ఎర్ర రిషిత
కరీంనగర్‌సిటీ : సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు. ప్రధానంగా డబుల్‌బెడ్‌రూంల మంజూరు, భూ సమస్యలు, ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువగా అర్జీలు సమర్పించారు. జిల్లావ్యాప్తంగా గత సోమవారం కంటే వంద అర్జీలు తగ్గాయి. 121 మంది బాధితులు దరఖాస్తులను అధికారులకు విన్నవించారు. ఎండల తీవ్రతతో జనం బయటికి రాలేకపోతున్నారు. బాధితుల నుంచి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ బద్రి శ్రీనివాస్, డీఆర్‌వో అయేషా మస్రత్‌ఖానమ్, ఆర్డీవో రాజాగౌడ్‌లు అర్జీలు స్వీకరించారు.
ఎండ.. అధికారుల ఎఫెక్ట్
ప్రజావాణికి ఎండతోపాటు జిల్లా అధికారులు కానరాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏసీల ఎఫెక్టో.. ఏమోనని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం ప్రజావాణికి జిల్లా అధికారులు డుమ్మా కొట్టారు. తమ శాఖల్లోని కిందిస్థాయి అధికారులను ప్రజావాణికి పంపించి ప్రజాసమస్యలపై తమ శ్రద్ధ ఏంటో స్పష్టం చేశారు. కొంత మంది టూర్‌లు అని ప్రజావాణికి ఎగనామం పెట్టారు.
కొంతమంది జిల్లా అధికారులు మాత్రమే తమ చిత్తశుద్ధిని కనబరిచారు. అందులో ఎక్కువగా మహిళా అధికారులే ఉన్నారు. ఇక ఖాళీ కుర్చీల స్థానంలో అక్కడికి వచ్చిన బాధితులతో సీట్లు నిండుగా దర్శనమిచ్చాయి. కలెక్టర్ పదేపదే చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నా భర్త మనసు మార్చండి..
నాకు రెండేళ్ల క్రితం శంకరపట్నం మండలం ఆముదాలపల్లి వాసి అయిన రాజేశ్‌తో కట్నకానుకల లాంచనలాలతో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం స్వగ్రామంలో కాకుండా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముంటున్నాం. వివాహం జరిగిన 8 నెలలే కలిసి ఉన్నాం. నాకు ఒక బాబు పుట్టాడు. భర్త మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
పెద్దమనుషులకు విన్నవించినా వారి మాటవినకుండా టార్చర్ చేశాడు. 3 నెలల నుంచి బాబును, నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను పుట్టింటి నుంచి తీసుకెళ్లడం లేదు. నా భర్త, ఆడపడుచు, అత్తగార్లను పోలీసుల ద్వారా పిలిపించి కౌన్సెలింగ్ చేయించి నా కాపురాన్ని చక్కదిద్ది న్యాయం చేయాలని వేడుకుంటున్నా. - ఎర్ర రిషిత, కాపువాడ కరీంనగర్
నేను సచ్చినంక ఇస్తరా..
నాకు ఎనబై ఏళ్లు దాటినయి. శాతనైతలేదు. నా తల్లి పేరు మీద నుంచి వారసత్వంగా వచ్చిన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. రెండేళ్లుగా ప్రజావాణిని ఆశ్రయిస్తున్నా. ఇప్పటివరకు 103 దరఖాస్తులు సమర్పించుకున్నా. గ్రామంలో 32 గుంటల నా భూమిని కబ్జా చేశారని, కబ్జాదారులు భయబ్రాంతులకు గురిచేయడంతోపాటు దాడి కూడా చేశారంటూ అధికారులకు విన్నవించాను. ప్రస్తుతం నగరంలో ఓ అద్దె నివాసంలో ఉంటూ ప్రతినెలా వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛన్‌పై ఆధారపడి జీవి స్తున్నాను.
ఈ అధికారుల తీరుతోటి కలెక్టరేట్‌లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాను. వెయ్యి రూపాయల పెన్షన్‌తో అద్దె ఇంట్లో బతుకుతున్న. ఇల్లు కిరాయి కూడా ఎళ్తలేదు. పనిచేయడానికి కూడా చాతనైతలేదు. కోర్టుల చుట్టూ తిరిగి పోరాడే శక్తి లేదు. కలెక్టరేట్‌కు వస్తే తొందరపడకు వస్త ది అంటుండ్రు. ఇంకెప్పుడస్తది.. నేను సచ్చినంక వస్తదా!! హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో 714 సర్వే నంబర్‌లోని 32 గుంటల భూమిని ఇప్పించి న్యాయం చేయాలి. - కన్నం వెంకటయ్య, రాంపూర్, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment