- ప్రజావాణిలో అధికారులకు ఏజేసీ సూచన
- 130 దరఖాస్తుల రాక
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణిలో అర్జీదారులు పేర్కొన్న సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని దాదాపు రెండు నెలల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభించారు.
కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు దరఖాస్తుదారుల నుంచి వచ్చి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఎన్నికల విధులు ముగిశాయని, ఇకపై ప్రజావాణి అర్జీలపై అధికారులు దృష్టిసారించాలని చెప్పారు.
వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి అప్పగించకుండా అర్జీదారు ఇచ్చిన సమస్యను పరిష్కరించాలన్నారు. అర్జీదారుడికి న్యాయమైన పరిష్కారం చూపి వారిలో నమ్మకం కలిగించాలని సూచించారు. పరిష్కరించిన అర్జీలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఖరీఫ్ సీజన్, విద్యాసంవత్సరం ప్రారంభం కావస్తున్నాయని, ఇకపై అర్జీలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఏజేసీ తెలిపారు.
ఆలస్యంగా వచ్చిన అధికారులు...
రెండు నెలల తరువాత నిర్వహించిన ప్రజావాణి తొలి కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా హాజరుకావడం గమనార్హం. సాధారణంగా ప్రజావాణి కార్యక్రమానికి 60 నుంచి 70 మంది అధికారులు, సిబ్బంది హాజరవుతారు. సోమవారం మాత్రం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి తొలుత కేవలం పది, పదిహేను మంది అధికారులు మాత్రమే వచ్చారు. 11.30 నుంచి 12 గంటలలోపు ఒక్కొక్క అధికారి రావటం ప్రారంభించారు.
కలెక్టర్ రఘునందనరావు ప్రజావాణి కార్యక్రమానికి హాజరైతే అధికారులు 10 నిమిషాలు ముందుగానే సమావేశపు హాలుకు చేరుకునే అధికారులు.. కలెక్టర్, జేసీ రారని తెలియటంతో ఆలస్యంగా హాజరవటం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి లక్ష్మీదుర్గ, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో డి.పద్మావతి, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్‌వో పీబీ సంధ్యారాణి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దృష్టికి వచ్చిన పలు సమస్యలివీ...
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న తమకు గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని 104 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శాంతికుమార్ అర్జీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించి 24 రోజుల పని దినాలను అమలు పరచాలని అర్జీలో కోరారు.
రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణాజిల్లాకు నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేయాలని ప్రముఖ న్యాయమూర్తి కంచర్లపల్లి శివరామప్రసాద్ అర్జీ ఇచ్చారు. జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన నందమూరి తారక రామారావును గుర్తించి జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన అర్జీలో కోరారు.
వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఎస్.మోహనరెడ్డి తన వ్యవసాయ భూములకు సంబంధించి అడంగల్‌లో తప్పుగా నమోదైందని, ఆ వివరాలను సరిచేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
తమ భూముల సరిహద్దుల్లో అక్రమంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారని, వాటిని నియంత్రించాలని కోరుతూ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని మండవల్లి మండలం లోకుమూడి గ్రామానికి చెందిన బొందలపాటి గిరిధరవరప్రసాద్, గ్రామస్తులు అర్జీ అందజేశారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెడన పట్టణం 22వ వార్డులో ఇళ్ల మధ్యలో కలంకారీ ఉడుకుల పొయ్యిను ఏర్పాటు చేయటం వల్ల దట్టమైన పొగతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని యర్రా బాలసుబ్రమణ్యం అర్జీ అందజేశారు. కాలనీవాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇళ్ల మధ్యలో ఉన్న పొయ్యిను తొలగించాలని ఆయన కోరారు.
మోపిదేవి మండలం కోసూరివారిపాలేనికి చెందిన కోసూరి వెంకటేశ్వరరావు 2014 ఏప్రిల్ 22న విద్యుత్‌షాక్‌కు గురై మరణించారని, కుటుంబ సభ్యులకు లోకాయుక్త ఆదేశాల మేరకు సహాయం అందజేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ అందజేశారు. ఆపద్బందు పథకం కింద రూ.50 వేలు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ లక్ష రూపాయలు మంజూరు చేయాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిందని ఆయన అర్జీలో పేర్కొన్నారు.
కృత్తివెన్ను మండలంలోని ఇంతేరు గ్రామంలో చౌకధరల దుకాణం యజమాని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గ్రామానికి చెందిన తమ్ము ఆంజనేయులు అర్జీ ఇచ్చారు. చనిపోయిన రేషన్‌కార్డుదారుల రేషన్‌ను అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారని, షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.