. రూ.3 వేలు ఇచ్చాక ఒకసారి పేచీ వచ్చిందని, ఆ తర్వాత ఇంకా లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని ఆరోపించింది. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కేసులో రాజీకి రావాలని.. లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయింది. సోమవారం ప్రజావాణికి లక్ష్మమ్మ వచ్చింది. జేసీ వినతులు స్వీకరిస్తున్న సమయంలో.. ‘నాకు మీరైనా న్యాయం చేయండి’ అంటూ ఆమె వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. తేరుకున్న అధికారులు ఆమెను సముదాయించి పోలీసులకు అప్పగించారు. -
పెద్దసారు లేక పరేషాన్!
ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి వ చ్చిన ఫిర్యాదుదారులు అసహనానికి గురయ్యారు. తమ సమస్యకు పరిష్కారం పెద్దసా రు ద్వారానే లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 130 వినతులు రాగా, డీఆర్వో రాజశేఖర్,కలెక్టరేట్ పరిపాలనాధికారి గంగాధర్ స్వీకరించారు. సమస్యలు పరిష్కరించండి.. తమ సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య మిత్రలు డీఆర్వోను కలిసి కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఇరాక్ బాధితులను ఆదుకోండి.. బతుకుదెరువు కోసం ఇరాక్‌కు వెళ్ళిఅరచేతిలో ప్రాణాలు పెట్టుకొని స్వదేశానికి ఉట్టి చేతులతో వచ్చిన బాధితులను ఆదుకోవాలని స్వదేశీ జాగరణ మంచ్ అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయ న బాధితులతో కలిసి డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. ఇరాక్ బాధితులను గుర్తించి, ప్రభుత్వం నష్టపరిహారం లేదా ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించండి.. జిల్లాలోని వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని మైత్రి వికలాంగుల సేవ సంస్థ ఆధ్వర్యంలో డీఆర్వోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మైత్రి కార్యదర్శి రాణి మాట్లాడుతూ జిల్లాలో ఇంత వరకు సదరంలో 22వేల మంది వరకు వికలాంగత్వాన్ని ధ్రువీకరించుకున్నారని, కానీ అధికారులు మా త్రం కేవలం నాలుగు వేల సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వికలాంగులు ఇటు కుటుంబాలకు, అటు సమాజానికి భారమై నర కయాతన అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వం వికలాంగులందరికి సదరం సర్టిఫికెట్లు,అంత్యోదయం కార్డులు,గృహవసతి ,ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, వివాహ ప్రోత్సాహాక బహుమతులు ఇవ్వాలని ఆమె కోరారు. పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయండి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటి మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరి చేయిం చుకుంటూ తక్కువ వేతనాలు అందిస్తున్నారన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా వేతనాలు అందించాలన్నా రు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, వెంటనే అమలుచేయాలని కోరారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
త్వరలో మంత్రులతో సమీక్ష సమావేశం సమగ్ర నివేదికలు తయారు చేయండి జేసీ మురళి ఆదేశం ప్రజావాణికి అధికారుల గైర్హాజరు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు కలెక్టరేట్ (మచిలీపట్నం) : రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన సమస్యలపై మండల, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నివేదికలను సిద్ధం చేయాలని ప్రతి శాఖ జిల్లా అధికారికీ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారని, వారితో కలిపి త్వరలో కలెక్టర్ రఘునందన్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని ఆయన చెప్పారు. ఇందుకోసం జిల్లా అధికారులందరూ ఆయా శాఖల పరంగా సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు, బందరు ఆర్డీవో పి.సాయిబాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏ శాఖపరంగా అయితే అర్జీలు తక్కువ సంఖ్యలో వస్తాయో, ఆ శాఖ అధికారులు బాగా పనిచేస్తున్నట్లుగా పరిగణిస్తామని ఈ సందర్భంగా జేసీ అధికారులతో మాట్లాడుతూ అన్నారు. హాజరైన జిల్లా అధికారులు 12 మందే... ప్రజావాణి కార్యక్రమానికి ఎక్కువమంది జిల్లా అధికారులు ఈసారీ గైర్హాజరయ్యారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పక హాజరుకావాలని గత సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోకపోవడం గమనార్హం. మొత్తం 56 శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం 12 మంది జిల్లా అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఆరుగురు అధికారులు వ్యక్తిగత పనులపై కలెక్టర్ అనుమతి తీసుకోగా మిగిలిన వారు కిందిస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకున్నారు. ప్రజావాణికి వచ్చిన అర్జీలు ఇవీ... సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 127 మంది తమ అర్జీలను అధికారులకు అందజేశారు. వాటిలో కొన్ని... గూడూరు మండలం తరకటూరు దళితవాడ వాసులు ఇళ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తుడు ఎస్ ఎలీషాబాబు అర్జీ ఇచ్చారు. వారికి వెంటనే ఇళ్లస్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గంపలగూడెం గ్రామానికి చెందిన కె.వెంకటసుబ్బమ్మ తాను పదవీ విరమణ చేసి పింఛనుతో జీవిస్తున్నానని, 2012లో మెడికల్ రీయింబర్స్మెంట్ మంజూరు కోసం అధికారులకు బిల్లు సమర్పించినా ఇంతవరకు చెల్లించలేదని పేర్కొంటూ అర్జీ ఇచ్చారు. విజయవాడ నగరంలోని పాయకాపురానికి చెందిన బి.పద్మ జేఎన్ఎన్యుఆర్ఎం పథకం కింద ఇళ్లస్థలాలు మంజూరు చేసి తమకు గృహాలు కేటాయించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. నందివాడ మండలం ఇలపర్రు గ్రామ శివారు లక్ష్మీనరసింహాపురంలో 1994లో పేదలకు 72 ఎకరాల భూమిని పంపిణీ చేశారని, ఈ పంపిణీలో అనర్హులకు కూడా భూమి కేటాయించారని గ్రామానికి చెందిన పి.బాలకృష్ణ అర్జీ ఇచ్చారు. అసైన్మెంట్ నిబంధనలను పాటించలేదని, ఈ కేటాయింపు విషయంలో విచారణ జరిపి అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో కొంతమంది రైతులు అక్రమంగా చెరువులు తవ్వుతున్నారని, వాటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. జిల్లాలోని వ్యవసాయరంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులందరూ గత మూడు సంవత్సరాలుగా రుణార్హతకు దూరమై అప్పుల బాధలో కూరుకుపోతున్నారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ తెలిపారు. వీరికి వెంటనే గుర్తింపుకార్డులు మంజూరు చేసి రుణాలు పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ ఇచ్చారు. బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెం హరిజనవాడలో శ్మశానభూమి, డొంకరోడ్డు తరచూ ఆక్రమణలకు గురవుతున్నాయని, ఆక్రమణలను తొలగించి శ్మశానభూమి, డొంకరోడ్లు సర్వే చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామసర్పంచ్ ఎంఎం నాంచారయ్య, మాజీ సర్పంచ్ సీహెచ్ రామచంద్రరావులు అర్జీ ఇచ్చారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని దళిత గిరిజన సర్పంచుల పరిరక్షణ సంఘం గౌరవాధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారు. సర్పంచులకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలని కోరారు. హాజరుకాని వారికి మెమోలు... ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులకు మెమోలు జారీ చేయాలని ఏజేసీ చెన్నకేశవరావు డీఆర్వోకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఒక్కొక్క అధికారి హాజరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని, ఎటువంటి సమావేశాలూ నిర్వహించకూడదని చెప్పారు. జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి పంపినా హాజరుకావద్దని కిందిస్థాయి సిబ్బందికి ఏజేసీ సూచించారు. వరుస ఎన్నికలు, సమైక్యాంధ్ర ఉద్యమం, తుపానులు, వరదల కారణంగా సంవత్సరం నుంచి అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం చినబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎంవీవీ సత్యనారాయణ, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ, డీఈవో దేవానందరెడ్డి, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం తదితర అధికారులు పాల్గొన్నారు. -
సమగ్రంగా రండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణికి హాజరయ్యే అధికారులంతా అర్జీల పరిష్కారానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రావాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎల్ విజయచందర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏజేసీ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం అర్ధవంతంగా ఉండాలన్నారు. ఆయా శాఖాధికారులు సంబంధిత శాఖల పరిధిలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అందుకుగల కారణాలు తదితర వివరాలతో ఒక రిజిష్టర్ నిర్వహించాలని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ డీ మధుసూదనరావు, గృహనిర్మాణశాఖ పీడీ సీహెచ్.ప్రతాపరావు, ఐసీడీఎస్ పీడీ కే కృష్ణకుమారి, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎన్.చినబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, డీసీవో రమేష్‌బాబు, సీపీవో వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే.... ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి సూరపనేనిపాలెం వెళ్లే రహదారి మిగిలిపోయిన పనులను వెంటనే చేపట్టాలని గ్రామానికి చెందిన పోతన శివాజీ తదితరులు అర్జీ ఇచ్చారు. అవనిగడ్డ 1వ వార్డు రహదారిలో ఉన్న ఆక్రమణలు తొలగించి డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని రేపల్లె యోగానంద్ అర్జీ సమర్పించారు. నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ఎస్సీ గ్రాంటు నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పీ నరసింహారావు అర్జీ ఇచ్చారు. తన భర్తను సబ్ ఇన్స్పెక్టర్ అన్యాయంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని, ఆయనపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గుడ్లవల్లేరుకు చెందిన వీరంకి ఉమాదేవి వినతిపత్రం అందజేశారు. డిసెంబరు 15వ తేదీన సాక్షి జిల్లా ఎడిషనల్లో ప్రచురితమైన ‘ఆల్ టైమ్ అలక్ష్యం’ వార్తకు స్పందనగా జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి ఖాతాదారులకు భద్రత కల్పించాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సైకిల్ స్టాండులో అధికారికంగా నిర్ణయించిన ధరలకన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారని పాటదారులపై తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావుపురానికి చెందిన వైవీ సుబ్రమణ్యం అర్జీ సమర్పించారు. ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి మంజూరైన నిధులతో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టి ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న చెరువుకు వేలంపాటను నిర్వహించాలని గ్రామానికి చెందిన డీఎస్కే అప్పారావు అర్జీ సమర్పించారు. ఇటీవల జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని ఇనస్ట్రక్టర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని, నియామకాలపై విచారణ జరిపి ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన పీవీఎన్ కీర్తి కోరారు. -
కలకలం
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పక్క పొలాల వారు ‘వాల్టా’ చట్టానికి తూట్లు పొడుస్తూ బోర్లు వేసి.. తన పొలంలోని బోరులో నీరు తగ్గిపోయేలా చేశారని, తనకు న్యాయం చేయాలని అధికారులకు పదేపదే విన్నవించుకున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతు దేవ్లానాయక్ (33) కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి(గ్రీవెన్స్)లో అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నల్లమాడ మండలం గోపేపల్లి తండాకు చెందిన దేవ్లానాయక్కు సర్వే నంబర్ 181/2లో 2.50 ఎకరాల పొలం ఉంది. అందులో బోరు నీటి ద్వారా వేరుశనగ సాగు చేస్తున్నాడు. ఏడాది కిందట సమీపంలోని ముగ్గురు రైతులు వారి పొలాల్లో బోర్లు వేయించుకున్నారు. దీంతో దేవ్లానాయక్ పొలంలోని బోరులో నీరు తగ్గిపోయింది. వాల్టా నిబంధనలను తుంగలో తొక్కి బోర్లు వేయడం వల్లే తన బోరులో నీళ్లు తగ్గిపోయాయని, దీంతో వేరుశనగ పంట ఎండిపోయిందని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ‘వాల్టా’ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. పలుమార్లు వినతులు ఇచ్చుకోవడంతో అధికారులు నాలుగు నెలల కిందట గ్రామానికెళ్లి సమీప పొలాల రైతులను మందలించి.. దేవ్లానాయక్ పొలంలో మరో బోరు వేయించారు. వారి పొలాల్లో బోర్లు అలాగే ఉండడంతో ప్రస్తుతం ఈ బోరులో కూడా నీళ్లు తగ్గిపోవడంతో రైతు తనకు న్యాయం చేయాలని పెనుకొండలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అనంతపురంలో మూడు సార్లు అర్జీలు ఇచ్చుకున్నాడు. చివరకు సోమవారం మరోసారి అనంతపురంలో నిర్వహించిన ప్రజావాణికి మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాడు. తనకు న్యాయం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. తోటి అర్జీదారులు అడ్డుకునేలోగానే కొంత తాగేశాడు. వెంటనే 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాత్రి కర్నూలుకు తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.