కాగితాలకే జన‘వాణి’
- పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి అర్జీలు
- పట్టించుకోని అధికారులు
- ఆందోళనలో అర్జీదారులు
చిలకలపూడి : ...ఇలా గజ్జలకొండ వెంకట నరసింహారావు, బోలెం శ్రీనివాసరావు మాత్రమే కాదు.. ఎంతోమంది ప్రజల విన్నపాలను అధికారులు ఇలా విని.. అలా వదిలేస్తున్నారు. ప్రజా‘వాణి’ని కాగితాలకే పరిమితం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారుల సమక్షంలో అప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రతి అర్జీని 15రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. సమస్య పరిష్కారం కాని పక్షంలో అర్జీదారులకు తెలియజేయాలి. అధికారులు ఈ విధివిధానాలను పాటించకపోవడంతో అర్జీదారులు తమ సమస్యను పరిష్కరించాలని రెండు, మూడుసార్లు దూరప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి ప్రజావాణికి వచ్చి వినతిపత్రాలు అందజేస్తున్నారు.
పరిష్కారం కాని అర్జీలు 1,700
ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అర్జీల్లో 1,700 వరకు పరిష్కారానికి నోచుకోలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని వివిధ శాఖల జిల్లా కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయంలో 83, ఎస్పీ కార్యాలయంలో 329, విజయవాడ నగరపాలక సంస్థలో 73, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో 58, విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 38, మచిలీపట్నం మునిసిపాల్టీలో 37, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్స్ కార్యాలయంలో 20, అటవీశాఖకు సంబంధించి 18 అర్జీలు పరిష్కారం కాలేదు.
స్పందించిన అధికారులకు మెమో..
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కారమయ్యాయి... ఎన్ని కాలేదు.. ఎందుకు కాలేదు.. అనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా సీసీఎల్‌ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలిస్తూనే ఉంటారు. గతంలో ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన అర్జీలను 15 రోజుల్లోగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారికి మెమో కూడా జారీ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
కలెక్టర్ ఉంటేనే అధికారుల హాజరు!
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో మొత్తం 56 శాఖల అధికారులు స్వయంగా హాజరుకావాల్సి ఉంది. కలెక్టర్ లేకపోతే జేసీ, ఏజేసీ, డీఆర్వో స్థాయి అధికారులు ప్రజావాణి నిర్వహిస్తే జిల్లా అధికారులు హాజరుకాకుండా కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే పంపి చేతులు దులిపేసుకుంటున్నారు. కలెక్టర్ హాజరైనప్పుడు మాత్రమే ఎక్కువ మంది జిల్లాస్థాయి అధికారులు వస్తున్నారు. ప్రజావాణికి హాజరుకాని వారికి మెమోలు జారీ చేసినా అధికారుల్లో పెద్దగా మార్పు లేదు. మరోవైపు అర్జీదారుల సమస్యలను జిల్లా అధికారులు అవగాహన చేసుకుని వాటిలో ముఖ్యమైన వాటికి ప్రాధాన్యతను ఇచ్చి స్వయంగా సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించినా ఫలితం ఉండటం లేదు. అర్జీదారులు మళ్లీ, మళ్లీ రాకుండా అధికారులు పరిష్కారానికి శ్రద్ధ చూపాలని కోరినా పెడచెవిన పెడుతున్నారు.
చినపులిపాక గ్రామంలో నేను సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని అధికారులకు దరఖాస్తు చేసి ఆరు నెలలు పూర్తి కావచ్చింది. ప్రజావాణిలో ఐదుసార్లు అధికారులకు విన్నవించుకున్నా. సమస్య పరిష్కారం కాలేదు.
- గజ్జలకొండ వెంకట నరసింహారావు,
చినపులిపాక, తోట్లవల్లూరు మండలం
నేను పుట్టుకతో వికలాంగుడిని. ఇంటి స్థలం ఇవ్వాలని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని అర్జీ పెట్టుకున్నా. ఎన్నోసార్లు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదు.
- బోలెం శ్రీనివాసరావు, గరికపర్రు