లక్డీకాపూల్: ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ప్రధానంగా ధరణి, భూ సమస్యలను పరిష్కరించాలంటూ ఎక్కువమంది రాగా, కొండ పోచమ్మ సాగర్ బాధితులు, టీఎస్పీఎస్సీ రద్దు చేయాలంటూ నిరుద్యోగులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు విన్నవించారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మంత్రితో పాటు ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన ఉన్నారు.
ఆటోవాలాలపై విధానపరమైన నిర్ణయం
ప్రజావాణి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అందరి సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. మంగళవారం ప్రజా వాణి కార్యక్రమంలో 5,324 వినతి పత్రాలందాయని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోవాలాలు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు, రేషన్, భూసమస్యల వంటివన్నీ ఆరు గ్యారంటీల అమలుతో పరిష్కారమవుతాయని మంత్రి అన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాదీనం చేసుకోవాలి
తెలంగాణలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డిపాజిట్‌దారులకు తక్షణమే డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. బాలమల్లేష్ ప్రజావాణిలో కోరారు. మాజీ హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల మాజీ హోంగార్డుల ప్రతినిధులు ఇందిర, యూనస్ మహ్మద్ వ్రిజ్ఞప్తి చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి న్యాయం జరగలేదన్నారు.
ఇంకా పలు సమస్యలపై..
ప్రభుత్వ పాఠశాల్లోని స్వచ్ఛ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు, ప్రమీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 28 వేల మంది కార్మికులకు నిధుల కొరత పేరిట గ్రా మ పంచాయతీలు వేతనాలు చెల్లించడం లేదన్నా రు. కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో బాధితులు పాదయాత్రగా ప్రజాభవన్‌కు వచ్చి కొండపోచమ్మ సాగర్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలకు అనుమతించాలని స్పౌజ్ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం నుంచి 10గంటల్లోపు వచ్చిన వారికి మాత్రమే
శుక్రవారం నుంచి ఉదయం 10 గంటలలోపు వచ్చిన వారికే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు ప్రజా భవన్ అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రజాభవన్ వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment