న్యాయం చేయాలని అత్తింటి ఎదుట ధర్నా చేస్తున్న కోడలు
సాక్షి, మన్సూరాబాద్ : వివాహం చేసుకున్న వారం రోజులకే భార్యను వదిలించుకోవాలని వేధింపులకు పాల్పడుతున్న అత్తింటి ఎదుట కోడలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని రాక్‌టౌన్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్‌నగర్‌కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్, పద్మలకు ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా ముంబాయిలో ఉంటున్నాడు. ఈ ఏడాది జనవరి 8న వారి పెద్ద కుమార్తె తేజస్వీనితో రాక్‌టౌన్‌కాలనీకి చెందిన బత్తులు ఏడుకొండలు–సుశీల పెద్ద కుమారుడు వెంకటేశ్వర్‌రావు అలియాస్ వెంకటేశ్వర్లు (30)తో వివాహం జరిగింది.
వెంకటేశ్వర్లు నగరంలో క్లేవ్‌టెక్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తేజస్వీని బీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. వివాహ సమయంలో సుమారు రూ.20లక్షల వరకు బంగారం, కట్న కానుకలుగా అందజేశారు. వివాహ సమయంలో తన భర్త నానమ్మ అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి వివాహ తంతుని త్వరగా ముగించారు. వివాహమైన వారం రోజుల తరువాత నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితురాలు తెలిపింది. భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఎలాగైన వదిలించుకోవాలని పథకం ప్రకారం కాపురానికి తీసుకురాకుండా పుట్టింటి వద్దనే బాధితురాలిని ఉంచుతున్నారు.
అంతేకాకుండా తన భర్త వెంకటేశ్వర్‌రావు కాపురానికి పనికిరాడనే విషయం కుటుంబసభ్యులకు తెలిసినా వివాహం జరిపించారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఈనెల 24న ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయగా అక్కడ వారికి కౌన్సెలింగ్ చేశారు. పెద్దల సమక్షంలో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించుకుంటామని తన భర్త కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారన్నారు. ఇప్పటి వరకు స్పందన లేకపోవటంతో మంగళవారం ఉదయం అత్తింటి ఎదుట న్యాయం చేయాలంటూ బాధితురాలు ధర్నాకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment