సమస్యలు యథాతథం ! | Issues unchanged | Sakshi
Sakshi News home page

సమస్యలు యథాతథం !

Published Tue, May 26 2015 1:38 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

Issues unchanged

ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో సగం కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. కలెక్టర్ అధ్యక్షతన జరిగే ప్రజావాణిలో వినతులు అందజేస్తే పరిష్కారం వెంటనే లభిస్తుందని ఆశిస్తున్న ఫిర్యాదుదారులకు నిరాశే మిగులుతోంది. 15 రోజుల్లో పరిష్కారం కావాల్సిన వినతులకు మోక్షం లేకపోవడంతో వచ్చిన వారే
 మళ్లీ మళ్లీ వస్తూ..వినతులు అందజేస్తున్నారు.
 
 శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల విభాగానికి స్పందన కరువైందనే విమర్శలు వస్తున్నాయి. వినతి అందజేసిన 15 రోజుల్లో సమస్య పరిష్కారం కావాల్సి ఉన్నా ఆ పరిస్థితి కానరావడం లేదు. జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వందలాది మంది ప్రజలు వారి సమస్యలను కలెక్టర్‌క మొరపెట్టుకుంటారు. అయితే వీటిలో ఎన్ని పరిష్కారం అవుతున్నాయనే దానిపై సమీక్షలు లేకపోవడంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి. గ్రీవెన్స్‌కి వచ్చిన వినతులను సంబంధిత క్షేత్రస్థాయి అధికారికి పంపిస్తునప్పటికీ అవి అక్కడ బుట్టదాఖలవుతున్నాయి. గతంలో మండలస్థాయిలో ఇచ్చిన వినతులుగానే చూస్తూ ఫిర్యాదులను పక్కనపెడుతున్నారు. దీంతో ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది.
 
  జిల్లా వ్యాప్తంగా సుమారుగా అన్నిశాఖలు, కార్యాలయాలు కలిపి 191 విభాగాల్లో ప్రజావాణి పనిచేస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు వివిధ శాఖలకు 7,885 ఫిర్యాదు అందాయి. వీటిలో సకాలంలో 4,875 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. మిగిలిన వాటికి అతీగతిలేదు. పైగా పరిష్కారం చేయడానికి ఇష్టం లేని వినతులకు వివిధ అడ్డుంకులు చూపి వాయిదాలు వేయడం కొన్నిశాఖలకు పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ శాఖపై పర్యవేక్షణ లేపోవడం, ఇతర పనుల ఒత్తిడి కారణంగా కనిపిస్తోంది.
 
 జిల్లాలో గడచిన నాలుగు నెలలుగా వచ్చిన ప్రజావాణి వినతులు, వాటి పరిష్కారాలు, పెండింగ్ వివరాలు శాఖల వారీగా చూస్తే...
 జిల్లా రెవెన్యూ అధికారికి 178 ఫిర్యాదులు రాగా 65 పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 168 కాగా 11, పశుసంవర్ధకశాఖకు 30 రాగా 21, డ్వామాకు 189 రాగా 90, ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు 22 రాగా 21 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారికి 115 ఫిర్యాదులు రాగా 90, ఇరిగేషన్ శాఖకు 40 ఫిర్యాదులు రాగా తొమ్మిది మాత్రమే పరిష్కారమయ్యాయి. పరిశ్రమల శాఖకు 10 ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖకు 14 ఫిర్యాదులుగా 8 పరిష్కారమయ్యాయి. కార్మికశాఖకు 22 రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. వ్యవసాయశాఖకు 116 ఫిర్యాదురాగా 44 మాత్రమే పరిష్కారమైనట్టు రికార్డులు చెబుతున్నాయి. తూనికలు, కొలతల శాఖకు ఒక ఫిర్యాదు రాగా అదీ పరిష్కారానికి నోచుకోలేదు. జిల్లా ప్రభుత్వాస్పత్రికి 31 ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. పోలీసు శాఖకు సంబంధించి 94 ఫిర్యాదు రాగా ఒకటి మాత్రమే పరిష్కారం కాలేదు.  జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి నాలుగు ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కరించలేదు. భూసేకరణ యూనిట్ -1 కు 91 ఫిర్యాదులు రాగా 10 మాత్రమే పరిష్కారమయ్యాయి. మున్సిపల్ కమిషనర్‌కి పది ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. గిరిజన సంక్షేమశాఖ (ఇంజినీరింగ్)  39 ఫిర్యాదులకు రాగా ఒక్కటీ పరిష్కారం కాలేదు. గిరిజన సంక్షేమశాఖ డీడీకి 139  ఫిర్యాదులు రాగా ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు.
 
 నాలుగుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశా
 హుద్‌హుద్ తుపాను నష్టపరిహారం జాబితాల తయారీలో అవకతవకలు జరిగాయని ప్రజావాణిలో నాలుగుసార్లు (ఫిబ్రవరి-16, ఫిబ్రవరి 23, మే18, మే 25)  ఫిర్యాదు చేశాను. తుపాను తాకిడికి వలలు, బోట్లు, తెప్పలకు నష్టం జరిగిందని, అయితే పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదులో విన్నవించాను. కలెక్టర్‌కు, ముఖ్యమంత్రికి కూడా ఫ్యాక్స్ పంపించాను. అయినా ఇంతవరకు స్పందనలేదు. దరఖాస్తు తీసుకుంటున్నారు తప్పితే చర్యలు లేవు.- చింతపల్లి తోటయ్య డి.మత్స్యలే శం,
 ఎచ్చెర్ల మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement