చిన్నపిల్లల వార్డులో అడ్మిషన్‌లో ఉన్న సుశీల, ఈశ్వర, నందు
పెనుకొండ రూరల్: మండలంలోని గుట్టూరులో ఘోరం జరిగింది. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న గొడవ ఎనిమిది మంది ప్రాణాలపైకి వచ్చింది. భర్త మీద కోపంతో భార్య తన ఏడుగురు పిల్లలకు కేసరిబాద్‌లో పేన్ల మందు కలిపి పెట్టి తనూ తినింది. పిల్లలు వాంతులు చేసుకోవడంతో గుర్తించిన బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. అందరికీ ప్రాణాపాయం తప్పింది. బాధితుల బంధువుల కథనం మేరకు... తమిళనాడుకు చెందిన ఎరుకల నరసింహులు, కళ్యాణి(45) భార్యాభర్తలు. వారి కుటుంబం పదేళ్లుగా గుట్టూరులో స్థిరపడింది. నరసింహులు కూలిపనుల నిమిత్తం తరచూ తమిళనాడుకు వెళ్తుంటాడు. అక్కడ ఆయనకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య అనుమానించేంది. ఈ క్రమంలో తమిళనాడు వెళ్లిన భర్తతో కళ్యాణి ఆదివారం మధ్యాహ్నం ఫోన్‌లో మాట్లాడింది.
వివాహేతర సంబంధంపై ఇద్దరూ గొడవపడ్డారు. మనస్తాపం చెందిన కళ్యాణి పిల్లలతోసహా ఆత్మహత్యాయత్నం చేసింది. కూతుళ్లు శైలజ, రుక్మిణి, వైదేహి, సుశీల, ఇందు, కుమారులు నందు, ఈశ్వర్‌లకు కేసరిబాద్‌లో పేన్ల మందు కలిపి తినిపించింది. తనూ కూడా తీసుకొంది. చిన్నారులు వాంతులు చేసుకుంటూ ఏడుస్తుండటంతో గమనించిన బంధువులు వారిని ఆటోలో పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యసేవల అనంతరం వారి పరిస్థితి మెరుగుపడటంతో ప్రాణాపాయం తప్పింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)లో తల్లి కళ్యాణితోపాటు రుక్కు(17), వైదేహీ(14), చిన్నపిల్లల వార్డులో నందు(7), ఈశ్వర(5), సుశీల(10), శైలజ(11), ఇందు(8) అడ్మిషన్‌లో ఉన్నారు. వారిని పరీక్షించిన వైద్యులు ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు.
డాక్టర్ మండిపాటుతో సిస్టర్ కంటతడి
విషం తీసుకున్న బాధితులను మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆటోలో పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సిస్టర్లు, కిందిస్థాయి సిబ్బందే వైద్యం ప్రారంభించారు. విషయం తెలుసుకుని ప్రభుత్వాసుపత్రికి వచ్చిన డ్యూటీ డాక్టర్ ఆనంద్‌బాబు తనకెందుకు సమాచారం ఇవ్వలేదని సిస్టర్ జలజపై మండిపడ్డారు. దీంతో ఆమె కంటతడి పెట్టారు. పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఒక డాక్టరైతే స్థానికంగానే క్లినిక్ పెట్టుకుని సిబ్బంది ఫోన్ చేసినప్పుడు మాత్రం ప్రభుత్వాసుపత్రికి వచ్చి వెళతారని రోగులు చెబుతున్నారు.
తాగుడుకు బానిసయ్యాడనే...
‘ఐదుగురు ఆడపిల్లలున్నారయ్యా.. ఎప్పుడూ తాగి వస్తాంటే వారి పరిస్థితేంటని చెప్పినా వినడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా తాస్కారం చేస్తున్నాడు. తాగి ఆరోగ్యం చెడిపోయి ఏమైనా అయితే మాకు దిక్కెవరని, కాళ్లు పట్టుకుంటానని మొరపెట్టుకున్నా వినడే. ఎప్పుడో బాధపడేకంటే ఇప్పుడే అందరూ కలిసి వెళ్లిపోతే ఎటువంటి ఇబ్బందీ ఉండదనుకున్నాను. – కళ్యాణి, నరసింహులు భార్య
Comments
Please login to add a commentAdd a comment