అధికారులు అప్రమత్తంగా ఉండాలి | The authorities need to be vigilant | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Jun 10 2014 1:22 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

The authorities need to be vigilant

  • త్వరలో మంత్రులతో సమీక్ష సమావేశం
  •  సమగ్ర నివేదికలు తయారు చేయండి
  •  జేసీ మురళి ఆదేశం
  •  ప్రజావాణికి అధికారుల గైర్హాజరు
  •  కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
  •  కలెక్టరేట్ (మచిలీపట్నం) : రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి అధికారులకు సూచించారు.  కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన సమస్యలపై మండల, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నివేదికలను సిద్ధం చేయాలని ప్రతి శాఖ జిల్లా అధికారికీ సూచించారు.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారని, వారితో కలిపి త్వరలో కలెక్టర్ రఘునందన్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని ఆయన చెప్పారు. ఇందుకోసం జిల్లా అధికారులందరూ ఆయా శాఖల పరంగా సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు.  

    ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు, బందరు ఆర్డీవో పి.సాయిబాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏ శాఖపరంగా అయితే అర్జీలు తక్కువ సంఖ్యలో వస్తాయో, ఆ శాఖ అధికారులు బాగా పనిచేస్తున్నట్లుగా పరిగణిస్తామని ఈ సందర్భంగా జేసీ అధికారులతో మాట్లాడుతూ అన్నారు.
     
    హాజరైన జిల్లా అధికారులు 12 మందే...
     
    ప్రజావాణి కార్యక్రమానికి ఎక్కువమంది జిల్లా అధికారులు ఈసారీ గైర్హాజరయ్యారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పక హాజరుకావాలని గత సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోకపోవడం గమనార్హం.  మొత్తం 56 శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం 12 మంది జిల్లా అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఆరుగురు అధికారులు వ్యక్తిగత పనులపై కలెక్టర్ అనుమతి తీసుకోగా మిగిలిన వారు కిందిస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకున్నారు.
     
    ప్రజావాణికి వచ్చిన అర్జీలు ఇవీ...
    సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 127 మంది తమ అర్జీలను అధికారులకు అందజేశారు. వాటిలో కొన్ని...
     
    గూడూరు మండలం తరకటూరు దళితవాడ వాసులు ఇళ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  గ్రామస్తుడు ఎస్ ఎలీషాబాబు అర్జీ ఇచ్చారు. వారికి వెంటనే ఇళ్లస్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
     
    గంపలగూడెం గ్రామానికి చెందిన కె.వెంకటసుబ్బమ్మ తాను పదవీ విరమణ చేసి పింఛనుతో జీవిస్తున్నానని, 2012లో మెడికల్ రీయింబర్స్‌మెంట్ మంజూరు కోసం అధికారులకు బిల్లు సమర్పించినా ఇంతవరకు చెల్లించలేదని పేర్కొంటూ అర్జీ ఇచ్చారు.
     
    విజయవాడ నగరంలోని పాయకాపురానికి చెందిన బి.పద్మ జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద ఇళ్లస్థలాలు మంజూరు చేసి తమకు గృహాలు కేటాయించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
     
    నందివాడ మండలం ఇలపర్రు గ్రామ శివారు లక్ష్మీనరసింహాపురంలో 1994లో పేదలకు 72 ఎకరాల భూమిని పంపిణీ చేశారని, ఈ పంపిణీలో అనర్హులకు కూడా భూమి కేటాయించారని గ్రామానికి చెందిన పి.బాలకృష్ణ అర్జీ ఇచ్చారు. అసైన్‌మెంట్ నిబంధనలను పాటించలేదని, ఈ కేటాయింపు విషయంలో విచారణ జరిపి అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు.
     
    నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో కొంతమంది రైతులు అక్రమంగా చెరువులు తవ్వుతున్నారని, వాటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.
     
    జిల్లాలోని వ్యవసాయరంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులందరూ గత మూడు సంవత్సరాలుగా రుణార్హతకు దూరమై అప్పుల బాధలో కూరుకుపోతున్నారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ తెలిపారు. వీరికి వెంటనే గుర్తింపుకార్డులు మంజూరు చేసి రుణాలు పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ ఇచ్చారు.
     
    బందరు మండలం ఎస్‌ఎన్ గొల్లపాలెం హరిజనవాడలో శ్మశానభూమి, డొంకరోడ్డు తరచూ ఆక్రమణలకు గురవుతున్నాయని, ఆక్రమణలను తొలగించి శ్మశానభూమి, డొంకరోడ్లు సర్వే చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామసర్పంచ్ ఎంఎం నాంచారయ్య, మాజీ సర్పంచ్ సీహెచ్ రామచంద్రరావులు అర్జీ ఇచ్చారు.
     
    జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని దళిత గిరిజన సర్పంచుల పరిరక్షణ సంఘం గౌరవాధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారు. సర్పంచులకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలని కోరారు.
     
    హాజరుకాని వారికి మెమోలు...

    ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులకు మెమోలు జారీ చేయాలని ఏజేసీ చెన్నకేశవరావు డీఆర్వోకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఒక్కొక్క అధికారి హాజరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని, ఎటువంటి సమావేశాలూ నిర్వహించకూడదని చెప్పారు. జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి పంపినా హాజరుకావద్దని కిందిస్థాయి సిబ్బందికి ఏజేసీ సూచించారు.

    వరుస ఎన్నికలు, సమైక్యాంధ్ర ఉద్యమం, తుపానులు, వరదల కారణంగా సంవత్సరం నుంచి అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం చినబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎంవీవీ సత్యనారాయణ, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ, డీఈవో దేవానందరెడ్డి, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement