భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..! | married Women Suspicious Assassinated In Prakasam District | Sakshi

భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు!

Nov 16 2020 10:44 AM | Updated on Nov 16 2020 10:51 AM

married Women Suspicious Assassinated In Prakasam District - Sakshi

సాక్షి, మార్టూరు : మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన వివాహిత దారుణహత్యకు గురైంది. పోలీసులు, సమీప బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..లక్కవరం ఎస్సీ కాలనీకి చెందిన మద్దుమాల పద్మ(38), భాస్కర్‌రావు భార్యభర్తలు. ఉన్నత విద్యావంతులైన వీరు కనిగిరిలో ప్రైవేట్‌ స్కూల్‌లో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామంలో ఉంటూ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం యద్దనపూడి మండలంలోని పూనూరులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. కంగారు పడిన బంధువులు అదే రోజు రాత్రి మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ఎస్సై శివకుమార్‌ మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి కన్పించకుండా పోయిన పద్మదిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం శనివారం రాత్రి మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పద్మ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం చేశారు.  

ఆచూకీ లేని భర్త
ఇదిలా ఉండగా భార్య పద్మతో కలిసి ప్రయాణించిన భర్త భాస్కరరావు ఆచూకీ ఇంత వరకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధిస్తూ ఉండేవాడని, అతడే చంపి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకీ తెలిస్తే గానీ హత్యకు గల కారణాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ వేణుగోపాల్‌ సోమవారం సాయంత్రాన్ని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 

ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో 
పెద్దదోర్నాల: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న తండ్రీ కొడుకులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోనికి తీసుకోవటంతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేటకు మండలం అంకురోనిపల్లెకు చెందిన హరిశంకర్‌ నాయక్‌ తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ హైదరాబాద్‌ రోడ్డులోని మన్ననూర్‌ వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్, వాట్సప్‌లలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో తెలంగాణ పోలీసులు శనివారం నుంచి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


పోలీసులు అదుపులోనికి తీసుకున్న తండ్రీ కొడుకులు 

తెలంగాణలోని దోమలపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాలతో పాటు శ్రీశైలం, సుండిపెంట పరిసరాల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఈగలపెంటకు చెందిన ఎస్సై సమాచారం మేరకు పెద్దదోర్నాల ఎస్సై హరిబాబు సైతం వీరి ఆచూకీ కోసం మండల పరిధిలోని చిన్నారుట్ల, శిఖరం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇద్దరు బాలురతో కలిసి తుమ్మలబైలు వద్దకు వచ్చి వెనుదిరిగి వెళ్లినట్లు తమ్మలబైలుకు చెందిన గిరిజనులు  పోలీసులకు సమాచారమందించారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు కాల్‌ డేటా ఆదారంతో హరిశంకర్‌ నాయక్‌తో పాటు ఇద్దరి కుమారులను మండల పరిధిలోని శిఖరం, చిన్నారుట్ల మధ్యలో అదుపులోనిని తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడేందుకు అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement