![Man Took Selfie Video Trying To Commit Suicide In Anantapur - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/02/23/55566.jpg.webp?itok=TL31t2F8)
రాయదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): తన ఆత్మహత్యకు ఆ ఇద్దరే కారణమంటూ ఓ యువకుడు బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని లాడ్జిలో క్రిమి సంహారక మందు తాగాడు. ఈ ఘటనను సెల్ఫీ వీడియో తీసి తన భార్య, స్నేహితులకు పంపాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాయదుర్గం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 15 నిమిషాల నిడివిగల సెల్ఫీ వీడియోలో ఎర్రిస్వామి పేర్కొన్న అంశాలు ఇలా...
ఏం జరిగింది?
గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన ఎం.ఎర్రిస్వామి, రాయదుర్గం మండలం కెంచానపల్లి నివాసి శ్రుతి దంపతులకు ఐదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమారులున్నారు. రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కలుగోడు పంచాయతీ జె.వెంకటాంపల్లికి చెందిన అనిల్‌కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్‌రెడ్డి పరిచయమయ్యారు.
తమకు రూ.3 లక్షలు ఇస్తే రైల్వేలో మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని పేర్కొన్నారు. దీంతో తన తల్లి, భార్య బంగారు నగలు తాకట్టు పెట్టి 2021 డిసెంబర్‌లో రూ.3 లక్షలను ఎర్రిస్వామి అందజేశాడు. నెల రోజులు గడిచిన తర్వాత మరో రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో అప్పు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో అందజేశాడు.
డ్రగ్స్ అమ్మాలంటూ ఒత్తిడి
గత ఏడాది మార్చిలో ఎర్రిస్వామిని అనిల్‌కుమార్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి కలిసి తమకు తెలిసిన వ్యక్తి నాబార్డులో పనిచేస్తున్నాడని, అతనితో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చేశామని నమ్మబలికారు. విధుల్లో భాగంగా కొందరితో డిపాజిట్లు చేయిస్తే రూ.50 లక్షల రుణం కూడా ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చింది కాబట్టి డిన్నర్ చేసుకుందామంటూ గోవాకు పిలుచుకెళ్లారు. అక్కడ ఎర్రిస్వామికి మద్యం తాపి, డ్రగ్స్ ఇచ్చారు.
అనంతరం గదిలోకి అమ్మాయిని పంపి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎర్రిస్వామిని గంజాయి, డ్రగ్స్ అమ్మి డబ్బు తీసుకురావాలంటూ ఒత్తిడి చేశారు. తాము చెప్పినట్లుగా చేయకపోతే అమ్మాయితో గడిపిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ఈ క్రమంలో ఎన్నో మోసపూరిత పనులకు వాడుకున్నారు.
వారు చెప్పిన పద్ధతిలోనే ప్రజల నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిచ్చిన తర్వాత తనపై మూడు సార్లు హత్యాయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో దోషిని చేస్తూ కర్ణాటకలోని శిరా, బెంగళూరులో కేసులు నమోదయ్యేలా చేశారు. ఇలా ఇంకొందరు యువకుల జీవితాలు సైతం నాశనం చేశారు.
నాలుగు పేజీల సూసైడ్ నోట్
తనను అనిల్‌కుమార్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి వంచన చేసిన తీరును వివరిస్తూ పోలీసులకు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను ఎర్రిస్వామి రాశాడు. తన ఆత్మహత్యకు వారిద్దరే కారణమంటూ అందులో పేర్కొన్నాడు. తన భార్యాపిల్లలను బాగా చూసుకోవాలని తల్లిదండ్రులను, మామను కోరాడు. తన భర్త పంపిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్‌ను చూడగానే శ్రుతి ఒక్కసారిగా నిశ్చేషు్టరాలైంది. ఆయన ఆచూకీ కనుగొని ప్రాణాలు కాపాడాలంటూ రాయదుర్గం అర్బన్ ఎస్‌ఐ సుమన్‌కు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. ఎర్రిస్వామి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment