సాక్షి, హైదరాబాద్: ‘ప్రజావాణికి వచ్చిన ఓ మహిళ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని, నేను రూ.లక్ష ఇచ్చి పరిష్కరిస్తున్నా అని కేటీఆర్ అన్నట్టు పత్రికల్లో వచ్చింది. నీ రూ.లక్ష కోట్లలో రూ.లక్షను మెడలు వంచి పేదలకు ఇప్పించామంటే ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. అక్రమంగా సంపాదించిన రూ.లక్ష కోట్ల నుంచి రూ.లక్షను ఒక మహిళకు ఇవ్వగలిగాం. ఇంకా రూ.99,999 కోట్లు కేటీఆర్ వద్ద ఉన్నాయి. వాటినీ పంచాల్సిన పరిస్థితిని కల్పిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై న్యాయ విచారణకు ఆదేశిస్తూ ఇప్పటికే ఉత్తర్వులిచ్చాం.
ఈ విచారణలో తేలే అంశాల ఆధారంగా రెవెన్యూ రికవరీ చట్టం కింద తిరిగి వసూలు చేస్తాం..’.’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చార్లెస్ శోభరాజ్‌ను అడిగినా తాను ఏ తప్పు చేయలేదని అంటాడని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంలో ఎల్‌అండ్‌టీ, హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర అధికారుల పాత్ర విచారణలో తేలుతుందని చెప్పారు. ‘వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్నది. ఈరోజు వాళ్లు తినేది ప్రజల రక్తపు కూడు..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలనపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బావాబామ్మర్దుల తాపత్రయమే..
‘శాసనసభలో బావాబామ్మర్దుల (కేటీఆర్, హరీశ్) తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడైనా వీరికి మద్దతుగా లేచి మాట్లాడాడా? వాళ్లిద్దరే ఆరాటపడుతున్నారు. రోళ్లకల్లి నిప్పులు చిమ్మేలా వెనకటికి ఇద్దరు దంచుతున్నారట. ఆ దంచడం చూసి అందరూ అ బ్బా..ఏం దంచుతున్నారు అ ని చప్పట్లు కొట్టుతున్నారట. ఓ అరగంట తర్వాత ఓ ము సలావిడ అక్కడినుంచి పో తూ ఆ రోళ్లో జొన్నలు, సజ్జలు లేవు. ఎంత దంచ్చి నా అలసిపోవడం తప్ప వచ్చేది ఏం లేదని చెప్పిందట. అసెంబ్లీలో కూడా హరీశ్, కేటీఆర్ దంచుడు అలానే ఉంది..’అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు.
భవనాలను కూల్చడం ఆస్తుల సృష్టి కాదు
‘ఉపయోగపడేవాటన్నింటినీ కూల్చి మళ్లీ కట్టారని శ్వేతపత్రంలో చెప్పాం. సచివాలయం భవనాలను కూల్చకుండా కిరాయి భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను తరలించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అచ్చిరాలేదంటే ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి కొత్తగా ఖాళీ జాగాలో సచివాలయం కడితే ఉపయోగపడేది. అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తవి కట్టి ఆస్తి సృష్టించినం అంటున్నారు.
22 ల్యాండ్ క్రూజర్లను కొని దాచిపెట్టారు
నేను కొత్త వాహనాలను కొనొద్దు అని అధికారులకు చెప్పా. పాతబళ్లకు మరమ్మతులు చేయాలని నేను అంటుంటే..22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టామని ఓ అధికారి చెప్పాడు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే తెద్దాం అనుకున్నాం కానీ ఆయన నెత్తిమీద దర్రిదం ఉండి ఇంటికి పోయిండు అని అన్నాడు. మూడోసారి కూడా వస్తాననుకుని కేసీఆర్ తనతో పాటు తన మందిమాగధుల కోసం ఒక్కో బండికి రూ.3 కోట్లు పెట్టి కొన్నారు. ఆయన సృష్టించిన సంపద అలాంటిది. ఆ వాహనాలు ప్రభుత్వ ఆస్తి. తీసుకోకుంటే ఎక్కడికిపోతాయి? కావాలంటే మీకు (జర్నలిస్టులకు) ఇస్తాం. అలా రౌండ్ కొట్టి రండి..’అంటే సీఎం ఛలోక్తి విసిరారు.
ఆ అధికారుల సమాచారం మా వద్ద ఉంది
‘వరంగల్‌లో సైనిక్ స్కూల్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది? ఐటీఐఆర్ కోసం అడగలేని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బుల్లెట్ ట్రైన్ కోసం మేము ప్రధానిని అడగలేదని సుద్దులు చెప్తున్నాడు. గత ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం ఇస్తున్న అధికారుల సమాచారం మా వద్ద ఉంది. నిన్నటి వరకు మీరే మంత్రులు కదా. షాడో టీమ్స్ ఎందుకు? (కొత్త ప్రభుత్వ పనితీరును గమనించేందుకు షాడో టీమ్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనను విలేకరులు గుర్తు చేయగా రేవంత్ ఇలా స్పందించారు) మా కొడంగల్, ఇతర ప్రాంతాల్లో కల్తీ కల్లు దొరకనప్పుడు బాధితులు పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తే కుటుంబ సభ్యులే మంచానికి తాళ్లతో కట్టేస్తారు.
అధికారం పోయిన కేటీఆర్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌తో అలా మాట్లాడుతున్నాడు. కొంత కాలం అతన్నీ తాళ్లతో మంచానికి కట్టాల్సిన పరిస్థితి ఉంటది. అప్పుడే అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని బావాబామ్మర్దులు తోక తెగిన బల్లిలా దుంకుతున్నారు. గత రెండేళ్లుగా డిసెంబర్ 22 నుంచి మార్చి 31 మధ్యనే రైతుబంధు వేశారు. మేం ఈసారి డిసెంబర్ 9నే ప్రారంభించాం..’అని రేవంత్ చెప్పారు.
త్వరలోనే టీఎస్‌పీఎస్సీకి కొత్త బోర్డు
ప్రస్తుత చైర్మన్, సభ్యుల రాజీనామాలను నాలుగైదు రోజుల్లో గవర్నర్ ఆమోదిస్తారు: సీఎం రేవంత్ వెల్లడి
త్వరలోనే టీఎస్‌పీఎస్సీకి కొత్త బోర్డు రానుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో గ్రూప్– 2 పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని బుధవారం సచివాలయంలో మీడియా ప్రశ్నించగా, సీఎం ఈ విధంగా స్పందించారు. ‘టీఎస్‌పీఎస్సీ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఉద్యోగ నియామక పత్రాల జారీకి చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు. న్యాయపరంగా, చట్టరీత్యా చెల్లుబాటు కాదు.
చైర్మన్, సభ్యుల రాజీనామాపై గవర్నర్ నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఇదే సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఆమె రాష్ట్రపతి అనుమతి కోరారు. న్యాయనిపు ణుల సలహాలు తీసుకుని రాజీనామాలను నాలుగైదు రోజుల్లో ఆమోదిస్తారు. ఆ వెంటనే కొత్త బోర్డు నియామకాలు చేపడతాం’’అని సీఎం స్పష్టం చేశారు. ‘మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలండర్ ప్రకారం సంవత్సరం తిరిగే లోపు డిసెంబర్ 9, 2024 నాటికి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇక ఇప్పుడు అభ్యర్థులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు’అని సీఎం వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment