అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పక్క పొలాల వారు ‘వాల్టా’ చట్టానికి తూట్లు పొడుస్తూ బోర్లు వేసి.. తన పొలంలోని బోరులో నీరు తగ్గిపోయేలా చేశారని, తనకు న్యాయం చేయాలని అధికారులకు పదేపదే విన్నవించుకున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతు దేవ్లానాయక్ (33) కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి(గ్రీవెన్స్)లో అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నల్లమాడ మండలం గోపేపల్లి తండాకు చెందిన దేవ్లానాయక్‌కు సర్వే నంబర్ 181/2లో 2.50 ఎకరాల పొలం ఉంది.
అందులో బోరు నీటి ద్వారా వేరుశనగ సాగు చేస్తున్నాడు. ఏడాది కిందట సమీపంలోని ముగ్గురు రైతులు వారి పొలాల్లో బోర్లు వేయించుకున్నారు. దీంతో దేవ్లానాయక్ పొలంలోని బోరులో నీరు తగ్గిపోయింది. వాల్టా నిబంధనలను తుంగలో తొక్కి బోర్లు వేయడం వల్లే తన బోరులో నీళ్లు తగ్గిపోయాయని, దీంతో వేరుశనగ పంట ఎండిపోయిందని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ‘వాల్టా’ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. పలుమార్లు వినతులు ఇచ్చుకోవడంతో అధికారులు నాలుగు నెలల కిందట గ్రామానికెళ్లి సమీప పొలాల రైతులను మందలించి.. దేవ్లానాయక్ పొలంలో మరో బోరు వేయించారు. వారి పొలాల్లో బోర్లు అలాగే ఉండడంతో ప్రస్తుతం ఈ బోరులో కూడా నీళ్లు తగ్గిపోవడంతో రైతు తనకు న్యాయం చేయాలని పెనుకొండలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
అనంతపురంలో మూడు సార్లు అర్జీలు ఇచ్చుకున్నాడు. చివరకు సోమవారం మరోసారి అనంతపురంలో నిర్వహించిన ప్రజావాణికి మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాడు. తనకు న్యాయం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. తోటి అర్జీదారులు అడ్డుకునేలోగానే కొంత తాగేశాడు. వెంటనే 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాత్రి కర్నూలుకు తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కలకలం
Published Tue, Dec 3 2013 4:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement